Fashion

స్వాతంత్ర్య సంగ్రామంలో ఉద్యమించిన వీరమహిళలు

స్వాతంత్ర్య సంగ్రామంలో ఉద్యమించిన వీరమహిళలు

బ్రిటీష్‌వారి బానిస సంకెళ్లను తెంచి భరతమాత దాస్యవిముక్తికోసం భారతీయులు చేపట్టిన స్వాతంత్య్ర సమరంలో ఎన్నో కీలక ఘట్టాలు. ఈ చారిత్రక ఘట్టాలలో, మనదేశ స్వతంత్ర పోరాటంలో, భారత రాజ్యాంగ రూపకల్పనలో స్ర్తిలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. అవిశ్రాంతంగా కృషిచేసిన స్ర్తిలెందరో చరిత్ర మరుగునపడిపోయారు. దేశ నిర్మాణంలో, దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన స్ర్తిలను అందరూ కాకపోయినా, కొందరినైనా స్మరించుకోవడం మన ధర్మం. భారతీయులను బానిసలుగా చూస్తుంటే ఈ పోరాటయోధుల రక్తం ఉడికింది. కొందరు అహింసావాదం తమ పోరాటంగా కొనసాగిస్తే ఇంకొందరు కన్నుకు కనే్న సమాధానం అన్నట్లుగా బ్రిటీష్‌వారిపై పోరాడారు, తిరగబడ్డారు, చివరకు ప్రాణాలు కోల్పోయారు.ఉప్పు సత్యాగ్రహంలో సుమారు 17 వేలమంది స్ర్తిలు నిర్బంధానికి గురి అయ్యారు. దీన్ని బట్టి స్వాతంత్రోద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందులో కొందరిని గురించి తెలుసుకుందాం.
**కస్తూర్బా గాంధీ (186-1944)
మహాత్మాగాంధీ భార్య, సత్యాగ్రహ నాయకురాలు. మహాత్మాగాంధీ అరెస్టయిన పలు సందర్భాలలో ఆమె భర్త స్థానాన్ని తీసుకుంది. సౌత్ ఆఫ్రికాలోని డర్బన్‌లో భారతీయ వర్కర్లపై ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాడి 3 నెలల జైలుశిక్ష అనుభవించారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్‌లో గాంధీ వెంటే ఆమె ఉన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీతోపాటు జైలుకెళ్ళారు. 1944లో అస్వస్థతకు గురై పుణేలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో తుదిశ్వాస విడిచారు.
**అనీబిసెంట్ (1847-1933)
అనీబిసెంట్ ఐరిష్ మహిళ, థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నాయకురాలు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు. హోంరూల్ లీగ్ ఏర్పాటుకు సహాయ సహకారాలందించారు. వారణాసిలో సెంట్రల్ హిందూ కాలేజీ స్థాపనకు సాయంచేశారు. 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. హోంరూల్ టైంలో ఆమె అరెస్టయ్యారు. తర్వాత కొత్త నాయకత్వం రావడంతో రాజకీయాలనుంచి తప్పుకున్నారు. అనీబిసెంట్ ‘న్యూఇండియా’ వార్తాపత్రికను కూడా ప్రారంభించింది.
**మేడం కామ (1861-1936)
1907, జర్మనీలో స్టట్‌గార్ట్‌లో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్‌లో తొలి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘‘ఈ జెండా భారతీయ స్వాతంత్య్రం? చూడు, ఇది పుట్టింది? స్వాతంత్య్ర పోరాటంలో తమ జీవితాలను త్యాగంచేసిన భారతీయ యువకుల రక్తంతో పవిత్రమైనది’’ అని ఉద్ఘాటించింది.
**సరోజినీనాయుడు (1879-1949)
నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పాపులర్ అయిన సరోజినీనాయుడు హైదరాబాద్‌లోని బెంగాల్ కుటుంబంలో పుట్టారు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరంలోకి వచ్చారు. గోపాలకృష్ణ గోఖ లే, రబీంద్రనాథ్ ఠాగూర్, గాంధీ, నెహ్రూలతోకలిసి పనిచేశారు. అనేక కవితలు రాశారు. ఆమె మొదటి కవితా సంకలనం ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’ పబ్లిష్ అయింది. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. సరోజినీ నాయుడు ఖిలాపత్ ఉద్యమం కోసం ప్రచారం చేశారు. మహిళలు బయటకు రావటమే అరుదైన తరుణంలో స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమంలో పురుషులతో సమానంగా ఉద్యమంలో పాల్గొన్నారు.
**అరుణ అసఫ్ అలీ (1909-1996)
క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. 1942లో ముంబైలోని గొవాలియా టాంక్ మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసింది. ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌యొక్క మాసపత్రిక ‘ఇంక్విలాబ్’కు సంపాదకత్వం చేశారు. స్వాతంత్య్రానంతరం తన చివరి రోజుల్లో ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ’ అని పిలువబడింది. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి జైలుకు వెళ్లారు. 1944 వరకు అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్నారు.
**సుచేతా కృప్లాని (1908-1974)
భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి.
