కొవ్వు శత్రువు కాదు. అత్యావశ్యకం!

కొవ్వు.. కొలెస్ట్రాల్‌.. వీటి పేరు వింటేనే ఇప్పుడు ఎంతోమంది బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఎంతోమందిని పట్టిపీడిస్తున్న ఊబకాయం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు వంటి వాటికివి దోహదం చేస్తుండటమే దీనికి కారణం. అలాగని కొవ్వు శత్రువేమీ కాదు. శరీరానికిది అత్యవసరం కూడా. ఇది లేకపోతే మన మనుగడ అసాధ్యం. అవటానికి కొవ్వు ఒకటే అయినా ఒకోచోట ఒకోలా కనబడుతుంది. మెదడు, కాలేయం, పేగులు, మెదడు, లింఫ్‌ నాళాలు, కండర కణజాలం.. ఇలా ఒకోచోట ఒకోలా పనిచేస్తుంటుంది. మన శరీర బరువులో దాదాపు 10% వరకు ఉండేది కొవ్వే. ఒకరకంగా మెదడును కొవ్వు ముద్ద అనీ అనుకోవచ్చు. మెదడులో సుమారు 60% వరకూ ఆక్రమించుకునేదీ కొవ్వే. ఇందులో ఒక్క శాతం తగ్గినా మెదడు పనితీరు అస్తవ్యస్తమవుతుంది. చర్మం నిగనిగలాడుతూ కనిపించటానికైనా, అవయవాలు దెబ్బతినకుండా ఉండటానికైనా ఇది చాలా కీలకం. ఇక గుండె చుట్టూ ఉండే ప్రత్యేక కొవ్వు కణజాలమైతే ఎన్నోరకాల పదార్థాలను వెలువరిస్తూ గుండెను కాపాడుకుంటుంది. కొవ్వును చాలావరకు శక్తిని నిల్వ చేసుకునే సాధనంగానే భావిస్తుంటారు గానీ ఇది హార్మోన్లు, విటమిన్ల తయారీలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. రక్షణ వ్యవస్థలో అంతర్భాగమై శరీరాన్ని అనవరతం కనిపెట్టుకొని ఉంటుంది. వాతావరణ దుష్ప్రభావాలకు లోనుకాకుండా, వృద్ధాప్య ఛాయలు మీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి కొవ్వును చిన్న చూపు చూడాల్సిన పనిలేదు. ఇది చేసే మేలు గురించి తెలుసుకొని ఉండటం అవసరం. అప్పుడే అనవసర ప్రయోగాలతో కొవ్వును, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోకుండా చూసుకోవచ్చు.

కొవ్వు శత్రువు కాదు. శరీరానికిది అత్యవసరం
హర్మోన్ల జనని
హార్మోన్ల తయారీలో పాలు పంచుకునే కణాల్లో పెద్దమొత్తంలో ఉండేది కొవ్వే. అందుకే దీన్ని హార్మోన్ల జనని అనీ.. అతిపెద్ద గ్రంథి అవయవమనీ పిలుచుకుంటారు. పలు జీవక్రియలను ప్రేరేపించే హార్మోన్లలో ప్రధానమైనవి, ముఖ్యమైనవి స్టిరాయిడ్‌ హార్మోన్లు. మనకు హఠాత్తుగా ఏదైనా ఆపదో, ప్రమాదమో ముంచుకొచ్చిందనుకోండి. వెంటనే దాన్ని ఎదుర్కోవటానికో లేదా అక్కడ్నుంచి బయటపడటానికో ప్రయత్నిస్తుంటాం. ఇలాంటి సమయాల్లో మనలో ఉన్నట్టుండి ఎక్కడలేని శక్తీ పుట్టుకొస్తుంది. ఇలా తక్షణం అవసరమైన శక్తిని అందించటానికి తోడ్పడేవి ఈ స్టిరాయిడ్‌ హార్మోన్లే. వీటి తయారీకి మూల కారకమేంటో తెలుసా? కొవ్వే. అడ్రినల్‌ గ్రంథిలోని కొలెస్ట్రాల్‌ నుంచి 3 రకాల హార్మోన్లు తయారవుతాయి. 1. మినెరలో కార్టికాయిడ్స్‌ (ఆల్డోస్టిరాన్‌ వంటివి). ఇవి మన ఒంట్లో ఖనిజాల స్థాయులను నియంత్రిస్తూ.. రక్త సరఫరా సాఫీగా జరగటానికి వీలుగా రక్తనాళాల్లో అవసరమై పీడనం కొనసాగేలా చూస్తాయి. 2. గ్లూకో కార్టికాయిడ్స్‌ (కార్టిజోల్‌ వంటివి). శరీరానికి తక్షణం అవసరమైన శక్తిని అందించేవి ఇవే. ఇన్‌ఫెక్షన్లు, గాయాల వంటి సమయాల్లో రక్షణ వ్యవస్థను ప్రేరేపించటంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. 3. సెక్స్‌ స్టిరాయిడ్స్‌ (ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌, టెస్టోస్టిరాన్‌ వంటివి). ఇవి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇక అడ్రినల్‌ గ్రంథి లోపల్నుంచి పుట్టుకొచ్చే అడ్రినల్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపించటానికీ కొలెస్ట్రాల్‌ అత్యవసరం. మన శరీరంలోని ప్రతి అవయవంలోని ప్రతి కణాన్ని చలింపజేసేది అడ్రినల్‌ హార్మోనే. ఇలాంటి హార్మోన్లు మిగతా అవయవాల్లోనూ.. ముఖ్యంగా అండాశయాలు, వృషణాల వంటి జననేంద్రియాల్లోనూ కొద్ది మోతాదులో తయారవుతుంటాయి. ఇవి ఎక్కడ తయారైనా వీటికి కొవ్వు పదార్థం, కొవ్వులోని కొలెస్ట్రాలే మూలకం కావటం విశేషం.

