DailyDose

రేణిగుంట రైల్వేపట్టాలపై బాంబుపేలుడు-నేరవార్తలు

Crime News - Bomb Blast On Renigunta Railway Station

* చిత్తూరు జిల్లా రేణిగుంట పరిధి తారకరామనగర్‌లోని రేణిగుంట – కడప మార్గంలో రైలు పట్టాలపై బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంట రైల్వే స్టేషన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లో పశువులు కాస్తున్న శశికళ అనే మహిళ ఓ డబ్బాను గుర్తించింది. వెంటనే తన చేతిలో ఉన్న కర్రతో డబ్బాను కదిలించడంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీఆర్పీ, రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఇక్కడ అడవి పందుల కోసం గతంలో నాటు బాంబులు పెట్టేవారని స్థానికులు చెబుతున్నారని.. ఇదే కాకుండా ఇతరత్రా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు రేణిగుంట సీఐ అంజు యాదవ్‌ తెలిపారు.

* నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల పరిధి గుడికండ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడికండ్ల వద్ద కారు బోల్తా పడి సంఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బడంగ్‌పేటకు చెందిన వినోద్‌ మరో ఐదుగురు కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు కారులో బయలుదేరారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండల పరిధి గుడికండ్ల సమీపంలోని గుట్ట వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వినోద్‌ తండ్రి ఎల్లయ్య (55), తల్లి గోవిందమ్మ (55), సోదరి హారిక (22), సమీప బంధువు శారద (56) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వినోద్‌కు స్వల్ప గాయాలు కాగా.. కారులో ప్రయాణిస్తున్న మరో బాలుడు శ్రావిక్‌ ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

* గుంటూరు జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాడేపల్లికి చెందిన దుర్గ.. డబ్బు కోసం వేధిస్తోందని భార్గవి అనే మహిళ ఆరోపించారు. రూ.2లక్షలు అప్పుగా తీసుకుని రెండేళ్లలో రూ.14లక్షలు చెల్లించినా ఇంకా బాకీ ఉందంటూ బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ వసూళ్లతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించినా తమపైనే ఒత్తిడి చేస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కన్నీరుమున్నీరుగా విలపించింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని భార్గవి వేడుకున్నారు.

* రోడ్డుకు సమీపంలో ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లడంతో ఆరుగురు జలసమాధి అయిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని ఛతర్‌పుర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న తొమ్మిది మందిలో ముగ్గురిని స్థానికులు కాపాడారు. కారు బావిలో పడటంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

* రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్లి అదుపుతప్పి మిర్చి, జిలేబీ కొట్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కొట్టులో ఉన్న నలుగురిపై మరుగుతున్న నూనె పడడంతో వారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటన జరిగిన తర్వాత కారు నడిపిన మహిళ ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు.