టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భయపడుతున్నారని వ్యాఖ్యానించడం అవివేకమన్నారు. ప్రజల ప్రాణ, రక్షణ దృష్ట్యా వేసవి కాలంలోనే ఎన్నికల నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 90 శాతం పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. కార్మికుల సొమ్మును దోచుకుతినే అచ్చెన్నాయుడు, గాలి నాయుడు, ఫేక్ పార్టీ నాయకులు ఎవరైనా తన సవాల్ స్వీకరించాలని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో మాదిరే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగు కాక తప్పదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖపై కూడా మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించే హక్కు లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్‌ను లెక్కచేయని నిమ్మగడ్డ రమేష్‌ను ఎన్నికల కమిషనర్‌గా తాము గుర్తించమని పేర్కొన్నారు. 2018 జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సిన నిమ్మగడ్డ.. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నాడా అంటూ ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు నాయుడు తానా అంటే తందానా అనే నిమ్మగడ్డ రమేష్ చెప్తే, మేము ఎన్నికలు నిర్వహించాలా చంద్రబాబు బినామీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని’’ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.
గాలినాయుడుకు ఇదే నా సవాల్!
Related tags :