Food

తెలుగు రాష్ట్రాల మాల్స్‌లో నల్లబియ్యం

తెలుగు రాష్ట్రాల మాల్స్‌లో నల్లబియ్యం

మనం నిత్యం తినే బియ్యం తెల్లగా మిలమిలా మెరుస్తూ ఆకర్షిస్తుంటాయి కదా.. కానీ బాగా నల్లగా ఉండే బియ్యాన్ని ఎప్పుడైనా కొని వండారా..? ఇప్పుడిప్పుడే నల్ల బియ్యానికి మార్కెట్‌లో డిమాండు పెరుగుతోంది. వీటిని తెలుగు రాష్ట్రాల్లో రైతులు పండిస్తుండటంతో ఈ ఏడాది సాగు బాగా పెరిగింది. ఈ అన్నంలో అనేక రకాల పోషకాలు, విటమిన్లు, అమినో ఆమ్లాలు ఉండటం వల్ల వీటిని తినేందుకు ఉన్నత విద్యావంతులు ఆసక్తి చూపుతున్నారు. నగరాల్లోని మాల్స్‌లో వీటిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు. కిలో నల్ల బియ్యం ధర రూ.100 నుంచి రూ.120 దాకా పలుకుతోంది. కానీ ఈ రకం వరి విత్తనాలను రూ.200 నుంచి 300 దాకా ప్రైవేటు విత్తన కంపెనీలు విక్రయిస్తున్నాయి.
* నల్ల ధాన్యాన్ని చైనాలో ఎక్కువగా పండించేవారు. పూర్వకాలంలో అక్కడి రాజవంశీయులు, చక్రవర్తులు ఎక్కువగా తినడం వల్ల నల్లబియ్యానికి ‘చక్రవర్తుల బియ్యం’(ఎంపరర్‌ రైస్‌) అనే పేరు వచ్చింది. మనదేశంలో మణిపుర్‌, అసోం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. చైనాకు దగ్గరగా ఉన్నందున ఈశాన్య భారత ప్రజలు వీటిని ఎక్కువగా తింటుంటారు.
* తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్‌, సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో కొందరు రైతులు ఈ ఏడాది ఈ పంటను సాగు చేస్తున్నారు.
* వ్యవసాయశాఖ రాయితీపై రైతులకు విక్రయించే విత్తనాల్లో నల్లని రకాలు లేవు. వీటిని ప్రభుత్వ పరిశోధన సంస్థలు విడుదల చేయలేదని, కొన్ని ప్రైవేటు కంపెనీలు అమ్ముతున్నాయని వ్యవసాయశాఖ విత్తన విభాగం ఉపసంచాలకుడు శివప్రసాద్‌ తెలిపారు.
* సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన ఓ రైతు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ వరి విత్తనాలు కిలో రూ.200కి కొని సాగు చేయించి అర ఎకరంలో వేయించారు. 5.50 క్వింటాళ్ల దిగుబడి రాగా ఆన్‌లైన్‌లోనే పెట్టి విత్తనాల కింద కిలో రూ.275కి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు విక్రయించారని జిల్లా వ్యవసాయాధికారి కె.రణధీర్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. ఈ జిల్లాలో కోనరావుపేట, బోయిన్‌పల్లి ఎల్లారెడ్డిపేట, రుద్రంగి తదితర మండలాల్లో రైతులు వేసిన పంటను పరిశీలించినట్లు చెప్పారు.
*మధుమేహం, కేన్సర్‌, హృద్రోగాలకు చెక్‌
నల్లబియ్యంలో 18 రకాల అమినో ఆమ్లాలు, రాగి, కెరోటీన్‌, ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఇది టైపు-2 మధుమేహం బారిన పడకుండా రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌-ఇ కళ్లు, చర్మం వ్యాధులు రాకుండా, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. గుండె జబ్బులు రాకుండా గుండెకు సంబంధించిన రక్త నాళాలు పూడిపోకుండా నివారిస్తుంది. కొవ్వులు, ట్రైగ్లిసరాయిడ్స్‌ వంటి వాటిని నల్లబియ్యం అన్నం నియంత్రించడం వల్ల వ్యాధులు రాకుండా లివర్‌ను కాపాడుతుంది. చైనాలోని ‘థర్డ్‌ మిలటరీ చైనా విశ్వవిద్యాలయం’ శాస్త్రవేత్తలు నలుపు బియ్యంతో వండిన ఆహారంపై పరిశోధనలు చేశారు. వీటివల్ల మనిషి శరీరంలో కేన్సర్‌ గడ్డలు, రొమ్ము కేన్సర్‌ సెల్స్‌ పెరగకుండా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు.
**సాగు వ్యయం, దిగుబడి తక్కువ
‘‘నల్లరకం వరి పంట సాగు వ్యయం తక్కువగా ఉంటుంది. కానీ ఈ రకానికి తెగుళ్ల తాకిడి, నీటి ముంపు సమస్యలు ఉన్నందున దిగుబడి పెద్దగా రాదు. పురాతన కాలం నుంచి ఈ పంట సాగులో ఉంది. ఇటీవల కాలంలో ఈ బియ్యానికి డిమాండు పెరుగుతోంది’’ అని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ తెలిపారు.