Devotional

15 నుండి ధనుర్మాసం

15 నుండి ధనుర్మాసం

ప్రకృతి సహజంగా, ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీకలుగా కార్తిక , మార్గశిర మాసాలు ఆస్తికుల మనోమందిరాలను పులకింపజేస్తాయి. కార్తిక మాసంలో స్నానాలు, వ్రతాలు, సామూహిక వనభోజనాలతో పరిశుద్ధమైన మనసులు… మార్గశిర మాసంలో మరింత భగవత్‌ చింతనలో తన్మయమవుతాయి. మనస్సులు కూడా నిర్మలంగా ఉంటాయి. కనుకనే జ్ఞానసముపార్జన చేయయుటకు మానవాళికి అనువైన కాలమిది. ఈ మార్గశిర మాసంలో ధనుర్మాస ప్రత్యూష రాగోదయ పవిత్ర క్షణాలలో శ్రీరంగనాథస్తుతి పారాయణ గీతికలే వినిపిస్తాయి ప్రతి హృదయంలో!
*ప్రతినెలా సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రమణం అంటారు. అది మహాపుణ్యదినం. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధను రాశిలోకి ప్రవేశించిన కాలమే ధునుసంక్రమణం. తమిళులు ఈ క్షణం నుంచి మకర సంక్రమణం వరకు 30 రోజులు ధనుర్మాసంగా పిలుస్తూ ‘శ్రీవతాన్ని’ ఆచరిస్తారు. దీన్నే ‘కాత్యాయని వ్రతం, ‘తులసీ మాత వ్రతం’, ‘మార్గశీర్ష వ్రతం’ ‘మార్ఘళీ వ్రతం’ అంటారు. అయితే మన తెలుగువారు చాంద్రమానాన్ని బట్టి మృగశిర నక్షత్రం ఏ పున్నమి రోజున ఉంటే దాన్ని ‘మార్గశిర మాసం’గా పిలుస్తారు. అలాగే పుష్యమి నక్షత్రం ఉన్న పున్నమి మాసాన్ని ‘పుష్యమాసం’ అంటారు. ఈ విధంగా ఖగోళ సంబంధమైన చంద్రయాన, సౌరయాన మాసాలకు సంబంధించిన విషయాలే కనుక ప్రకృతిలోని జీవుల కార్యకలాపాలపై ప్రత్యేక ప్రాధాన్యం, వైశిష్టతలున్నాయి.
*అభివృద్ధి, అభ్యుదయానికి యుక్తమైన కాలం మార్గశిరం. సస్యశ్యామలమై ఫలపుష్పభరితమైన ప్రకృతివలె… గోపికల మనఃక్షేత్రం కూడా శ్రీకృష్ణుడి ప్రేమతో సస్యశ్యామలమైన శ్రీ కృష్ణసమాగమాన్ని, మధుర ఫలరసాస్వాదనకు ఉద్యుక్తుల్ని చేసి, తరింపచేసిన తమోరహితమైన బంగారు కాలం మార్గశిరం. మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు పుణ్యకాలాలున్నాయి. దేవతలకు ఉత్తరాయణ పుణ్యకాలం పగలుగాను, దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణింపబడ తాయి. ఇందులో మార్గశిర మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషఃకాలమని చెబుతారు. అంటే బ్రహ్మముహూర్తమన్నమాట. కాబట్టే మార్గశిర మాసం ఇంత ఆధిక్యతను సంతరించుకుంది.
***పూమాలే పూబాల…
భూలోకంలో ఉన్న 108 విష్ణు క్షేత్రాలలో ‘శ్రీ విల్లిపుత్తూరు’ ఒకటి. అక్కడ విష్ణు చిత్తుడనే విష్ణు భక్తుడు ఉండేవాడు.నలనామ సంవత్సరం కర్కాటక మాసంలో (చారిత్రకుల అంచనా క్రీ.శ. 776) విష్ణుచిత్తుల వారికి తులసి వనంలో అమితమైన తేజస్సుతో ఉన్న బాలిక లభించింది. ఆ శిశువును విష్ణుచిత్తుడు అల్లారుముద్దుగా పెంచసాగాడు. ఆ శిశువుకు ‘కోదై’ (పూమాల) అనే పేరు పెట్టాడు. ఆ నామమే క్రమంగా ‘గోదా’గా మారింది. గోదా బాల్యం నుంచి సహజ పరిమళంతో తులసి వలె జ్ఞానభక్తివైరాగ్యాలు కలిగి భగవద్గుణములందు ఆసక్తురాలై ఉండేది. ఆమె తన తండ్రి ద్వారా శ్రీరంగనాథుడి రూపరేఖావిలాసాలను వింటూ ఆ స్వామినే తన ప్రాణనాథుడిగా పొందవలెనని నిర్ణయించుకుంది.
