DailyDose

గజ్వేల్ ఆరోగ్య సిబ్బంది పైశాచికం-నేరవార్తలు

Crime News - Gajwel Health Staff Throws Lakhs Worth Free Medicines

* భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహం పక్కనే తాపీగా వీడియో గేమ్‌ ఆడుతూ కనిపించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జోద్‌పుర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని బీజేఎస్‌ కాలనీకి చెందిన విక్రమ్‌సింగ్‌ (35), శివ్‌ కన్వర్‌ (30) భార్యాభర్తలు. విక్రమ్‌సింగ్‌ జులాయిగా తిరుగుతూ ఏ పని చేసేవాడు కాదు. శివ్‌ కన్వర్‌ కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సోమవారం భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన విక్రమ్‌సింగ్‌ భార్యపై కత్తెరలతో దాడికి పాల్పడ్డాడు. ఆమెను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు.

* జామాబాద్ జిల్లాలో ఇంటి వెనక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు కిందకు దించారు. ఈ సంఘటన జిల్లాలోని సిరికొండ మండల పరిధిలోని న్యావనందిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌ 3న గ్రామానికి చెందిన మహిళా రైతు పుర్రె మమత అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను విచారించడం మొదలుపెట్టారు. వారిలో ఒక్కడిగా భావిస్తున్న అదే గ్రామానికి చెందిన తర్ర గంగాధర్‌(43)ను సైతం పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా అనుమానితులకు నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుల్లో ఒకడైన తర్ర గంగాధర్‌ తన ఇంటి వెనక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

* పేద రోగులకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు పంపిణీ చేసిన రూ.లక్షల విలువైన ఔషధాలు పాడుబడ్డ బావిలో కనిపించడం గజ్వేల్‌లో చర్చనీయాంశంగా మారింది. కొందరు సిబ్బంది కాటన్ల కొద్దీ మాత్రలు, ఇంజక్షన్లను ఓ కారులో తీసుకొచ్చి ప్రభుత్వ పాత ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాడుబడిన బావిలో సోమవారం మధ్యాహ్నం పడేశారు. గమనించిన స్థానికులు కొందరు వాటిని పరిశీలించగా అందులో చాలా ఔషధాలు 2021 అక్టోబరు వరకు వినియోగించుకోడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించారు. పేద రోగులకు ఉచితంగా అందజేయాల్సిన మందులను ఇలా పడేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉచితంగా ఇవ్వకుండా బయటి ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేయాలని చీటీలు రాసిస్తూ ప్రభుత్వం అందజేసిన వాటిని ఇలా పారబోస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సిద్దిపేట జిల్లా వైద ఆరోగ్య అధికారి మనోహర్‌ మాట్లాడుతూ.. ఉచితంగా పంపిణీ చేయాల్సిన మందులను బావిలో పడేయడం సరికాదన్నారు. ఇలా ఎందుకు చేశారన్న దానిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

* ఈ నెల 3వ తేదీన కేపీహెచ్‌బీ పరిధిలో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో శ్రావణ్‌కుమార్‌ అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కేపీహెచ్‌బీ ఠాణా పోలీసులు సోమవారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం. .వరంగల్‌ రూరల్‌ పరిధి ఖానాపూర్‌ మండలం ధర్మారావుపేటకు చెందిన ఎ.శ్రావణ్‌కుమార్‌(29) కేపీహెచ్‌బీకి వచ్చి మూడో రోడ్డులోని ఓ వసతిగృహంలో ఉంటున్నాడు. ఐడీఏ బొల్లారంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. అక్కడ ఇతనికి ఆ కంపెనీ ఉద్యోగులు హర్షవర్ధన్‌రెడ్డి ఆయన బావ శ్రీకాంత్‌రెడ్డి పరిచమయ్యారు. శ్రావణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌రెడ్డి ఓకే వసతిగృహంలో ఉండేవారు. వీరిద్దరు మధ్య ఒక సారి గొడవ చోటుచేసుకుంది. శ్రావణ్‌కుమార్‌ గొడవలో శ్రీకాంత్‌రెడ్డిని హర్షవర్ధన్‌రెడ్డి ముందు తిట్టాడు. తన బావను తిట్టాడని హర్షవర్ధన్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 3న ఇతను శ్రీకాంత్‌రెడ్డిని పిలిపించి శ్రావణ్‌కుమార్‌ను చితకబాదడంతో పాటు అతనిపై రాయి విసిరాడు. తీవ్రంగా గాయపడిన శ్రావణ్‌ తనకు ఆయాసం వస్తుందని చెప్పడంతో మరో మిత్రుడు సర్వీస్‌ రోడ్డు, కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

* మద్యానికి బానిసైన ఓ వ్యక్తి..దానిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక తాను పనిచేసే సెలూన్‌ దుకాణంలో ఉన్న షేవింగ్‌ లోషన్‌ను తాగి మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నగరం సాయిరాం థియేటర్‌ ఎదురువీధి అడ్డరోడ్డులోని పోతన భవనంలో యలమంచిలి లక్ష్మణ్‌ (35)-నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఆయన సాయిరాం థియేటర్‌ వద్ద ఓ సెలూన్‌లో పని చేస్తున్నాడు. అతను మద్యానికి బానిసై రోజూ తాగుతుంటాడు. ఈ నెల 5వ తేదీన షాపునకు వెళ్లాడు. ఆ రోజు మద్యం తాగేందుకు డబ్బులు దొరకలేదు. దీంతో అక్కడే ఉన్న షేవింగ్‌కు ఉపయోగించే లోషన్‌ను తాగాడు. సాయంత్రానికి గుండెల్లో నొప్పి, వాంతులు, కడుపులో నొప్పితో బాధపడుతూ ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు విజయవాడ చిట్టినగర్‌ పోలీసులు తెలిపారు.