లెప్టిన్‌: ఈ హార్మోన్‌ కడుపు నిండిన భావన కలిగిస్తూ.. ఆకలి తగ్గేలా చేస్తుంది. ఇది శరీరంలోని అన్ని కణాల్లోనూ అక్కడి కొవ్వులోంచే పుట్టుకొస్తుంది. అంటే మెదడులో, ఊపిరితిత్తుల్లో, కడుపులో.. ఇలా అన్నిచోట్లా ఉంటుందన్నమాట. లెప్టిన్‌ ఉత్పత్తి ఎక్కువైనా, తక్కువైనా.. లేదూ దీని సామర్థ్యం తగ్గినా ఆకలి తీరుతెన్నులు మారిపోతాయి. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సాంక్రమికేతర జబ్బులన్నింటికీ ఒకరకంగా లెప్టిన్‌ పనితీరు అస్తవ్యస్తం కావటమే మూలమని చెప్పుకోవచ్చు.

రక్షణ వ్యవస్థలో అంతర్భాగం
బయట ఎంత చలిగా ఉన్నా, వేడిగా ఉన్నా ఒంట్లో తగినంత ఉష్ణోగ్రత కొనసాగేలా చేసేదీ.. శరీరంలోని ప్రతి అవయవాన్ని, కణాన్ని కాపాడేదీ చర్మం కింద, కడుపులో, అవయవాల చుట్టూరా ఉండే కొవ్వే. ఇలా ఇది ఎండ, చలి వంటి వాతావరణ ప్రతికూల ప్రభావాల నుంచి మనల్ని కాపాడటానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేకాదు.. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, హానికారక రసాయనాల వంటి వాటి దుష్ప్రభావాలను నిర్వీర్యం చేస్తుంటుంది కూడా. కొవ్వు పదార్థంలోంచి పుట్టుకొచ్చే ఎడిపోకైన్స్‌ ఇందులో ఎంతగానో ఉపయోగపడతాయి. రోగనిరోధక వ్యవస్థలో పాలు పంచుకునే ట్యూమర్‌ నెక్రోసిస్‌ ఫ్యాక్టర్‌ (టీఎన్‌ఎఫ్‌) ఆల్ఫా, ఇంటర్‌ల్యూకిన్‌-6 వంటి సైటోకైన్స్‌ కూడా కొవ్వులోంచే పుట్టుకొస్తాయి. టీఎన్‌ఎఫ్‌ ఆల్పా లావుగా ఉన్నవారిలో ఇన్సులిన్‌ నిరోధకతకు, తద్వారా మధుమేహానికి దోహదం చేస్తుంది. ఇంటర్‌ల్యూకిన్‌-6 వాపుప్రక్రియను ప్రేరేపితం చేయటం నిజమే గానీ ఇది గ్లూకోజు, బరువు నియంత్రణలోనూ పాలు పంచుకుంటుంది.

తొలి రక్షకభట దళం!
కొవ్వు ‘కడుపులో రక్షకభట దళం’ కూడా. పొట్టలో పేగుల వెలుపల ఒక కొవ్వు పొర (ఒమెంటమ్‌) తెరలాగా వేలాడుతూ ఉంటుంది. తిన్న ఆహారంలో మనకు సరిపడని పదార్థాలు, రసాయనాలు, విషతుల్యాలేవైనా ఉంటే ఇది లింఫ్‌ నాళాల ద్వారా వాటన్నింటినీ సంగ్రహించి.. వీలైనంతవరకు నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాతే అవి కాలేయానికి చేరుకుంటాయి.

