కేసీఆర్ ఓటమి లక్ష్యంగా గురుశిష్యులు ఏకం

వారిద్దరూ గురుశిష్యులు.. రాజకీయాల్లో ఆరితేరారు. అనేక సార్లు ఒకరినొకరు ఓడించుకున్నా, పార్టీలు వేరైనా 24 ఏళ్ల తర్వాత మహాకూటమి మూలంగా మళ్లీ ఒక్కటయ్యారు. వారే తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీఎల్పీ మాజీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి. 1981లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన జీవన్‌రెడ్డి 1983లో తెదేపాలో చేరి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985 ఆగస్టు సంక్షోభం అనంతరం కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2006, 2014 ఎన్నికల్లో గెలుపొందిన జీవన్‌రెడ్డి 2008లో వై.ఎస్‌. మంత్రి వర్గంలో పనిచేశారు. జీవన్‌రెడ్డికి శిష్యుడిగా ఉన్న రమణ 1994లో ఊహించని విధంగా తెదేపా టికెట్‌పై పోటీ చేసి జీవన్‌రెడ్డిని ఓడించారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చేరారు. 1996లో లోక్‌సభకు ఎన్నికైన రమణ.. 1999 నుంచి అయిదు ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపైనే పోటీ చేసి కేవలం 2009లో గెలుపొందారు. 2006, 2008 లోక్‌సభ ఎన్నికల్లోనూ వీరిద్దరూ కేసీఆర్‌పై లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత 24 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జీవన్, రమణలిద్దరూ ప్రస్తుతం ఒక్కటయ్యారు. తెరాసకు వ్యతిరేకంగా ఒక్కటైన మిత్రపక్షాలన్నింటిని ఏకం చేయటంలో కీలకంగా వ్యవహరించిన రమణ.. జగిత్యాలలో ఎలాంటి షరతుల్లేకుండా జీవన్‌రెడ్డికి అవకాశమివ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఏకంగా నిన్న ఇద్దరూ కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయమే రమణ ఇంటికి వెళ్లిన జీవన్‌రెడ్డి పలు అంశాలపై చర్చించారు. పైగా విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతూ ‘‘ఇద్దరం జగిత్యాల ప్రాంతంలో నీతినిజాయతీగా ప్రజల కోసమే పనిచేశాం. వ్యక్తిగతంగా ఏనాడూ విమర్శించుకోలేదు. విమర్శించుకోవటానికి ఏమీ లేదు. రానున్న ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలవటం, రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావటం చారిత్రక అవసరం’’ అని చెప్పారు. ఇద్దరు నేతలు కలవటంతో జగిత్యాల ప్రాంతంలోని కాంగ్రెస్‌, తెదేపా నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com