హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకు జీహెచ్ఎంసీ తరఫున రాయితీ ఇస్తామని తెలిపింది. నగరంలో ప్రతి కిలోమీటరుకు మహిళల కోసం ఒక మరుగుదొడ్డి…ఏటా కొత్తగా మూడు మహిళా పోలీస్స్టేషన్ల చొప్పున మొత్తం 15 ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అలాగే ప్రజలపై పెను భారం మోపుతున్న భూ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని, వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని భాజపా హామీ ఇచ్చింది. లక్ష మంది అర్హులైన పేదలకు సొంతిళ్లు.. సుమేథ పేరుతో కొత్త చట్టం తెచ్చి రూ.10 వేల కోట్లతో వంద రోజుల్లో ఓపెన్ నాలాలు.. డ్రైనేజీ ఆధునికీకరణ.. నాలాలు, చెరువుల్లో ఆక్రమణల తొలగింపుతో పాటు పలు హామీలిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల భాజపా మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ గురువారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి కొనుక్కున్న ప్లాట్లపై భూ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకం పేరుతో పన్నుల భారం మోపుతుండటం అన్యాయమని, దీన్ని అమలు కానివ్వబోమని భాజపా పేర్కొంది. ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే జీహెచ్ఎంసీ ఆ భారాన్ని భరిస్తుందని, దీనివల్ల మూడు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేసింది. ఇటీవల వర్షాలకు నగరంలో నీట మునిగిన బాధిత కుటుంబాలకు రూ.25 వేల పరిహారం అందిస్తామంది. ఇప్పటికే రూ.10 వేలు అందుకున్న వారికి మరో రూ.15 వేలు జమ చేస్తామంది. నగరంలో నల్లా లేని పేదలకు ఉచితంగా ఏర్పాటు చేస్తామని, 24 గంటల పాటు ఉచితంగా మంచినీళ్లు సరఫరా చేస్తామంటూ ప్రణాళికలో తెలిపింది. పాత హైదరాబాద్లో ఏడాదికి రూ.600 కోట్ల విలువైన విద్యుత్తు చౌర్యానికి అడ్డుకట్ట వేస్తామంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ద్విచక్రవాహనాలు, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న అపరాధ రుసుం, చలానాలన్నీ రద్దు చేస్తామంది. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని, నగరంలో స్మృతివనం నిర్మిస్తామని చెప్పింది.
హైదరాబాద్ మహిళలకు భాజపా వరం
Related tags :