స్మార్ట్ నగరాలు కాదు. స్మార్ట్ గ్రామాలు కావాలి.

‘‘నేను ఇన్ని రోజులు గ్రామాల్లో పర్యటించి.. పరిశీలించిన ఎన్నో సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం తప్పనిసరి. ఒక ఎన్జీవోగా ఉండటం వల్ల కొంతమేర మాత్రమే ప్రభావితం చేయగలం. ప్రభుత్వంతో మమేకం కావడానికి కచ్చితంగా రాజకీయాల్లో వస్తాను. నా ఆలోచనలు పంచుకుని, వాటిని అనుసరించే పార్టీలతో జత కడతాను. అలా కాకుంటే కచ్చితంగా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తా. ఓ ప్రణాళికతో రాజకీయాల్లో ముందుకు వెళ్తా..’’ అని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన లక్ష్మీనారాయణ తన రాష్ట్ర పర్యటనను శనివారంతో ముగించారు. 13 జిల్లాల పర్యటన అనుభవనాలను, ప్రజా మేనిఫెస్టో ఆలోచన, వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వ్యూహాన్ని ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో వెల్లడించారు.

****** లక్ష్మీనారాయణ మాటల్లోని ముఖ్యాంశాలు..
* ఏదైనా మంచి పనిచేయాలంటే అవగాహన అవసరం. అవగాహన ఉంటే.. మంచి ఆలోచన పుడుతుంది. మంచి ఆలోచన పుడితే.. ఆచరణ మార్గం దొరుకుతుంది. ఆచరణ వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. నా 13 జిల్లాల పర్యటన అవగాహనతో మంచి ఆలోచనలు ఎన్నో పుట్టాయి.

* వచ్చే ఏడేళ్లు భారతదేశానికి ఎంతో ప్రత్యేకం. భారతదేశంలోని 75 శాతం జనాభా యుక్త వయసు వారు ఉంటారు. అంటే యువ భారత్‌ కాబోతోంది. దీనికి ఎలాంటి ప్రణాళిక కావాలి. ఏం చేయాలనేది నా ఆలోచన.

* అన్నం పెడుతున్న రైతు.. తనకు తినడానికి ఏమీ లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే వారు అడిగేవి చిన్నచిన్న సమస్యలు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని వేడుకుంటున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు. కౌలు రైతుల సమస్యలు ఎవరికీ పట్టడం లేదు. రైతులు.. మాకు రుణాలను మాఫీ చేయండి అని కోరడం లేదు. గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటున్నారు.

* గ్రామాలు కళావిహీనంగా మారిపోతున్నాయి. వీటిని బతికించాల్సిన అవసరం ఉంది. స్మార్ట్‌ నగరాల కంటే.. స్మార్ట్‌ గ్రామాలే ముఖ్యం. దీనికోసం మేం ప్రతి రంగానికి, విభాగానికి ఓ ప్రత్యేకమైన విధివిధానం (పాలసీ)ను రూపొందించే ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో యువతను వ్యవసాయం వైపు నడిపించేలా ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ను మొదలుపెట్టబోతున్నాం.

* గ్రామాల పరిశీలన, అక్కడి సమస్యలు, పరిష్కారాలు, రైతులకు ఏం కావాలనేది ఓ నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి సమర్పిస్తాను. త్వరలోనే ఆయనను కలుస్తాను. ఇక క్షేత్రస్థాయిలో అవినీతి చాలా ఎక్కువగా ఉంది. దీనిపై అందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమం తీసుకొస్తాను.

* ప్రతి గ్రామానికి ఓ వ్యవసాయాధికారి అవసరం. నేను గ్రామాల్లోకి వెళ్లినపుడు అక్కడ చాలామంది కోరుతోంది అదే. దీనివల్ల ఏ భూమికి ఎలాంటి పంట వేయాలనేది దగ్గరుండి వ్యవసాయాధికారులు చేయించవచ్చు. నష్టాలను తగ్గించవచ్చు. ధర స్థిరీకరణను రైతులు కోరుతున్నారు. ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియక చాలామందిలో అయోమయం ఉంది. ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక వ్యవసాయ విధానం ఉండాలి. మేం మొదటగా అనంతపురం జిల్లాకు ఎలాంటి విధానం ఉండాలో తయారు చేస్తున్నాం. దీన్ని ముఖ్యమంత్రికి అందజేస్తాం.

* ‘‘పీపుల్స్‌ మేనిఫెస్టో’’ అనేది మా విజన్‌. ప్రతి గ్రామంలోని ప్రజలు వారికి ఏం కావాలో వారే తయారు చేసుకోవడమే ఈ మేనిఫెస్టో లక్ష్యం. దీని కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను తయారు చేశాం. దీనిలో 13 జిల్లాల సమాచారాన్ని ఉంచి.. ప్రజలేం కోరుకుంటున్నారో, ఆయా గ్రామాల్లో ఎలాంటి సౌకర్యాలు కావాలో, సమస్యలు ఉన్నాయో మాతో పంచుకునేలా వెబ్‌సైట్‌ను తయారు చేశాం. ప్రతి గ్రామానికి ఓ ప్రత్యేకమైన మేనిఫెస్టో తయారుచేస్తాం. దీన్ని వచ్చే ఎన్నికల్లో గ్రామాలకు వచ్చే రాజకీయ పార్టీ అభ్యర్థులకు ఇచ్చి వారితో స్టాంపు పేపరుపై సంతకం చేయించి.. ఆ మేనిఫెస్టోను అమలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. అంటే.. ఎవరికి ఏం అవసరమో వారు తెలుసుకునే ఏర్పాటు ఇది. ఎవరైనా తమ గ్రామం గురించి… మేనిఫెస్టోలో మాకు చెప్పాలనుకుంటే… http://www.ourvillagemanifesto.org వెబ్‌సైట్‌కు వెళ్లి… అక్కడ మాతో పంచుకోవచ్చు.

* రాజకీయ ప్రవేశం ఎప్పటిలోగా ఉంటుంది? ఏ పార్టీతో మీ ఆలోచనలు కలిసే అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా… ప్రస్తుతం నా ఆలోచనలు మాత్రమే చెప్పా. రాజకీయ పార్టీల వారికి నా ఆలోచనలు కలిశాయా? లేదా అనేది వారే నిర్థారించుకోవాలని, రాజకీయాలపై త్వరలోనే ఓ ప్రకటన చేస్తానని వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com