ఏ పని చేస్తున్నా అచ్చిరావడం లేదు. ఏదన్నా మొదలు పెట్టినా తీవ్ర ఒడుదొడుకులు తప్పడం లేదు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండటం లేదు. ఇలాంటివన్నీ పదేపదే జరుగుతుంటే ఏ మనిషికైనా ఏ ఆలోచన తడుతుందో తెలుసా! నివాసం ఉంటున్న ఇంటిలో వాస్తు దోషం ఏమైనా ఉందా అని? మరి ఉప్పల్ మైదానంలో ఆడిన ప్రతి మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలవుతుంటే దానికీ వాస్తు దోషమే కారణమా? అవునంటున్నారు ఓ పూజారి. మరి.. ఉప్పల్ మైదానంలో వాస్తుదోషాన్ని తొలగించడానికి ఏం చేశారో తెలుసా? వాస్తుశాస్త్రానికి అధిదేవుడు అయిన విఘ్నేశ్వరుడి ఆలయం నిర్మించారు. మామూలు రోజుల్లో అంత సందడి ఉండదు కానీ మ్యాచులు జరిగే రోజుల్లో ఈ గుడి భక్తులతో కళకళలాడుతుంది. అందులోనే పుజారిగా పనిచేస్తున్నారు హనుమంతు శర్మ. ‘ఈ వినాయకుడి మందిరాన్ని 2011లో నిర్మించారు. భారత జట్టు, ఐపీఎల్లో ఒకప్పటి దక్కన్ ఛార్జర్స్ ఈ మైదానంలో నిర్వహించే మ్యాచుల్లో విజయం సాధించాలన్నదే గుడి నిర్మాణం వెనకాల ఉన్న ఉద్దేశం. ఇది వాస్తవమే అని రుజువైంది. వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత టీమిండియా ఓడిపోలేదు’ అని హనుమంతు శర్మ తెలిపారు. గణాంకాలు పరిశీలిస్తే భారత్ ఈ వేదికలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2005లో ఆడింది. దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది. 2007, 2009లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. 2011, అక్టోబర్ 14న ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. 2010లో న్యూజిలాండ్‌తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత మూడు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది. ఈ వినాయకుడి ఆలయాన్ని గొప్ప క్రికెటర్లు సందర్శిస్తారని హనుమంతు శర్మ అంటున్నారు. ‘మ్యాచ్‌లు ఉన్నప్పుడు ప్రాక్టీస్ సెషన్లు పూర్తికాగానే ఎంఎస్ ధోనీ గుడి ముందు నిలబడి గణపతి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. అలాగే మరో క్రికెటర్ కర్ణ్‌శర్మ గుడికి వస్తాడు’ అని హనుమంతు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పూజారిగా పనిచేస్తున్న హనుమంతు కొన్ని తెలుగు చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు వేశారు. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబు నటిస్తున్న మహర్షి సినిమాలో నటిస్తున్నట్టు పేర్కొన్నారు.