గంజి వార్చిన అన్నం అయితే….

అన్నము గురించి సంపూర్ణ వివరణ

🔹 అన్నం అగ్నిదీపనం చేయును .

🔹మలమూత్ర విసర్జనకారిగా ఉండును.

🔹చక్కగా వండి గంజివార్చిన అన్నం శరీరం నందు వేడిని కలిగించును. శరీరముకు హితము చేయును . మంచి పథ్యముగా ఉండును.

🔸 బియ్యము కడగక గంజివార్చబడని అత్తెసరు అన్నం పైత్యమును చేయును . శుక్రమును వృద్ధిచేయును . కఫానికి కారణంగా ఉండును.

🔸బియ్యమును వేసి పాకము చెయ్యబడిన అన్నం రుచికరంగా ఉండి కఫాన్ని హరించును . తేలికగా ఉండును.

🔸పప్పు , మాంసాదులు వేసి వండిన అన్నము గురుత్వము చేయును . శుక్రమును వృద్ధిపరచును. కఫమును పుట్టించును .

🔸 బెల్లము మొదలగు మధురరసములతో కలిసి మధురాన్నం గురుత్వం చేయును . శుక్రాన్ని వృద్దిపరచును. వాతజ్వరమును హరించును .

🔹మెంతి,మజ్జిగతో చేర్చిబడిన అన్నం గ్రహణి, మూలరోగం , అలసట పొగొట్టును.మరియు జీర్ణకారి.

🔸అతివేడి అన్నం బలమును పొగొట్టును. సమశీతోష్ణ స్థితిలో ఉన్న అన్నం తినుట మంచిది .

🔹రెండుమూడు రోజులు నుంచి ఉన్న అన్నం పాచి అన్నం రోగాలను పుట్టించును .

🔹వరి అన్నం రుచి పుట్టించును . సర్వరోగ హరమైనది . నేత్రాలకు హితము చేయును . జఠరాగ్నిని పెంచును. హృదయమునకు మేలుచేయును. శుక్రవృద్ధి , శరీర ధారుడ్యం కలుగచేయును . పథ్యకరం అయినది. దాహాన్ని తగ్గించును .

🔹శరీరానికి కాంతిని ఇచ్చును. మూత్రవృద్ధి చేయును . తేలికగా ఉండును. ముడిబియ్యపు అన్నం అగ్నిదీప్తి కలిగినవారికి మంచి శ్రేష్ఠమైనదిగా
ఉండును .

🔸సన్నరకం బియ్యపు అన్నం దీపనకారిగా ఉండి దోషములను పోగొట్టును . ప్రశస్తమైనది , రోగములను హరించును .

🔹మినపపప్పు గాని నువ్వుల గాని చేర్చి వండిన అన్నమును పులగం అందురు. బలమును కలుగచేయును . మలమును బంధించును . పెసరపప్పు , కందిపప్పు , శనగపప్పు వగైరా బియ్యముతో చేర్చి వండిన అన్నం శుక్రమును మరియు బలమును పెంచును . పుష్టిని కలిగించును. మలమును విసర్జింపచేయును . వాతాన్ని హరించును . పిత్తమును మరియు కఫాన్ని పెంచును.త్వరగా జీర్ణం అవ్వకుండా ఉండును.

🔹 పాలలో బియ్యం , చెక్కర వగైరా కలిపి వండినదానిని పాయసం అనియు క్షీరాన్నం అనియు పరమాన్నం అని కూడా అంటారు. పాయసం త్వరగా జీర్ణం కాదు. బలమును , ధాతుపుష్టిని చేసి మలమును బంధించును .

ఇప్పుడు పప్పుల గుణములు

🔹పెసరపప్పు వాతమును , కడుపు ఉబ్బరమును కలిగించును. పొట్టు తీసిన పెసరపప్పు మధురంగా ఉండును. దేహకాంతిని కలుగచేయును . గుల్మము , ప్లీహము,కాస , అరుచి , పిత్తము , ప్రమేహరోగము , గళ రోగమును హరించును .

🔸 కందిపప్పు రుచిగా ఉండి మలబద్దకం, కుష్టు , జ్వరం , అతిసారమును హరించును . శనగపప్పు కడుపుఉబ్బరం కలుగచేయును . ఉలవపప్పు కఫపిత్తరోగములను , గుల్మొదరం , మూలవ్యాధి , వాతం , క్రిమిరోగం , కాసరోగం , ఆమవాతంను హరించును . అలసందపప్పు
మధురంగా ఉండును. బలమును వృద్దిచేయును.

🔹 కొందరు పొట్టుతీసిన పెసరపప్పు , పొట్టుతీయని కందిపప్పు విషతుల్యం అందురు. కారము మరియు కమ్మదనం కలిగిన పదార్థముల యందు పైత్యమును , పులుసు , వగరు కలిగిన పదార్థముల యందు శ్లేష్మము , తీపు మరియు చప్పదనం కలిగిన పదార్థముల యందు వాతము కలదని ఋషుల యొక్క అభిప్రాయం . కావున శరీరతత్వము మరియు రోగమును గుర్తించి పథ్యం పెట్టవలెను.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com