ప్రపంచవ్యాప్తంగా తొలి 500 మంది సంపన్నులు బుధవారం రోజులో నష్టపోయిన మొత్తం ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.7.3లక్షల కోట్లు. వీరందరిలోకి అత్యధికంగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్ ఒక్కరే రూ.66 వేల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. ఈ ఏడాది బిలియనీర్ల సూచీలో వచ్చిన రెండో అతిపెద్ద కుదుపుగా దీనిని బ్లూమ్‌బెర్గ్ అభివర్ణించింది. వీరందరిలోకి బెజోస్ ఎక్కువగా నష్టపోయినట్లు పేర్కొంది. ఇక యూరప్‌కు చెందిన బిలియనీరు బెర్నార్డ్ అర్నాల్ట్ సంపద రూ.33వేల కోట్లు ఆవిరైంది. ఆయన ఈ ఏడాదిలో పెంచుకున్న విలువలో సగం ఒక్కరోజులోనే కోల్పోయారు. చైనా సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేసిందనే వార్తలు రావడంతో ఆయన ఎల్వీఎంహెచ్ షేర్లు పతనమయ్యాయి. ఇక బెర్క్‌షైర్ హత్వే అధినేత వారన్ బఫెట్ సంపద కూడా దాదాపు రూ.33 వేలకోట్లు తగ్గింది. మరో 67 మంది బిలియనీర్లు తమ సంపదలో దాదాపు రూ.2.3 లక్షల కోట్లను కోల్పోయారు.