విటమిన్లకూ మూలం
మనం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే ప్రధానమైన విటమిన్లలో ఒకటైన విటమిన్‌ డి పుట్టుకకు కొలెస్ట్రాలే మూలం. అంతేకాదు ఎ, ఇ, కె విటమిన్లు కూడా ఇతర కొవ్వు పదార్థాల నుంచే పుట్టుకొస్తాయి. విటమిన్‌ ఎ కంటిచూపు మెరుగుపడటానికి, విటమిన్‌ డి ఎముక పుష్టికి తోడ్పడతాయన్నది తెలిసిందే. ఇక విటమిన్‌ ఇ కణాలను పునరుత్తేజితం చేస్తూ.. వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకురాకుండా కాపాడుతుంటుంది. గాయాలు, ప్రమాదాలకు గురైనప్పుడు రక్తస్రావాన్ని అరికట్టటంలో విటమిన్‌ కె కీలకంగా పనిచేస్తుంది.

నాడులకు కవచం
మనం వేలును కదిలించాలన్నా, కాలును కదిలించాలన్నా మెదడు నుంచి అందే నాడీ సంకేతాలే కీలకం. ఇవి నాడుల ద్వారా అన్ని భాగాలకు చేరుకుంటాయి. ఈ నాడులకు రక్షణ కవచంగా నిలిచేది కూడా కొవ్వే. నాడుల మీదుండే మైలీన్‌ అనే పొర కొలెస్ట్రాల్‌తో ఏర్పడిందే. ఇది నాడుల లోపల ప్రసారమయ్యే విద్యుత్‌ చర్యలు బయటకు రాకుండా చూస్తుంది. ఒకరకంగా దీన్ని ఇంట్లో కరెంటు తీగల మీదుండే ప్లాస్టిక్‌ పొరతో పోల్చుకోవచ్చు. ప్లాస్టిక్‌ పొర దెబ్బతింటే షాక్‌ కొట్టినట్టుగానే నాడుల మీది పొర దెబ్బతింటే ఫిట్స్‌, మతిమరుపు, నొప్పుల వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయి.

కొవ్వు కణాలు సంఖ్య మారదు
కొవ్వు పదార్థాలను తగ్గించటం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను కొంతలో కొంత నియంత్రించుకోవచ్చేమో గానీ పూర్తిగా తగ్గించుకోవటమనేది అసాధ్యం. ఎందుకంటే కాలేయమే కొవ్వును తయారుచేసుకుంటుంది. కొంత లింఫ్‌ వ్యవస్థలోనూ తయారవుతుంది. మాంసం వంటి పదార్థాలు తీసుకోకుండా కాయగూరలు తిన్నా.. చివరికి నీళ్లు తాగినా కూడా శరీరం రోజుకు సుమారు ఒక గ్రాము కొలెస్ట్రాల్‌ను తయారుచేసుకుంటుంది. తన అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవటానికి దీన్ని కోల్పోకుండా భద్రపరచుకుంటుంది కూడా. ఒంట్లో కొవ్వు కణాల సంఖ్య పుట్టినప్పట్నుంచీ మరణించేవరకూ స్థిరంగా ఉంటుంది. ఏటా 10% కొవ్వు కణాలు చనిపోతుంటాయి, మళ్లీ ఇవి పుట్టుకొస్తుంటాయి. కానీ కణాల సంఖ్య మాత్రం మారదు. అయితే కొవ్వు కణాల సైజు పెరిగే అవకాశముంది. మితిమీరి ఆహారం తీసుకున్నప్పుడు ఖర్చుకాకుండా మిగిలిపోయిన కేలరీలను శరీరం కొవ్వు రూపంలోనే దాచుకుంటుంది. దీంతో కొవ్వు కణాల సైజూ పెరుగుతుంది. వీటి పరిమాణం మూడింతల కన్నా ఎక్కువగా పెరిగితే అవి విడిపోయి కణాల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా అధిక బరువు, ఊబకాయం వంటివి తలెత్తొచ్చు. ఒకసారి కొవ్వు కణాల సంఖ్య పెరిగితే వాటిని తగ్గించటం అసాధ్యం. ఆహార, వ్యాయామ నియమాల ద్వారా కొవ్వు కణాల పరిమాణాన్ని మాత్రం కొంతవరకే తగ్గించుకోవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com