Agriculture

రద్దు చేసే ప్రసక్తే లేదు

రద్దు చేసే ప్రసక్తే లేదు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రైతులకు ప్రధానంగా అనుమానాలు, అభ్యంతరాలున్న చోట్ల సవరణలు చేయడానికి, మరింత స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. మంగళవారం రాత్రి 13 మంది రైతు ప్రతినిధులతో చర్చించిన హోం మంత్రి అమిత్‌షా.. ప్రభుత్వ పరంగా తాము ఏం చేయాలనుకుంటున్నదీ లిఖితపూర్వకంగా చెబుతామని తెలిపారు. దానిపై రైతు సంఘాలు చర్చించుకొని సమాధానం ఇవ్వాలని కోరారు. అందుకు తగ్గట్టుగానే కేంద్ర వ్యవసాయశాఖ 20 పేజీల ప్రతిపాదనలను రైతులకు బుధవారం అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, కాంట్రాక్టు సేద్యం చట్టానికి సంబంధించి వివరణలు ఇచ్చినా, నిత్యావసర వస్తువుల సవరణ చట్టం విషయంలో ఎలాంటి ప్రస్తావనా చేయలేదు. వ్యవసాయంపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి లేదన్న విమర్శలకు సమాధానం ఇస్తూ రాజ్యాంగం షెడ్యూల్‌-7లోని మూడో జాబితాలో ఉన్న 33వ అంశం కింద ఉన్న అధికారాలను ఉపయోగించుకున్నట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండో జాబితాలోని 26వ అంశం కింద చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది.

వివాదాస్పద అంశాలు.. కేంద్రం వివరణలు
* సందేహం: ఈ చట్టాల వల్ల ఇప్పుడున్న వ్యవసాయ మండీలు బలహీనపడి రైతులు ప్రైవేటు వ్యాపారుల కబంధ హస్తాల్లో ఇరుక్కుంటారు..
* సమాధానం: పాత విధానం కొనసాగుతునే కొత్త ప్రత్యామ్నాయం అందుబాటులోకి వస్తుంది.
* సందేహం: రిజిస్ట్రేషన్లు లేకుండా కేవలం పాన్‌కార్డ్‌ ఆధారంగా వ్యాపారాలు చేసే వారివల్ల రైతులకు మోసం జరుగుతుంది..
* సమాధానం: వ్యాపారుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు రూపొందించుకోవచ్చు.
* సందేహం: రైతులు-వ్యాపారుల మధ్య తలెత్తే వివాద పరిష్కారం కోసం కొత్త చట్టం ప్రకారం సివిల్‌ కోర్టులను ఆశ్రయించేందుకు వీలులేదు. అధికారుల వద్దకే వెళ్లాలి.
* సమాధానం: రైతులకు త్వరితగతిన, తక్కువ ఖర్చులో న్యాయం దక్కేలా చేయడానికే అధికారులు 30 రోజుల్లోపు సమస్యను పరిష్కరించాలన్న నిబంధన విధించాం. సివిల్‌ కోర్టుకు వెళ్లడానికీ అవకాశం కల్పించి సవరణ చేస్తాం.
* సందేహం: వ్యవసాయ ఒప్పందాల రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ కొత్త చట్టంలో లేదు.
* సమాధానం: రిజిస్ట్రేషన్‌ అథారిటీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి ఏర్పాటయ్యేవరకు ఒప్పంద పత్రాలను సంబంధిత ఎస్‌డీఎం (ఆర్డీవో) కార్యాలయంలో అందించేందుకు వీలుగా కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.
* సందేహం: పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకారం విక్రయించుకొనే వ్యవస్థ ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్తుంది.
* సమాధానం: ఇదివరకున్న ఎంఎస్‌పీ వ్యవస్థలో మార్పు చేయలేదు. కనీస మద్దతు ధర ప్రకారం పంట కొనుగోలు కేంద్రాలు, మండీలు ఏర్పాటు చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇచ్చాం.