Business

సంగం డెయిరీకి విజిలెన్స్ నోటీసులు-వాణిజ్యం

సంగం డెయిరీకి విజిలెన్స్ నోటీసులు-వాణిజ్యం

* సంగం డెయిరీ నిబద్ధతతో పని చేస్తోందని ఆ డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. డెయిరీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంగం డెయిరీకి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. 60 అంశాలకు పైగా సమాచారం కావాలని వాళ్లు అడిగినట్లు ఆయన పేర్కొన్నారు. నోటీసులపై హైకోర్టుకు వెళితే స్టే ఇచ్చినట్లు ధూళిపాళ్ల నరేంద్ర వివరించారు. డెయిరీ టర్నోవర్‌ రూ.4 కోట్ల నుంచి రూ. 913 కోట్లకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. డెయిరీకి సంబంధించి రూ.160 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లు ధూళిపాళ్ల పేర్కొన్నారు. 

* కరోనా సమయంలో వ్యాపారాలు ముందుకు సాగేందుకు టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించడం నిర్మాణాత్మక మార్పు అని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల తెలిపారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎప్‌సీసీఐ) అధ్యక్షురాలు డాక్టర్‌ సంగీతారెడ్డితో శనివారం జరిగిన ఫైర్‌సైడ్‌ ఛాట్‌లో ఆయన మాట్లాడారు. 93వ ఇండస్ట్రీ లాబీ వార్షిక సమావేశంలో ఆయన పలు కీలక విషయాలు చర్చించారు. డిజిటల్‌ టెక్నాలజీ చుట్టూ తమ మౌలిక కార్యకలాపాలు, సదుపాయాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.

* కరోనా మహమ్మారి నుంచి భారత్‌ క్రమంగా కోలుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని సూచించే గణాంకాలు రోజురోజుకీ ప్రోత్సాహకరంగా మారుతున్నాయని తెలిపారు. ఆరేళ్లుగా భారత్‌పై పెరుగుతున్న ప్రపంచ దేశాల విశ్వాసం గత ఐదారు నెలల్లో మరింత ఇనుమడించిందని పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని తెలిపారు. ఫిక్కీ 93వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ శనివారం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

* దేశంలో ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు గత నెలలో 4.65 శాతం పెరిగి, 2,64,898కి చేరాయని వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్‌ వెల్లడించింది. 2019 నవంబరులో 2,53,139 వాహనాలకు గిరాకీ లభించగా, ఈసారి పండుగలకు తోడు కొవిడ్‌ నేపథ్యంలో, వ్యక్తిగత ప్రయాణానికి ఏర్పడిన ప్రాధాన్యత వల్ల విక్రయాలు పెరిగినట్లు పేర్కొంది. ఈ సమాఖ్య అధ్యక్షుడు, మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఎండీ, సీఈఓ కెనిచి అయుకవా ఇటీవలి అంచనాల్లో సుమారు 13 శాతం వృద్ధి కనిపిస్తుందని పేర్కొనడం గమనార్హం.

* రోజుకు 10 లక్షల మందికి కరోనా టీకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అపోలో హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతా రెడ్డి తెలిపారు. అయితే, ప్రభుత్వం వ్యాక్సిన్ల పంపిణీని ఎలా చేపడుతుందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తాము 6,000 మందికి పైగా సిబ్బందికి టీకానిచ్చే విషయంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తమ నెట్‌వర్క్‌లోని 71 ఆసుపత్రులు, వందల సంఖ్యలో క్లినిక్‌లు, వేల సంఖ్యలో ఫార్మసీల్లో వీరిని అందుబాటులో ఉంచుతామన్నారు. వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రైవేటు రంగానికి ప్రభుత్వం అనుమతినిస్తుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

* కొవిడ్‌-19 మహమ్మారి వల్ల దేశంలో డిజిటైజేషన్‌ ప్రక్రియ వేగవంతం అయ్యిందని జాతీయ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది. ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్ణయాలు సైతం ఇందుకు చేయూతనిచ్చాయని ఎన్‌పీసీఐ సీవోవో ప్రవీణా రాయ్‌ పేర్కొన్నారు. శనివారం ఓ సెమినార్‌లో మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలు డిజిటైజేషన్‌ ప్రక్రియలో భాగమవుతున్నాయని చెప్పారు. నిత్య జీవితంలోని ప్రతి అంశంలో ఇది భాగమైందన్నారు. నగదు లావాదేవీల నుంచి క్రమంగా డిజిటల్‌ చెల్లింపుల వైపు అడుగులు పడుతున్నాయని వివరించారు.

* దివీస్‌ లేబొరేటరీస్‌ షేర్లకు సంబంధించి 2017లో ఇన్‌సైడర్‌ ట్రేటింగ్‌కు పాల్పడ్డ అప్పటి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ మద్దినేనిపై సెబీ చర్యలు తీసుకుంది. అతను ప్రత్యక్షంగా, పరోక్షంగా స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు చేయకుండా ఏడాదిపాటు నిషేధం విధించింది. అంతేకాకుండా రూ.11లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దివీస్‌ సంస్థ షేర్లలో లావాదేవీలను శ్రీనివాస్‌ రెండేళ్లపాటు చేయడానికి వీల్లేదని చెప్పింది. షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేయడం వల్ల వచ్చిన మోసపూరిత లాభాలు రూ.1.83లక్షలను అప్పటి నుంచి ఇప్పటి వరకు 12శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని శుక్రవారం ఆదేశాలిచ్చింది. జులై 10, 2017న యూఎస్‌ఎఫ్‌డీఏ దిగుమతికి సంబంధించిన నిషేధాన్ని ఎత్తివేసిందనే విషయాన్ని మార్కెట్‌కు తెలియజేయడానికి రెండున్నర గంటల ముందే ఆయన 4,000 షేర్లను కొన్నారు. ఆ తర్వాత ఈ సంగతిని మార్కెట్‌కు సంస్థ తెలియజేసిందనే విషయంపై సెబీ విచారణ జరిపింది.