రక్తపోటును పసిగట్టే కృత్రిమ మేధా(ఏఐ) వ్యవస్థను కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందంలో ఓ భారతీయ అమెరికన్ ఉండటం విశేషం. రోగి శరీరానికి అమర్చే పరికరం ద్వారా సమాచారం సేకరించి.. బీపీని విశ్లేషించి తగిన జాగ్రత్తలు సూచించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. ఈ తరహా వ్యవస్థ రూపుదిద్దుకోవడం ఇదే తొలిసారని పరిశోధకులు వెల్లడించారు. ‘‘ఓ వ్యక్తి ఆరోగ్య అలవాట్లు.. రక్తపోటుకు సంబంధించిన కీలక అంశమే. అయితే, కొన్ని సందర్భాల్లో అవసరంలేకున్నా వైద్యులు అతిజాగ్రత్తలు సూచిస్తుంటారు. మేం అభివృద్ధి చేసిన వ్యవస్థతో సరైన ఫలితాలు చూసుకుని ఆ మేరకు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది’’ అని పరిశోధకుల్లో ఒకరైన సుజీత్ డే తెలిపారు. ఎనిమిది మంది వ్యక్తుల నిద్ర, వ్యాయామం, బీపీ సమాచారాన్ని 90 రోజులపాటు విశ్లేషించి ఈ వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులోభాగంగా చేతికి అమర్చిన పరికరాల ద్వారా సమాచారాన్ని తీసుకుని.. రక్తపోటుకు కారణమేంటో అంచనా వేసేందుకు అల్గరిథమ్ను రూపొందించారు. వీలైనంత త్వరగా రాత్రి నిద్రకు ఉపక్రమించే వారిపై రక్తపోటు ప్రభావం తక్కువగా ఉంటోందని గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు.