Politics

ఏపీలో ఎమర్జన్సీ ప్రకటించాలి: బాబు డిమాండ్

Chandrababu Worries And Demands Health Emergency In Andhra Over Eluru

ఏలూరులో సురక్షిత నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం శోచనీయమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. గత ఐదు రోజుల్లో ఒకరు చనిపోవడం, ఆరేడు వందల మంది ఆసుపత్రుల పాలవడంపై విచారం వ్యక్తం చేశారు. నగరం, పరిసర ప్రాంతాల్లో తక్షణమే ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ని ప్రకటించాలని కోరుతూ సీఎం జగన్‌కు బుధవారం చంద్రబాబు లేఖ రాశారు. ‘రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై భయాందోళనలు నెలకొన్నాయి. బాధితులకే కాదు, వారికి సేవలందించే సిబ్బందిలోనూ అవే లక్షణాలు కనిపించడం ఉపద్రవం తీవ్రతకు నిదర్శనం. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారు’ అని పేర్కొన్నారు. ‘సాధారణంగా ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రభుత్వం నుంచి యుద్ధ ప్రాతిపదికన ఉపశమన చర్యలను, సహాయక కార్యక్రమాలను ప్రజలు ఆశిస్తారు. ఏలూరులో గానీ, పరిసర ప్రాంతాల్లో గానీ ఆ దిశగా చర్యలు లేవు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ దుర్ఘటనకు మూలం నీరే. అది ఎక్కడ, ఎలా కలుషితమైందో గుర్తించాలి. ఇప్పటిదాకా జరిగిన ఐఐసీటీ, ఎయిమ్స్‌, సీసీఎంబీ పరీక్షల ఫలితాలను బహిర్గతం చేయాలి. తద్వారా బాధితుల్లో నమ్మకం పెంచాలి’ అని కోరారు.