తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయడమే బాబు లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా కాంగ్రెస్‌ పార్టీ పొత్తులు పెట్టుకుంటోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి 12 ప్రశ్నలతో కూడిన లేఖను విడుదల చేస్తూ వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ ఏం సమాధానం చెబుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. సాగునీటి రంగం, ఆస్తుల పంపకం, హైకోర్టు విభజన సహా అనేక అంశాలపై చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. ఆయనపై ఆధారపడిన ప్రభుత్వం తెలంగాణలో వస్తే రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా బాబేనని.. తెలంగాణ పక్షం ఆయనెప్పుడూ ఉండరన్నది జగమెరిగిన సత్యమన్నారు. కృష్ణా జలాల పంపకం అంశంలో చంద్రబాబు ఏ పక్షం నిలబడతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు షరతులతో కూడినదా? భేషరతుగా పెట్టుకుంటున్నదా? అన్ని స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినా సరే.. అధికారమే ముఖ్యమన్న ధోరణి కాంగ్రెస్‌ పార్టీలో కనిపిస్తోందని విమర్శించారు. 2009లో తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి వాస్తవమేనని.. అయితే అది షరతులతో కూడుకున్నదని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా చంద్రబాబు చివరివరకు అడ్డుపడ్డారని.. అప్పుడు ఆయన ఏమైనా తీర్మానం చేసి ఉంటే ఆ కాగితాన్ని ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు 30లేఖలు రాశారని.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు సక్రమమైనదేనని ఆయన మీకేమైనా లేఖ ఇచ్చారా? అని కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1200 మంది విద్యుత్‌ ఉద్యోగులను ఆంధ్రాకు బదిలీ చేశారని.. అయితే వారిని విధుల్లోకి తీసుకోకుండా కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని హరీశ్‌రావు తెలిపారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వమే జీతాలు ఇస్తోందన్నారు. మహాకూటమి విడుదల చేసే మేనిఫెస్టోలో తన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com