బతుకమ్మ ఉత్సవాలకు సిద్దమైన తెలుగు రాష్ట్రాలు

మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది. ఇక్కడ గడపగడపలో బతుకమ్మ తొమ్మిదిరోజులపాటు కనువిందు చేస్తుంది. తొమ్మిది పూర్ణత్వానికి ప్రతీక. నవ విధులకు, నవావరణాలకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు. తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష, సీతమ్మజడ, గోరింట, గుమ్మడి, బంతి, మందార, గనే్నరు, బీర, నిత్యమల్లె పుష్పాలను క్రమపద్ధతిలో అమర్చుతారు. మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈమె ఈ తొమ్మిదిరోజులు పుట్టింటికి వచ్చినట్లుగా భావించి ..
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తంగేడు పువ్వై తరలిరావే తల్లి..
మందార పువ్వై మురిపెంగరా.. కల్పవల్లీ..
పారిజాతమై పరిమళించగరావే..
పున్నాగ పువ్వై పులకించగరావే..
బంగారు బతుకమ్మా..
సింగారాల మాయమ్మా..
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో.. అంటూ తమ మమకారాన్ని చాటుకుంటారు పుట్టింటివారు.
*సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతం అంతా పండుగ కోలాహలం కనిపిస్తుంది. అన్ని పండుగల్లో బతుకమ్మ పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం ఉందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇది మహిళలకు సంబంధించిన పండుగ. వర్షాకాలం ముగిసిపోయి, శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో వాతావరణం పచ్చగా ఉంటుంది. ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది. రకరకాల పూలతో చెట్లన్నీ విరబూస్తాయి. ముఖ్యంగా గునుక, తంగేడు పూలు విరగకాసి ప్రకృతి మాతకు మరింత అందాన్ని అద్దుతాయి. చెరువులన్నీ కొత్త నీటితో కళకళలాడుతూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో తెలంగాణా ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్నంతా ‘బతుకమ్మ’లో పేర్చి వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.
***బతుకమ్మ కథ
బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కథలు రెండున్నాయి. మొదటి కథ.. మహిషాసురుడితో యుద్ధం చేసిన దుర్గాదేవి అలసటతో సొమ్మసిల్లి, పడిపోయింది. తోటి మహిళలు ఆమెకు సేవలు చేసి పాటలను ఆలపిస్తూ, ఆమెలో తిరిగి చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సపర్యలు చేసి సేదతీర్చారు. తొమ్మిదోనాడు ఆది పరాశక్తి అలసట పూర్తిగా తీరిపోయింది. వెంటనే దుర్గాదేవి విశ్వ చైతన్యమూర్తిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించింది. లోకంలోని చీకట్లను, చెడులను పారద్రోలి కొత్త వెలుగును ప్రసరింపచేసింది. అందరికీ బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆమెను ‘బతుకమ్మ’గా వ్యవహరించి పూజిస్తారు ఆడపడుచులు. ఇక రెండో కథ.. ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందట. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ‘నువ్వు చనిపోయినా అందరి మనస్సులో కలకాలం ‘బతుకమ్మా..’’ అని దీవించారట.. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, ఆమెనే గౌరమ్మగా పూజిస్తూ ‘బతుకమ్మ’ పండుగ చేసుకుంటారు.
ఒక రాగి పళ్ళెంలో గునుగు, తంగేడు పూలతో పాటు ఇతర పూలను కలిపి వలయాకారంలో పేరుస్తారు. ఇలా పై వరకు ఒక రంగు పుష్పం తరువాత మరో రంగు పుష్పాన్ని పెడుతూ ఆకర్షణీయంగా తయారుచేస్తారు. ఆ తర్వాత తంగేడు పూలను కట్టగా కట్టి వాటిపై పేరుస్తారు. మధ్యలో కూడా రకరకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా, అంత అందంగా రూపొందుతుంది. పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత పైన పసుపుతో తయారుచేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారుచేసిన బతుకమ్మను పూజ గదిలో అమర్చి పూజిస్తారు. తరువాత బతుకమ్మను బయటకు తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలతో గౌరీదేవిని కీర్తిస్తారు. ఆడపడుచులు కొత్త బట్టలను కట్టుకుని, ఆభరణాలను ధరించి చాలాసేపు బతుకమ్మని ఆడాక ఆడవారు, మగవారు కలిసి చెరువులో నిమజ్జనం చేస్తారు. తరువాత పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. వేరుశెనగ లేదా పెసలను దోరగా వేయించి పిండి చేసి బెల్లంతో కలిపి సత్తుపిండిని తయారుచేస్తారు. దీనితో పాటు పెరుగన్నాన్ని కూడా బతుకమ్మ ఆడేచోటుకు తీసుకువచ్చి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ప్రసాదంలా తింటారు. బతుకమ్మ పండుగకు వారం ముందు నుంచే ఇళ్లలో హడావుడి మొదలవుతుంది. తెలంగాణా ఆడపడుచులు వారం ముందే పుట్టింటికి చేరుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే తెలంగాణా ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలను తయారుచేసి ప్రతిరోజూ సాయంత్రం బతుకమ్మను చేసి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడి, చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఆ రోజు సాయంత్రం ఆడపడుచులు అందంగా అలంకరించుకుని ముంగిట్లో బతుకమ్మను పెడతారు. చుట్టుపక్కల వారు కూడా వారి బతుకమ్మలను పెట్టి చుట్టూ వలయాకారంగా తిరుగుతూ పాటలు పాడతారు. చీకటిపడే వేళకి ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని చెరువుకు వెళ్లి, అక్కడ కూడా బతుకమ్మను ఆడి నిమజ్జనం చేస్తారు.
ఇలా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపమైన ‘అమ్మ’ను పూజిస్తారు మహిళలు. దీనితో పాటు ప్రేమ, శాంతి, సత్యం, క్షమ, ధ్యానం, అహింస, నిగ్రహం, భూతదయ అనే అష్టపుష్పాలతో, మన మనోపుష్పమైన తొమ్మిదో పుష్పాన్ని కూడా జతచేసి అమ్మను పూజించడమే బతుకమ్మ వేడుక.
*ఒక్కోరోజు ఒక్కో రూపంలో..
మొదటి రోజు: ఎంగిలిపూల బతుకమ్మ
రెండో రోజు: అటుకుల బతుకమ్మ
మూడో రోజు: ముద్దపప్పు బతుకమ్మ
నాలుగో రోజు: నానే బియ్యం బతుకమ్మ
ఐదో రోజు: అట్ల బతుకమ్మ
ఆరో రోజు: అలిగిన బతుకమ్మ
ఏడో రోజు: సకినాల బతుకమ్మ
ఎనిమిదో రోజు: వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదో రోజు: సద్దుల బతుకమ్మ

