Food

గాడిదపాలు గరిటెడైనా చాలు

గాడిదపాలు గరిటెడైనా చాలు

భూమ్మీద పుట్టిన దాదాపు ప్రతీ జీవరాశికి.. పాలే ప్రధాన.. ప్రథమ ఆహారం!మనిషి మాత్రమే.. అమ్మ పాలతో శరీర పటుత్వాన్ని సంపాదించి.. ఆ తర్వాత ఇతర జీవరాశుల పాల మీద ఆధారపడుతాడు..సంపూర్ణ పౌష్టికాహారంగా పేర్కొనే పాలను.. మనిషి విస్మరిస్తున్నాడని గణాంకాలు చెబుతున్నాయి.. అందుకే మళ్లీ పాల విశిష్ఠతను గుర్తు చేయడానికి.. ఎన్నో సంస్థలు పూనుకుంటున్నాయి.. జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుతున్నాయి.. అందుకే ఏ పాలల్లో ఎంత ఆవశ్యకత ఉందో..ఏ పాలు మంచివో తెలిపే కథనం ఈ జంటకమ్మ. పాలు.. పాల ఉత్పత్తుల ద్వారా ఎంతో న్యూట్రీషనల్ వాల్యూస్‌ని మనం పొందుతున్నాం. అంతేకాదు.. పాల ఉత్పత్తి అనేది మిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది.
**ఎందుకీ రోజు..?
ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉండాలనుకుంటున్నారు జనాలు. కనీసం ఆ రోజునైనా ఆ రోజు విశిష్టత ఉందని వాటి మీద గౌరవం పెంచుకుంటున్నారు. అందుకే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2001లో ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రారంభించింది. గ్లోబల్ ఫుడ్‌గా పాలను చెప్పొచ్చు.. కాబట్టే దానికంటూ ఓ ప్రత్యేకమైన రోజు ఉండాలని జూన్ 1న ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా జరిపేలా చూస్తున్నాయి చాలా సంస్థలు. 2016 నుంచి ఎక్కువ సంఖ్యలో సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ సంవత్సరం 40 దేశాలు ఈ సెలబ్రేషన్స్‌ని జరిపితే, 2017లో 80 దేశాలు, 2018లో 72 దేశాలు పాల దినోత్సవాన్ని ఘనంగా జరిపాయి. ఆ సమయంలో ఎన్నో ఈవెంట్స్‌తో పాటు పాల వల్ల జరిగే మంచి, చెడుల గురించి చర్చించారు. ఇక సోషల్ మీడియాలో రేజ్ ఏ గ్లాస్ హ్యాష్ ట్యాగ్‌తో దీనికి సంబంధించిన క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు.
**ఎంత అవసరం?
యవ్వనానికి వచ్చేసరికి ఎముకల దృఢత్వం వచ్చేస్తుంది. అప్పుడు పాల అవసరం లేదనుకుంటారు. కానీ క్యాల్షియం, విటమిన్ డీ, ఇతర మినరల్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవి ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి కాబట్టి పాలు తాగాలి. మీ ఎముకలలో, పళ్లలో 99శాతం శరీర కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలకు సాంద్రత, బలాన్ని ఇస్తుంది. సుమారు పావు లీటరు పాలల్లో 300మి.గ్రా. కాల్షియం దాగి ఉంటుంది. ఆడవాళ్లకు రోజుకు సుమారు వెయ్యి మి.గ్రా. కాల్షియం అవసరం. కాకపోతే వయసును బట్టి కూడా ఇది మారుతుంది. 19 నుంచి 50 సంవత్సరాలున్న వారికి 1200 మి.గ్రా అవసరమవుతుంది. అదే మగవాళ్లకు ఇదే వయసు ఉన్నవాళ్లకు వెయ్యి మి.గ్రా. కాల్షియం అవసరం. అంటే.. కనీసం అందరూ మూడు నుంచి నాలుగు గ్లాసుల పాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
