లక్ష కోట్లు పోయాయి

అంతర్జాతీయ అనిశ్చితులు, ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి తాజా జీవనకాల కనిష్ఠానికి పడిపోవడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ఇలా కారణం ఏదైనా గతవారం స్టాక్‌మార్కెట్లు భారీ స్థాయిలో లాభనష్టాల్లో ఊగిసలాడాయి. అయితే అమాంతం పైకెగరడం లేదా పాతాళానికి పడిపోవడం.. క్రితం వారమంతా సూచీల పయనం ఇలాగే సాగింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక మదుపర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ పరిస్థితి కేవలం సాధారణ మదుపర్లపైనే కాదు.. భారీ కంపెనీలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. మార్కెట్‌ విలువ పరంగా టాప్‌ 10 కంపెనీల్లో 3 కంపెనీలు గతవారం ఏకంగా రూ. లక్ష కోట్లు నష్టపోయాయి. మిగతా ఏడు కంపెనీలు లాభాలను పొందాయి. మార్కెట్‌ విలువ ప్రకారం.. టీసీఎస్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ లిమిటెడ్‌, ఐటీసీ లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, మారుతి టాప్‌ 10 సంస్థలుగా ఉన్నాయి. వీటిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), ఐటీసీ, ఇన్ఫోసిస్‌ కంపెనీలు గతవారం తమ మార్కెట్‌ విలువలో రూ. 1,07,026.12కోట్లు నష్టపోయాయి. మిగతా ఏడు కంపెనీలు గతవారం ఆర్జించిన లాభాల కంటే కూడా ఈ నష్టం ఎక్కువగా ఉండటం గమనార్హం. మిగతా ఏడు కంపెనీలు మొత్తంగా రూ. 97,498.38కోట్లు లాభపడ్డాయి. కాగా.. ఎక్కువగా నష్టపోయిన కంపెనీ టీసీఎస్‌. శుక్రవారం నాటికి టీసీఎస్‌ మార్కెట్ విలువ రూ. 85,330.17కోట్లు తగ్గి రూ. 7,19,857.48కోట్లుగా ఉంది. ఇక ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ రూ. 18,696.68కోట్లు పడిపోయి రూ. 2,96,635.05కోట్లుగా ఉంది. ఐటీసీ విలువ రూ. 2,999.27కోట్లు తగ్గి రూ. 3,36,285.40కోట్లకు చేరింది. ఇక మిగతా ఏడు కంపెనీల్లో ఎక్కువగా లాభపడింది ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌. గతవారంలో ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 48,524.59కోట్లు పెరిగి రూ. 7,13,965.75కోట్లకు చేరింది. కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 22,130.78కోట్లు పెరిగి రూ. 2,23,005.06కోట్లుగా ఉంది. మారుతి విలువ రూ. 11,782.63 కోట్లు పెరిగి రూ. 2,20,006.42 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ కంపెనీలు కూడా లాభపడ్డాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com