2. యాదాద్రిలో బూజు పట్టిన లడ్డూలు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు విక్రయించే చిన్న లడ్డూలకు బూజు పట్టింది. తయారీలో లోపించిన నాణ్యత, విక్రయాల దశలో భద్రపరిచే చర్యల్లో లోపాల కారణంగా అవి చెడిపోయినట్లు తెలుస్తోంది. గురు, శుక్రవారాల నుంచి భక్తుల రద్దీతోపాటు ప్రసాదాల విక్రయం తగ్గిందని, దీంతో కౌంటర్ గదుల్లో ఉంచిన లడ్డూలకు గాలి సరిగా ఆడక బూజుపట్టాయిని అధికారులు చెబుతున్నారు. ఈ విషయం ప్రసాదం కొనుగోలు చేసిన భక్తుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సంబంధిత విభాగం ఉద్యోగులు అప్రమత్తమై, వాటిని తీసుకెళ్లి పారవేశారు. బూజు పట్టిన విషయం నిజమేనని 30 ట్రేలలోని 1,800 లడ్డూలను పారబోసినట్లు అసిస్టెంట్ ఈవో భాస్కరశర్మ, ఆ విభాగం పర్యవేక్షకులు విజయ్కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా అధికారులు ప్రయత్నించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యవహారం చక్కర్లు కొట్టడంతో ఆదివారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

