భారత్‌లో తయారయ్యే మారుతీ సుజుకీ స్విఫ్ట్ భ్రద్రతా ప్రమాణాల పరీక్షలో ఆశించిన ఫలితాన్ని చూపించలేదు. ‘గ్లోబల్ న్యూకార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్’ (జీఎన్సీఏపీ) నిర్వహించిన భద్రతా ప్రమాణ పరీక్షల్లో కేవలం రెండు నక్షత్రాల రేటింగ్‌ను మాత్రమే సాధించింది. ఐదు నక్షత్రాల రేటింగ్ కోసం ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ కారు పెద్దల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను అందుకోలేకపోయిందని జీఎన్సీఏపీ పేర్కొంది. ప్రమాద సమయంలో ఈ కారు డ్రైవర్ తల, మెడకు రక్షణ లభిస్తున్నా.. ఛాతీ, మోకాళ్లకు మాత్రం గాయాలయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం మోడల్ స్విఫ్ట్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా 4-ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ వ్యవస్థ లేకపోవడంతో రేటింగ్ తగ్గింది. పెద్దలకు రక్షణ విషయంలో రెండు నక్షత్రాలు , చిన్నారులకు రక్షణ విషయంలో రెండు నక్షత్రాల రేటింగ్‌ను సాధించింది. దీనిపై జీఎన్సీఏపీ ప్రతినిధి డేవిడ్ వార్డ్ మాట్లాడుతూ ‘‘ భారత్‌లో విక్రయిస్తున్న కొత్త మోడల్ స్విఫ్ట్ కార్లలో రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఉండటం స్వాగతించదగిన అంశం. భారత ప్రభుత్వం విధించిన నూతన ప్రమాణాల ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. భారత్‌లో విక్రయించే స్విఫ్ట్ కార్ల కంటే యూరప్, జపాన్లలో విక్రయించే కార్లు సురక్షిత ప్రయాణం విషయంలో మెరుగైన రేటింగ్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ తన ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకుంటుందని భావిస్తున్నాము.’ అని పేర్కొన్నారు. భారత్‌లో విక్రయిస్తున్న స్విఫ్ట్ మోడల్లో ‘సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్’లు అందుబాటులో లేవు. దీనికి తోడు ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ కూడా లేదు. యూరప్‌లో విక్రయించే మోడళ్లలో ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.