దసరాకి ప్రారంభం కానున్న సిలికానాంధ్ర సంజీవని

కళలకు కాణాచిగా… పేరుగాంచిన కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామం మరోసారి వార్తల్లోకి ఎక్కనుంది. చుట్టుపక్కల 150 గ్రామాలవారికి అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందించేందుకు ‘సంజీవని’ ఆస్పత్రి ఈ దసరా నుంచి అందుబాటులోకి రానుంది. ‘సిలికానాంధ్ర’ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారి ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఆస్పత్రి ఇది.
కూచిపూడి గ్రామంలోని మధ్యతరగతికి చెందిన దోనెపూడి సుధారాణి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడింది. కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. సమీపంలో వైద్యశాల లేకపోవడంతో ఆమెకు ఏమవుతుందోనని వారు ఆందోళన చెందారు. అష్టకష్టాలు పడి విజయవాడకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. అయితే అదృష్టం బాగుండి ఏమీ కాలేదు. వైద్యఖర్చులు మాత్రం తడిసిమోపెడయ్యాయి.
ఇదే గ్రామానికి చెందిన రంగిశెట్టి జయలక్ష్మిది మరో అనుభవం. కొన్నాళ్ల క్రితం గర్భం దాల్చిన సమయంలో ఊళ్లోగానీ, చుట్టుపక్కల 55 కి.మీ దూరంలోగానీ వైద్యసౌకర్యం లేకపోవడంతో ప్రాణపాయస్థితి ఏర్పడింది. ఆమె పిల్లలు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే వారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు.
**వీళ్లిద్దరే కాదు… కనీస వైద్యసౌకర్యానికి నోచుకోలేక, తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులను భరించలేక ప్రతిరోజూ చచ్చిబతుకుతున్నవారు ఆ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. ’’అయ్యా..! మా ఊరుకు ఎంతో చేశారు. మాతో మమేకమై మా సమస్యలన్నింటిని పరిష్కరిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలోని ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు లేవు. ఏధైనా అత్యవసర పరిస్థితి అయితే మరణించటమే తప్ప బ్రతికి బట్టకట్టే మార్గం లేదు. దయచేసి ఇక్కడ ఓ చిన్న ఆస్పత్రి కట్టించి, పది మందికి వైద్య సేవలు అందించండి‘‘ అనే చిన్న విన్నపం… ఒక పల్లెటూరులో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణానికి బీజం వేసింది.
**కళలకు కాణాచి అయిన కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో రూ. 50 కోట్ల వ్యయంతో ప్రజల సౌకర్యార్థం ప్రజల భాగస్వామ్యంతో ‘సిలికానాంధ్ర’ ఈ హాస్పిటల్‌ను ఏర్పాటుచేస్తోంది. సువిశాల ప్రాంగణంలో అయిదంతస్తుల భవంతితో 200 పడకలతో నిర్మిస్తున్న ఈ హాస్పిటల్ వల్ల 150 గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయాలు అందబోతున్నాయి. ప్రభుత్వం నుంచి, ట్రస్ట్‌ల నుంచి ఎటువంటి లబ్థిపొందకుండా దేశంలోనే ప్రథమంగా నేరుగా ప్రజల సహకారంతోనే ఈ హాస్పిటల్ రూపుదిద్దుకోవటం విశేషం.
***పునర్వైభవం కోసం దత్తత …
కూచిపూడి గ్రామానికి ఆరు శతాబ్థాల ఘన చరిత్ర ఉంది. కూచిపూడి నాట్యంతో తెలుగు ప్రజల ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఒకనాడు అందెల సవ్వడి.. మువ్వల రవళితో అలరాడిన ఈ ప్రాంతం కాలక్రమేణ తన వైభవాన్ని కోల్పోయింది. ఈ సందర్భంలో తెలుగు సాహితీ, సంస్కృతి, సంప్రదాయ స్ఫూర్తిని పదిమందికి పంచుకుని, పదిలంగా ముందుతరాలకు అందించాలనే ఆలోచనతో ఏర్పడిన ’సిలికానాంధ్ర‘ ఈ ప్రాంతానికి పునర్వైభవం తీసుకురావాలనుకుంది. ఈ క్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభోట్ల ఆనంద్, మరో 40 మంది సిలికానాంధ్ర గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్‌తో చర్చించి కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో మౌలికసదుపాయాలు కల్పించింది. రోడ్లు వేయించింది. నీటి వసతులు కల్పించి, ఇక్కడి ప్రజల నుంచి మన్ననలు అందుకుంది.
***వైద్య సేవల అవస్థలు తీర్చేందుకు…
కూచిపూడి ప్రాంతంలోని ప్రజలకు సకల సదుపాయాలు ఉన్నా.. వైద్య సదుపాయాలు మాత్రం లేవు. ప్రధానంగా దివిసీమ ప్రాంతంలోని పది మండలాల ప్రజలు అనారోగ్యం వస్తే అటు విజయవాడకు లేదా ఇటు మచిలీపట్నం జిల్లా హాస్పిటల్‌కు పరుగులు పెట్టాల్సిందే. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాట్లు, ఇతర ప్రాణాపాయ సంఘటనలు జరిగితే గోల్డెన్ అవర్ లోపు హాస్పిటల్‌కు చేరుకోవటం చాలా కష్టం. కూచిపూడి నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలంటే 28కి.మీ. అలాగే కూచిపూడి నుంచి విజయవాడ వెళ్లాలంటే 51కి.మీ. సింగిల్ లైన్ రోడ్డు వల్ల ఈ రూట్లలో ప్రయాణం రెండు గంటలపైనే. దీంతో ఈ ప్రాంత ప్రజలు అనేక మంది అత్యవసర పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు.