3. . శ్రీవారి బ్రహ్మోత్సవాలు 10 నుంచి
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 18 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమల నుంచి శుక్రవారం డయల్ తితిదే ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధిక మాసం కారణంగా శ్రీవారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్లో సాలకట్ల వేడుకలు జరగ్గా.. 10 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నాం. బ్రహ్మోత్సవాల రోజుల్లో శ్రీవారికి ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశాం. వయోవృద్ధులు, దివ్యాంగు, చంటిబిడ్డలకు ప్రత్యేక దర్శనాలు నిలిపివేస్తున్నాం. సిఫార్సు లేఖలు స్వీకరించం. ఉత్సవాలకు దేశవ్యాప్త కళాబృందాలను రప్పిస్తున్నాం’ అని వివరించారు. ‘అక్రమాలు బయటపడినందున ఆన్లైన్ డిప్ విధానం కింద ఆర్జిత సేవా టిక్కెట్ల నమోదు విధానంలో వచ్చే నెల నుంచి మార్పులు తీసుకువస్తాం. ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరుపై గుత్తగా టిక్కెట్లు నమోదుకు అవకాశం ఇవ్వకుండా.. ఒక ఐడీపై ఒకరు మాత్రమే బుక్ చేసుకునేలా పరిమితం చేస్తాం’ అని వెల్లడించారు. ‘తితిదే రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆర్జిత సేవా టిక్కెట్లను 50 శాతం ఆన్లైన్లో భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. 90 నుంచి 48 గంటల్లోపు టిక్కెట్లు నమోదు చేసుకునే సౌలభ్యం కల్పించాం’ అని ఈవో వివరించారు.
* శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి జనవరి కోటా కింద 68,575 టిక్కెట్లను విడుదల చేసినట్లు తితిదే ఈవో తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానం కింద 7,125 టిక్కెట్లు కేటాయించగా వీటిలో సుప్రభాతం 4,425, తోమాల 80, అర్చన 80, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టిక్కెట్లు ఉన్నాయి. కరెంటు బుకింగ్ కింద 61,450 టిక్కెట్లలో విశేషపూజ 2 వేలు, కల్యాణోత్సవం 13,775, ఊంజలసేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్రదీపాలంకరణ సేవ 17,400 టిక్కెట్లు వంతున జారీ చేశారు.
*స్వర్ణ తిరుచ్చి ఉత్సవం
బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణ తిరుచ్చి ఉత్సవం జరగుతుంది. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య పెద్దశేష వాహనంతో బ్రహ్మోత్సవాలు పూర్తిస్థాయిలో ఆరంభమవుతాయి. ఉత్సవాల నేపథ్యంలో ప్రసాదం కొరత లేకుండా తితిదే 7 లక్షల లడ్డూలను నిల్వ చేసింది. అన్నప్రసాదం నిత్యం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వితరణ చేయాలని సంకల్పించింది. ఈ నెల 14న గరుడసేవ రోజు అర్ధరాత్రి అనంతరం 2 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ జరగనుంది. గ్యాలరీల్లోనూ యాత్రికులకు అన్నపానీయాలను ప్రత్యేకంగా అందించనుంది.
*10 నుంచి ఆర్జిత సేవలు రద్దు
నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి బుధవారం నుంచి సుప్రభాత సేవ మినహా ఇతర ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డలతో పాటు తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. వీఐపీ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు పరిమితం చేయనుంది. ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించరాదని నిర్ణయించింది.

