మేకిన్‌ ఇండియా పూర్తిగా విఫలం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేకిన్‌ ఇండియా’ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. మనం సెల్ఫీలు తీసుకునే సమయంలోనూ స్మార్ట్‌ఫోన్‌ను వెనక్కి తిప్పి చూస్తే ‘మేడిన్ చైనా’ అని కనపడుతోందని అన్నారు. రాజస్థాన్‌లో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ విధానాలపై మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా రైతు రుణాల మాఫీ జరగలేదని, మేకిన్‌ ఇండియా విఫలమైందని, స్మార్ట్‌ఫోన్లు, టీ షర్ట్‌లను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని విమర్శించారు. మోదీ పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘యువత మోదీని నమ్మారు. ప్రధానమంత్రి కావాలన్న కోరిక తనకు లేదని, కాపలాదారుడిలా ఉంటానని మోదీ అన్నారు. కానీ, ఇప్పుడు ప్రజలు నవ్వుకుంటున్నారు. చివరకు మోదీ వ్యాపారవేత్తలకు రక్షణగా ఉంటున్నారని ప్రజలు తెలుసుకున్నారు. రైతులు, యువత ప్రయోజనాలను కాపాడేందుకు బదులు ఆయన 15-20 మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పని చేశారు. చిన్న వ్యాపారుల వద్దకు వెళ్లి మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని అడగండి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని వారు చెబుతారు. మేడిన్‌ ఇండియా అని మోదీ నినాదం ఇచ్చారు. కానీ, మీరు సెల్ఫీ తీసుకునే సమయంలోనూ ఆ స్మార్ట్‌ఫోన్‌పై మేడిన్‌ చైనా అని ఉంటోంది. మీరు వాడే వస్తువులపై మేడిన్ రాజస్థాన్‌, మేడిన్‌ జైపూర్‌ అని ఉండాలని నేను కోరుకుంటున్నాను. చైనా వారు తమ దేశంలో సెల్ఫీ తీసుకుంటుంటే ఆ స్మార్ట్‌ఫోన్‌పై కూడా మేడిన్‌ ఇండియా ఉండాలని ఆశిస్తున్నాను’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మహిళల రక్షణ, ఉద్యోగాల కల్పన విషయంలో మాటలే చెప్పారు కానీ, చేతల్లో చూపించడం లేదని రాహుల్‌ విమర్శించారు. ‘బేటీ బచావో బేటీ పడావో అంటూ మోదీ నినాదాన్ని ఇచ్చారు. కానీ, ఓ భాజపా ఎమ్మెల్యే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మహిళను అత్యాచారం చేస్తే ప్రధానితో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనను రక్షించేందుకు ప్రయత్నించారు. గుజరాత్‌లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన‌ యువత దాడులకు గురవుతున్నారు. యువత మోదీని నమ్మారు కానీ, ఆయన వారికి మోసం చేశారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న విభజన రాజకీయాలను ప్రజలు గుర్తించాలి. దేశ ప్రజలు ఎప్పటికీ ఐకమత్యంతోనే ఉండాలనుకుంటున్నారు’ అని రాహుల్‌ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com