సిఎం రమేష్ ఇంట్లో ముగిసిన ఐటీ దాడులు

తెదేపా ఎంపీ సీఎం రమేశ్‌ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్‌ నివాసంలో 10 గంటలపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌ సమక్షంలో ఇవి కొనసాగాయి. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలుపై అధికారులు విచారించారు. అధికారులు తమ వద్ద నుంచి ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌ తెలిపారు. తాము నిజాయతీగా ఉన్నాం కాబట్టే 10 గంటల పాటు సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన స్వగ్రామమైన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆయనకు చెందిన సంస్థల కార్యాలయాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో రమేశ్‌ సోదరుడు సీఎం సురేశ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని బయటకు పంపించివేసి ఇంటి తలుపులు మూసివేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్‌ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తున్నందునే తనపై కక్షతో ఐటీ దాడులు జరిపిస్తున్నారని సీఎం రమేశ్‌ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నారు. ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. గత వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లూరుకు చెందిన తెదేపా నేత బీద మస్తాన్‌రావు నివాసంలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు.. ఆ తర్వాత విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్‌ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లోనూ తనిఖీలు జరిపినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. అయితే ఆ వార్తలను మంత్రితో పాటు ఐటీ అధికారులు సైతం ఖండించడంతో వివాదానికి తెరపడింది. ప్రస్తుతం సీఎం రమేశ్‌ను ఐటీ శాఖ లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తుండటంపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com