4. ఘనంగా కనకదుర్గ శాంతి కల్యాణం
దిల్లీలోని తితిదే బాలాజీ మందిర ప్రాంగణంలో ఆదివారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఖడ్గమాలార్జన, కుంకుమార్చాన, శాంతి కల్యాణం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాశ్ దంపతులతోపాటు, దేశరాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ప్రకాశ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల సౌజన్యంతో దిల్లీలోని తెలుగువారికోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనివల్ల సుదూరంలో ఉన్న తెలుగువారికి మన రాష్ట్రంలోని ఆలయాల వైశిష్ట్యాన్ని తెలుసుకొనే అవకాశం లభిస్తోందన్నారు.

5. ప్రభుత్వంతో చర్చలు అర్థరహితం
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశానుమతినిచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాన పూజారులతో చర్చలు జరపాలన్న కేరళ సర్కారు యోచనకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేసేందుకు సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చర్చలు అర్థరహితమంటూ అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారులు ఆదివారం స్పష్టం చేశారు. పండాలం రాజకుటుంబీకులు కూడా ఇదే అభిప్రాయాన్ని స్పష్టం చేసి ఉన్న విషయం గమనార్హం. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నారు.

6. శబరిమల గుడిలోకి వెళ్లిన ఐఏఎస్.
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఇన్నాళ్లూ ఉన్న పెద్ద అడ్డంకి తొలిగిపోయింది. అయితే, ఈ తీర్పు రావడానికి ముందే 1994-95 మధ్యకాలంలో ఓ మహిళ శబరిమల గుడిలోకి నాలుగుసార్లు ప్రవేశించింది.రెండు దశాబ్దాల క్రితం పాతానంతిట్ట జిల్లాకు కలెక్టర్గా పనిచేశారు ఐఏఎస్ ఆఫీసర్ వల్సల కుమారి. ఆ సమయంలో శబరిమల మాలధారణ రోజులు రావడంతో అక్కడి పర్యవేక్షణ, పారిశుధ్య బాధ్యతలను కేరళ హైకోర్టు కలెక్టర్ వల్సలాకు అప్పగించింది. అయినా, ఓ మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించకూడదన్న నిబంధనను గట్టిగానే నొక్కిచెప్పాయి అక్కడి హిందూ సంస్థలు. అధికారికంగా ఆమెకు అనుమతి ఉన్నా.. ఆలయం వెలుపల పనులు పర్యవేక్షించాలని గర్భగుడిలోకి ప్రవేశం లేదని కరాఖండిగా చెప్పాయి. ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో ఆలయంలోకి ప్రవేశించారు వల్సలా. వారి నిబంధనల మేరకు గర్భగుడిలోకి ప్రవేశించకుండా.. 18 మెట్ల ముందు నిల్చొని అయ్యప్పను మొక్కుకున్నారు వల్సలా. ఆ సమయంలోనే ఈ అవాంతరాలు తొలిగిపోవాలని, మహిళలకు కూడా ప్రవేశం లభించాలి అని గట్టిగా కోరుకున్నారట.శబరిమల ప్రత్యేకాధికారిగా పారిశుధ్య పనులను వేగవంతం చేయించారు వల్సలా. భక్తులకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి తొట్లు కట్టించారు. అక్కడి వాతావరణం దెబ్బతినకుండా మరుగుదొడ్లు నిర్మించారు. ఇలా భక్తులకు ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేపట్టారు వల్సలా. ఆమె చేసిన అభివృద్ధి పనులను శబరిమల పారిశుధ్య సంఘం నేటికీ కొనియాడుతున్నది. మొత్తంగా 1994-95 మధ్యలో ఆమె అధికారికంగా నాలుగుసార్లు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు. చివరికి ఆమె 50 యేండ్ల వయసులో, సుప్రీంకోర్టు తీర్పుతో గర్భగుడిలోకి ప్రవేశించారు. ఇదో శుభ పరిణామమంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ వల్సలా.

7. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు వైకుంఠం క్యూ కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. నిన్న 74,444 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 34,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 2.60కోట్లు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత స్వామి దర్శనానికి అనుమతిస్తారు. కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com