పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు ఉన్నాయి

అయ్యప్ప కొలువైన శబరిమల క్షేత్రాన్నిఇకపై మహిళలు కూడా సందర్శించవచ్చని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ నాటివరకూ మహిళలకు ప్రవేశంలేని మందిరాలకు సంబంధించి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హర్యానాలోని పెహవాలోగల కార్తికేయ భగవాన్ మందిరం, మహారాష్ట్రలోని సతారాలో కొలువైన ఘటయీ దేవీ మందిరం, సోలాలోని శివలింగమందిరం, అసోంలోని బర్పెచటాలోని వైష్ణవ్ మందిరం, జార్ఖండ్‌లోని బొకారోలోగల మంగళ్ చండీ‌మందిరం, ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తరీలోగల మవాలీమాతా మందిరం తదితర ఆలయాలలో ఇనాటివరకూ మహిళలను అనుమతించడంలేదు. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో ఇటువంటి మందిరాలలోనూ భవిష్యత్‌లో మహిళలను అనుమతించేందుకు అవకాశం ఏర్పడనున్నదని తెలుస్తోంది.
1.పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు
శబరిమల అయ్యప్ప గుడిలోకి అన్ని వయస్కుల మహిళలకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశంపై ఆంక్షలు ఉండగా, మరికొన్ని గుడుల్లో పురుషులకు ప్రవేశం కల్పించడంపై నిషేధం ఉంది. ఆ ఆలయాలు ఏంటంటే..కామాఖ్య పీఠం, విశాఖపట్నం ఏపీలోని విశాఖపట్నంలో కామాఖ్య పీఠంలో నారీపూజ జరిగేటప్పుడు(నాలుగు, ఐదు రోజుల పాటు) మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. స్త్రీల రుతుచక్ర సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధన అమల్లో ఉంటుంది.బ్రహ్మ గుడి, పుష్కర్‌(రాజస్థాన్‌): రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉన్న బ్రహ్మ దేవాలయంలో పెళ్లైన పురుషులకు ప్రవేశం ఉండదు. సన్యాసులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి, బ్రహ్మ దేవుడికి పూజలు చేయడానికి అవకాశం ఉంది. భక్తులు చెల్లించే మొక్కులను బ్రహ్మచారి అయిన పూజారి గుడి వెలుపల స్వీకరిస్తారు.దేవి కన్యాకుమారి ఆలయం, తమిళనాడులోని కన్యాకుమారి వద్ద కుమారి అమ్మాన్‌ దేవాలయం ఉంది. దుర్గామాత కొలువు దీరిన ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం ఉండదు. మహిళలు మాత్రమే పూజిస్తారు. సింహద్వారం వరకు సన్యాసులకు ప్రవేశం ఉంటుంది. పెళ్లైన పురుషులను ఈ గుడి ప్రాంగణంలోకి కూడా రానివ్వరు. మాతా దేవాలయం, ముజఫర్‌పూర్‌: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న మాతా ఆలయంలోకి కూడా పురుషులకు ప్రవేశం కల్పించరు. బహిష్టు రోజుల్లోనూ మహిళలకు ఈ గుడిలోకి ప్రవేశం ఉంటుంది.
2.మహిళలకు ప్రత్యేక ‘క్యూ’లు సాధ్యం కాదు- కేరళ ప్రభుత్వం
శబరిమల ఆలయం వద్ద మహిళల కోసం ప్రత్యేక ‘క్యూ’లను ఏర్పాటు చేయడం ఆచరణసాధ్యం కాని అంశమని కేరళ ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. అత్యధిక మహిళా భక్తులు తమ కుటుంబానికి చెందిన పురుషులు, లేదంటే ఇతర భక్తులతో కలిసి వస్తారు. ఒకవేళ ప్రత్యేక ‘క్యూ’లను కనుక ఏర్పాటు చేస్తే…..మహిళలు తమ వెంట వచ్చిన వారి నుంచి వేరై పోయే ప్రమాదం కూడా ఉంటుందని దేవోస్వోమ్ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. మహిళా భక్తుల కోసం కల్పించాల్సిన వసతులు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని అత్యున్నతస్థాయి సంఘం కూలంకషంగా చర్చించింది. అన్ని వయసుల మహిళలకూ ఆలయ ప్రవేశానికి వీలుకల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించిన నేపథ్యంలో అత్యన్నతస్థాయి సంఘం ఆయా ఏర్పాట్ల గురించి చర్చలు జరిపింది.అనంతరం సురేంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ…,దర్శనంకోసం భక్తులు8-10 గంటల పాటు క్యూలలో వేచి రావలసి ఉంటుంది. అందుకు, మహిళాభక్తులు సైతం సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చెప్పారు.
3. రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయం -ఒక్క రోజులో 5,13,566 అమ్మకం
భక్తులు అపురూపంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని తితిదే రికార్డు స్థాయిలో తయారు చేసి విక్రయించింది. తమిళులు పవిత్రంగా భావించే పురటాసి మాసంలో భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. వీరికి కోరిన మేర అందించేందుకు తితిదే లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతోంది. సెప్టెంబరు 30న తితిదే చరిత్రలో మొదటిసారిగా 5,13,566 లడ్డూలు తయారు చేసి భక్తులకు విక్రయించింది. గతంలో 2016 అక్టోబరు 10న 4,64,152 లడ్డూలు, 2017 మే 28న 4,32,745, 2018 మే 19న 4,14,987, 2017 జూన్ 11న 4,11,943 లడ్డూలను విక్రయించింది.
*1.05 లక్షల మందికి శ్రీవారి దర్శనం
శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులకు రాయితీపై 2, అదనపు లడ్డూల కింద 2 చొప్పున ఒక్కొక్కరికి 4 లడ్డూలను తితిదే అందిస్తోంది. కాలినడకన వస్తూ దివ్యదర్శనం టోకెన్లు పొందే వారికి ఉచిత లడ్డూతో పాటు మొత్తం 5 లడ్డూలు లభిస్తాయి. ఆదివారం శ్రీవారిని 1.05 లక్షల మంది దర్శించుకున్నారు. వీరితో పాటు ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు లడ్డూ ప్రసాదం అందుతుంది. ఇలా మొత్తంగా ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలను అందించినట్లు తితిదే వర్గాలు తెలిపాయి.
4. ఆదిత్యునికి కిరణస్పర్శ
శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ దేవాలయమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం సోమవారం ఆవిష్కృతమైంది. సూర్యుడు దక్షిణాయనంలో మారే సందర్భంగా సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్తాయి. సోమవారం ఉదయం 6.05 గంటలకు ఈ సూర్యకిరణ స్పర్శ ప్రారంభమై 6.08 గంటల వరకు భక్తులకు కనువిందు చేసింది. మంగళ, బుధవారం సైతం ఈ కిరణ స్పర్శ ఉంటుంది.
5. ఇలా రండి.. అలా వెళ్లండి..
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. మరో పది రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, భవానీలు ఈ సందర్భంగా నగరానికి తరలి వస్తారు. జగ్గజ్జననిని దర్శించుకునేందుకు లక్షలాదిగా బారులు తీరుతారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేయగా.. నగర పోలీసు కమిషనర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవ్వరూ ట్రాఫిక్‌ ఇక్కట్లను ఎదుర్కొనకుండా విజయవాడ్‌ పోలీసులు ప్రత్యేక ‘ట్రాఫిక్‌ యాప్‌’ను రూపొందించారు. ఈ యాప్‌ను ఉపయోగించుకుని భక్తులు సమీప పార్కింగ్‌ కేంద్రాలకు చేరుకోవచ్చు. అలాగే ఉత్సవాల నేపథ్యంలో నగరంలోకి గడ్డిలారీలు, ఊకలారీలకు అనుమతులు నిషేధించనున్నారు. వినాయక గుడి, కుమ్మరిపాలెం వరకుమాత్రమే భక్తుల వాహనాలను అనుమతిస్తారు. ఇక అక్కడి నుంచి 750 మీటర్ల ఘాట్‌ రోడ్డులో దుర్గగుడికి భక్తులు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులకు మాత్రం లిఫ్ట్‌ సౌకర్యం ఉంటుంది. అలాగే వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి వరకు అనుమతి ఉన్న వాహనాలు తప్ప ఏ విధమైన వాహనాల రాకపోకలకు అనుమతి ఉండబోదు. ఇక వీఐపీలందరికీ పున్నమి గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాట్లు చేశారు.
**మొదటి మూడు రోజులు ఇలా..
దుర్గమ్మ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఈసారి వినూత్న రీతిలో ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఈ ఏడాది డైనమిక్‌ వెహికల్‌ ట్రాఫిక్‌ పద్ధతిన ఏర్పాట్లు చేయనున్నారు. బ్రహ్మోత్సవాలు మొదలైన మొదటి మూడు రోజులు హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు, అలాగే హైదరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను కాళేశ్వరరావు మార్కెట్‌ మీదుగానే వెళ్లవచ్చు. అంటే పీఎన్‌బీఎస్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలన్నీ కాళేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్, టన్నెల్, గొల్లపూడి మీదుగా వెళ్లవచ్చు. ఇక హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి, సితార జంక్షన్, సీవీఆర్‌ ఫ్లై ఓవర్, పాల ఫ్యాక్టరీ, వెస్ట్‌ గేట్, కాళేశ్వరరావు మార్కెట్‌ బస్టాండ్‌ మీదుగా పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌కు మళ్లిస్తారు.
**రద్దీ రోజుల్లో ఇలా..
సెలవు రోజులతోపాటు మూల నక్షత్రం, విజయదశమి రోజుల్లో మాత్రం మార్పులు ఉండబోతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో డైనమిక్‌ వెహికల్‌ ట్రాఫిక్‌ పద్ధతిలో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. హైదరాబాద్‌ నుంచి నగరానికి వచ్చే ఆర్టీసీ బస్సులను గొల్లపూడి, సితార జంక్షన్, కబేళా, సీవీఆర్‌ ఫ్లై ఓవర్, వైవీరావు ఎస్టేట్, ఆంధ్రప్రభ కాలనీ, ఏఎస్‌ నగర్‌ ఫ్లై ఓవర్‌ మీదుగా పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లోకి మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు కూడా ఇదే మార్గాల గుండా వెళ్తాయి.
6. బాస‌ర శరన్నవరాత్రి మ‌హోత్స‌వాల‌కు మంత్రి అల్లోలకు ఆహ్వానం
బాసర జ్ఞాన సరస్వతి అమ్మ‌వారి శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని ఆల‌య క‌మిటీ ఆహ్వానించింది. మంగ‌ళ‌వారం మంత్రి నివాసంలో ఆయ‌న‌ను క‌లిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ నెల  నుంచి 18వ తేదీ వ‌ర‌కు శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు జ‌రుగనున్నాయి. మ‌హోత్స‌వాల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ క‌మిటీఅధికారులు తగిన చర్యలు తీసుకోవాల‌ని మంత్రి వారికి సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com