ఘంటసాల గారి 98 వ జయంతి
ఆ గళం ఆర్తితో పాడే భక్తిగీతానికి దేవుడు ప్రత్యక్షమైన భావన
ఆ గొంతు హూషారు గా పలికితే అరువది ఏళ్ళ మనసుకు ఇరువది ఏళ్ళ పులకింతల భావన!
ప్రణయ గీతం ఆలపిస్తే ప్రేయసీ ప్రియులకు చెరకువింటి వేలుపు మేలు అవసరం లేదు
కరుణ, శోక రసాలు పండించే ఆ గాన మాధుర్యానికి కర్కశులైనా కరిగిపోవాలి!
హాస్యగీతాలా .. ఆ గళం తెరమీద నటించే నటుడినే ఆవాహనం చేసుకుంటుంది.
ఆ మధుర గళం ఘంటసాల గారిదని చెప్ప నవసరం లేదు కదా! నేడు ఆయన 98వ జయంతి సందర్భంగా సునాదవినోదిని సమర్పిస్తున్న “స్వరార్చన!”
అజరామరమై….అనన్య సామాన్యమైనç….ఆ దివ్యస్వరసంపద మనకు లభించిన పెన్నిధి!
తేట తెనుగు పద్యానికి….ఓ సొగసు….ఓ లాలిత్యం….ఓ గాంభీర్యం…అద్దిన ఘనత….ఆ మహామహునిదే!
కేవలం….గట్టిగా పాడేసి….చివరలో రాగాల ఆలాపన ఓ 10 నిమిషాల నుండి….అరగంట తీసే….సంస్కృతికి…మంగళం పాడారు ఘంటసాల!
ఆ స్వరధుని …. గంధర్వులకే సాధ్యం! ఎవరు పాడినా….ఎంత మధురంగా ఉన్నా….అది గంధర్వుడే మానవరూపంలో పాడినట్లుంటుంది.
కానీ ఆ స్వరం.. ఘంటసాల గారిది…… అది ఎక్కడో సుదూర తీరాలలో…కానరాని దివ్యలోకాలలో….విహరించే…గంధర్వ స్వరం అనిపిస్తుంది!
మనస్సు ప్రశాంతమై…సాంత్వన చేకూర్చే అపూర్వ స్వర మాధుర్యం…ఆయన సొంతం.
ఏ పుణ్యం చేసుకున్నామో….ఏ దేవుని వరమో….తెలుగు వారికి దక్కిన వరప్రసాదం ఆ అనితర సాధ్యమైన స్వరసంపద.
భవిష్యత్తరాలకు….గాన మాధుర్యానికి దిక్సూచిగా నిలిచిపోయిన ఆ స్వర సంపద…..సురుచిరం… సుందరం…..సుస్థిరం.