**హాస్పిటల్‌కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో గ్రామస్తులు సిలికానాంధ్ర సభ్యుల వద్దకు వచ్చి తమకు వైద్యసేవలు అందటం లేదని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న సిలికానాంధ్ర ఓ చిన్న హాస్పిటల్ కట్టి, తమ ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాలంటూ విన్నవించారు. ఈ ప్రాంతంలో ప్రజలు వైద్యసేవల కోసం పడుతున్న బాధలు, ఇబ్బందులను చూసి, మెగా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఆలోచన చేసి, ఆ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చింది.
**ప్యాలెస్ ఆఫ్ హెల్త్ ఫర్ కామన్ మాన్(పీహెచ్సీ)
కూచిపూడి ప్రాంతంలోని ప్రజలకు నామమాత్రపు ఫీజుతో మల్టీస్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు సిలికానాంధ్ర ’ప్యాలెస్ ఆఫ్ హెల్త్ ఫర్ కామన్ మాన్‘(పీహెచ్సీ)కాన్సె్ఫ్టతో భారీ హాస్పటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ హాస్పిటల్ నిర్మాణంలో ప్రజలనే భాగస్వామ్యం చేసింది. ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారందరి నుంచి నిధుల సేకరణ ప్రారంభించి, కూచిపూడి నడిబొడ్డున ఎకరం ఎనిమిది సెంట్ల విస్తీర్ణంలో ఈ ’సంజీవని‘ హాస్పటల్ నిర్మాణాన్ని చేపట్టింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ విభాగాలు ఉంటాయి. రెండవ ఫ్లోర్లో ఐసీయూ, డయాలసిస్, కార్డియాలజీ యూనిట్. మూడవ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్స్, జనరల్ వార్డ్, నాల్గవ ఫ్లోర్లో జనరల్ వార్డ్స్, బెడ్స్ ఉంటాయి.
**రిక్షా కార్మికుడినుంచి అంతా భాగస్వాములే…
ఈ మల్టీ హాస్పిటల్ నిర్మాణానికి అనేక మంది సహాయ, సహకారాలు అందించారు. ప్రధానంగా ఎన్ఆర్ఐలు భూరి విరాళాలు ఇచ్చారు. ఎన్ఆర్ఐలు, స్థానికులు గానీ మొత్తం ఇప్పటి వరకు రూ. 30 కోట్ల విరాళాలు అందజేశారు. సిలికానాంధ్రనే ఈ విరాళాలను దేశ, దేశాలు తిరిగి సేకరించింది. స్థానికంగానూ విరాళాల కోసం ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించింది. రిక్షాపుల్లర్ వెంకటేశ్వరరావు తాను కష్టపడి సంపాదించిన రూ. 3500లను విరాళంగా అందించారు. హాస్పిటల్ నిర్మాణంలో చ.అ. రూ. 3500లు. దీంతో అతను ఆ నగదును ఇచ్చాడు. ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తి పొందారు. తమకు తోచిన ఆర్థికసాయం చేశారు. స్థానికంగా ఎక్కువగా రూ. అయిదు లక్షలు, రూ. 10లక్షల నగదు సమకూరింది. దీంతోపాటు సిమెంట్ కంపెనీలు, సిమెంట్‌ను విరాళంగా ఇచ్చాయి.
**100 మంది డాక్టర్ల సేవలు…
ఈ దసరాకు (18న) హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అప్పటి నుంచి కూచిపూడివాసులగే గాక ఆ చుట్టుపక్కల 150 గ్రామాల వారికి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన 100మంది డాక్టర్లు ఇక్కడ సేవలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వారంతా వారానికి లేదా నెలకు.. ఒక షెడ్యూల్ ప్రకారం ఇక్కడకు వచ్చి, రోగులకు వైద్యం చేస్తారు. ట్రామా, కార్డియాలజీ, గైనకాలజీ, ఆంకాలజీ, రేడియాలజీ, పిడియాట్రిక్, యూరాలజీ, ఫిజియోథెరపీ, ఆఫ్తామాలజీ, ఓపీ, ల్యాబ్స్, ఆంబులెన్స్ సర్వీసులకు సిబ్బందిని తీసుకోనున్నారు. దీంతో పాటు కూచిపూడి చుట్టుపక్కల ఉన్న పది మండలాల్లో పది ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఐసీయూ యూనిట్స్‌తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఏ మండలం వాహనం, ఆ మండలంలోని గ్రామాల్లోని రోగులను తీసుకొచ్చేందుకు ఆంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తానికి చిన్నగా మొదలైన ఒక ప్రయత్నం అందరి సంకల్పబలంతో పేదలకు భరోసానిచ్చే ‘సంజీవని’గా రూపుదిద్దుకోవడం విశేషమే కదా.
**రోగులు కాదు… అతిథులు…- కూచిభొట్ల ఆనంద్, ‘సిలికానాంధ్ర’ వ్యవస్థాపక అధ్యక్షులు
మనిషిని కాపాడే లక్ష్యంతో, వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ వైద్యాలయాన్ని నిర్మిస్తున్నాం. ఈ హాస్పిటల్‌కు వచ్చేవారంతా అనారోగ్యంతో ఉన్న అతిథులు. వారంతా ఆరోగ్యంతో తిరిగి వెళ్లాలి. ఈ ప్రాంత వాసులకు ఈ హాస్పిటల్ నిజంగా సంజీవని లాంటిది. 18 సంవత్సరాలుగా సిలికానాంధ్ర ఎన్నో కార్యక్రమాలను చేస్తోంది. ప్రజా శ్రేయస్సుకోసం జరుగుతున్న ఈ వినూత్న కార్యాక్రమనికి సహకారం అందించేవారి కోసం సిలికానాంధ్ర ఎదురు చూస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com