**ఝాన్సీరాణి లక్ష్మీబాయి (1828-1858)
ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణి, ఆమె 1857లో జరిగిన భారత తిరుగుబాటులో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులలో ఒకరు. రోజ్ అధికారి ఈమెను ఒక ప్రమాదకరమైన నాయకురాలిగా వర్ణించాడు.
**బేగం హజ్రత్ మహల్ (1820-1839)
మొదటి స్వాతంత్య్ర ఉద్యమం (1857-1858) సమయంలోప్రధాన పాత్ర పోషించిన గొప్ప భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు. ఆమెను బేగం ఆఫ్ అవద్ అని కూడా పిలుస్తారు. ఈమె అప్పటి లక్నో పాలకుడు, నవాబ్ వాజిద్ అలీషా భార్య. రాజా జైలార్‌సింగ్ వంటి దేశభక్తులతో కలిసి బ్రిటీష్ వారిపై ప్రథమ స్వాతంత్య్ర సమరంచేసింది. తన కొడుకు యువరాజు బిర్జీస్ ఖాదిర్‌ను అవద్‌కు రాజును చేసింది. నేపాల్ దేశానికి చేరి శరణార్థిగా ప్రవాస జీవితం గడిపి 1875లో యాభై తొమ్మిదో ఏట మరణించింది.
**భీమబాయ్ హాల్కర్ (1795-1858)
భీమబాయి హాల్కర్, ఇండోర్ మహారాజా యశ్వంత్ రావ్ హాల్కర్ కుమార్తె. 1817లో భీమాబాయి హాల్కర్ బ్రిటీష్ కల్నల్ మాల్కంకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అతన్ని గెరిల్లా యుద్ధంలో ఓడించింది.
**చెన్నమ్మ (1778-1829)
కర్ణాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన కిట్టూర్ రాజు ‘రాజామల్లసర్జా’ చనిపోయిన తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టింది అతని భార్య చెన్నమ్మ. తమ రాజ్యంపై బ్రిటీష్ వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసింది. కానీ బ్రిటీష్ వారు ఆమెను ఓడించి ఖైదు చేశారు.
**దువ్వూరి సుబ్బమ్మ (1880-1964)
దేశమాతకోసం స్వతంత్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన మొట్టమొదటి మహిళ. సుబ్బమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరామంలో 1880 సం.లో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో మల్లాది సుబ్బావధాని దంపతులకు జన్మించింది. 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. అంతేగాకుండా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా
ఉద్యమాలలో పాల్గొన్నది.
**దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్ (1909-1981)
స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ మార్గంలో నడిచారు. విదేశీ వస్త్ర బహిష్కరణలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె జీవితాంతం ఖాదీ దుస్తులే ధరించారు. 1923లో రాజమండ్రి ఖాదీ ఎగ్జిబిషన్‌లో ఇంఛార్జిగా పాల్గొన్నారు. టిక్కెట్టులేకుండా నెహ్రూని కూడా ఎగ్జిబిషన్‌లోకి అనుమతించలేదామె. దుర్గ్భాయ్ ధైర్యాన్ని నెహ్రూ ప్రశంసించారు. మహిళల అభ్యున్నతికి విద్యే ఆయుధం అని ఆమె విశ్వసించారు.
**కెప్టెన్ లక్ష్మీ సెహగల్
స్వాతంత్య్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరఫున కదం తొక్కిన వీరవనిత. అభినవ ఝాన్సీలక్ష్మీబాయిగా పేరు తెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు స్వాతంత్రోద్యమంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా దళాల్లో ఝాన్సీరాణి రెజిమెంట్‌లో చేరి, కెప్టెన్ హోదాలో డాక్టర్‌గా వైద్య సేవలందించారు.
**రాణి అవంతిబాయి (1831-1858)
1857 తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడి అనేక ప్రాంతాలలో విజయం చేజిక్కించుకుంది. కానీ ఆ విజయాలు ఎంతోకాలం నిలవలేదు. దీర్ఘకాలం పోరాడిన తర్వాత అధికారాన్ని కోల్పోయింది. చివరకు బ్రిటీష్ సైన్యానికి చిక్కి చావటం ఇష్టంలేక తన కత్తితో తానే పొడుచుకుని సంహరించుకుని ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్తరాణి.
**అమరం కనకమ్మ
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుంచి తొలి మహిళా స్వాతంత్య్ర పోరాటయోధురాలు. మహాత్మాగాంధీ అనుచరురాలిగా పేరొందిన కనకమ్మ, 1913లో సుజన రంజని సమాజం ఏర్పాటుచేసి హరిజనోద్ధరణకు కృషిచేశారు. గాంధీజీ పిలుపునందుకొని సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
పైవారే గాకుండా రాజ్‌కుమారి గుప్త, పార్వతిగిరి, కనకలతా బారువా, మాతంగిని హజ్రా, చాకలి ఐలమ్మ, శివరాజు సుబ్బమ్మ, పాలకోడేటి శ్యామలాంబ, పద్మజా నాయుడు, కొడాలిక మమతాంబ మొదలైన వారెందరో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్య్ర పోరాటంలో మహిళామణులదీ విశేష పాత్ర. భూమాతను పరాయి పాలకుల చెరనుంచి విడిపించేందుకు తమవంతు కృషిచేసిన మహిళా మూర్తులను స్మరించి తరిద్దాం.