**పాలల్లో తేడా..
ఆవు పాలు, గేదె పాలు చూడడానికి రెండూ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఆవు పాలు చాలా లైట్‌గా ఉంటాయి. గేదె పాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆవు పాలల్లో ఫ్యాట్ తక్కువ ఉంటే, గేదె పాలల్లో ఎక్కువ ఉంటుంది. ఆవు పాలు త్వరగా జీర్ణమవుతాయి. అందుకే వాటిని పిల్లలకు పట్టిస్తుంటారు. ఈ పాలల్లో 90 శాతం నీరే ఉంటుంది కాబట్టి దీంతో లభించే క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. ఆవు పాలలో కాల్షియం, పాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలూ తక్కువే. ఇక గేదె పాల విషయానికొస్తే.. దీంట్లో ప్రోటీన్లు ఎక్కువ. ఇతర మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి అధిక బరువు ఉన్న వారు గేదె పాల జోలికి వెళ్లొద్దు. వాళ్లు ఆవు పాలను తాగడం బెటర్. సన్నగా ఉన్నవారు గేదె పాలు తాగవచ్చు. వ్యాయామం చేసే వాళ్లు కూడా గేదె పాలు తాగడం మంచిది.
**ఎక్కువైనా కష్టమే..
చిన్న పిల్లలు పాలు తాగితే మంచిదంటారు. నిజంగా కూడా మంచిదే. మరి పెద్ద పిల్లలు, పెద్ద వాళ్లు, ఆడవాళ్లను కూడా గ్లాసులకు గ్లాసు పాలు తాగుమని సలహాలు ఇచ్చేస్తుంటారు. కానీ మగవాళ్లను పాలు తాగమని పెద్దగా అడగరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే విషయం ముందుగానే అందరికీ తెలిసిపోయినట్టుంది. మగవాళ్లు ఎక్కువగా పాలు తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడాల్సిందేనని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్లు ప్రకటించేశారు. మామూలుగా కంటే కూడా 32 శాతం ఈ పాల వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ సంభవించే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఒకవేళ అంతగా కాల్షియం అవసరం ఉంటే.. ఎంత మోతాదుకు మించకూడదో మీ ప్రత్యేక డాక్టర్ల సలహా తీసుకొని మరీ పాలు తాగాలంటున్నారు. కాబట్టి పాలు తాగే ముందు జర భద్రం. కొంతమందికి పాలు తాగితే ఎలర్జీ వస్తుంది. అలాంటి వాళ్లు కూడా పాలకు బదులు.. విటమిన్ డి లభించే ఇతర పదార్థాలను తీసుకోవడం మంచిది.
**గాడిద పాలు గరిటెడైనా..
గార్దభం పాలను చిన్నప్పుడు పోస్తుంటారు ఇప్పటికీ చాలా చోట్ల. దీనివల్ల ఎన్నో జబ్బులు నయమవుతాయని నమ్ముతారు. గాడిద పాల విశిష్టత గురించి మన కంటే చైనా వాడికి ఎక్కువ తెలుసు. గాడిదల కోసం పాకిస్తాన్ దగ్గర చేజాజిన రోజులు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో! ఆస్తమా, దగ్గు, ఆయాసంలాంటి రోగాలకు ఈ పాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. తల్లిపాలు పడని పసికూనలకి కూడా ఈ పాలు బాగా పట్టించొచ్చని అంటుంటారు. సైంటిఫిక్‌గా కూడా ఈ పాలు ఎంతో మేలు అంటున్నారు. గాడిద పాలు చిక్కగా ఉన్నా.. ఇందులో 85శాతం నీళ్లు, ఐదున్నర శాతం కొవ్వులు ఉంటాయి. ఐరోపాల్లాంటి దేశాల్లో ఈ గాడిదను మన గంగిగోవులా పూజిస్తారు. మనదేశంలో గాడిద పాలకు గిరాకీ ఎక్కువ. అందుకే చిన్న జండూబామ్ సీసా పాలను 50 రూపాలయకు కొనుగోలు చేస్తున్నారంటే దీని డిమాండు అర్థం చేసుకోవచ్చు.
**మేక పాలు మేలు..
మేక పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయనేది మరచిపోవద్దు. ఈ రెండు పాల కన్నా మేక పాలు మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ పాలు త్వరగా జీర్ణమవుతాయి. దీంట్లో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆవు పాల కంటే కూడా ఇందులో కాసిన్ అనే మిల్క్ ప్రోటీన్ తక్కువ ఉంటుంది. అందువల్ల ఈ పాలతో ఎలర్జీలు వచ్చే ప్రమాదం అయితే ఉండదు. మేక పాలల్లో విటమిన్ ఎ, విటమిన్ బి2, రిబోప్లెవిన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్స్, కాల్షియం, పాస్ఫరస్‌లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందేలా చేస్తాయి.