*ఆ స్వామికే తనను అంకితం చేసుకుంది గోదాదేవి. విష్ణుచిత్తుడు వట పత్రశాయికి సమర్పించే పుష్పమాలికల్ని తాను ధరించాలనే కోరిక మనస్సులో కలిగి, తన తండ్రి తయారుచేసిన ఆ పుష్పమాలికల్ని ఆయనకు తెలియకుండా ప్రతిరోజూ మెడలో అలంకరించుకునేది. తన ప్రతిబింబాన్ని నూతిలో చూసుకొని ఆనందించేది. యథాప్రకారంగా ఒకనాడు విష్ణుచిత్తుడు పుష్పమాలలను అర్చక స్వాములకు ఇచ్చాడు. వారు ఆ మాలలను తీసుకొని చూడగా అందులో ఒక తల వెంట్రుకను గమనించి విష్ణుచిత్తుడిని మందలించారు. ఒకరోజు గోదాదేవి పుష్పమాలలను తన మెడలో వేసుకోవడం చూసిన విష్ణుచిత్తుడు ఆమెను మందలించాడు. ఆ రోజు మాలలను ఆయన అక్కడే పడేసి వెళ్లారట. ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుడికి, ఆలయ స్వామికి శ్రీరంగనాథుడు స్వప్నంలో కనిపించి ఇలా చెప్పారట… ‘‘గోదాదే వి ముందుగా ధరించిన మాలలను మాత్రమే నేను ప్రేమతో స్వీకరిస్తాను. ఆ దండలే నాకు సమర్పించండి’’. ఆనాటి నుంచి ఆండాళ్‌ తల్లికి ‘‘చూడి కొడుత్త నాశ్చియార్‌’ అని ‘ఆముక్తమాల్యద’ అని పేరు వచ్చింది.
*వేదాల సారమే తిరుప్పావై…
తిరుప్పావై… ‘తిరు’ అనగా ‘శ్రీ’ అని, ‘పావై’ అనగా ‘గీతం’ అని అర్థం. దీనికి ‘సంపత్కరమైన ఛందస్సు’ అని మరో అర్థం ఉంది. ఛందోబద్ధమైన ఈ కావ్యంతో ధనుర్మాసం నెలరోజులు శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తే కోరికలు తప్పక నెరవేరతాయని ఆండాళ్‌ ప్రబోధించింది. తిరుప్పావైని ‘శ్రీవతం’ అని, ‘దివ్యవ్రతం’ అని పిలవడం శ్రీవైష్ణవుల్లో పరిపాటి. ఆండాళ్‌ తల్లి మూడు దశల ద్వారా శ్రీవ్రతాన్ని ఆచరించింది. వాటిల్లో మొదటిది అభిముఖ్యదశ- మొదటి పాశురం నుంచి అయిదో పాశురం వరకు వ్రతవిధానం. వ్రతానికి ఆచరించవలసిన నియమాలు, కర్మసిద్ధాంతం, నామ సంకీర్తనంతో జ్ఞాన మార్గం చూపింది. రెండోది ఆశ్రయణ దశ- ఆరో పాశురం నుంచి 15వ పాశురం వరకు భగవదనుభావంలో మునిగి తేలుతున్న పదిమంది అళ్వారులను మేల్కొలుపుతుంది.
*మూడోది అనుభవ దశ- పదహారో పాశురం నుంచి ముప్పది పాశురం వరకు ఆచార్యుడైన నందగోపుణ్ణి, యశోధను, బలరాముణ్ణి, కాపలావారిని, నీళాదేవిని, శ్రీకృష్ణపరమాత్మను మేల్కొలిపింది. ఈ దశలో జీవాత్మ పరమాత్మను పొందే లక్ష్యం వైపు నడవాలని ప్రబోధించింది. శ్రీ వ్రతాన్ని ఆచరించడానికి జాతి, కులమత భేదాలు లేవని చెప్పింది. ఆశువుగా శ్రీకృష్ణ భక్తి తత్త్వాన్ని రోజుకొక పాశురాన్ని పరమాత్మకు సమర్పించింది. ఈ ధనుర్మాసం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది- రాపత్తు అంటే రాత్రివేళ ఆచరించే వ్రతం. మొదటి పాశురం నుంచి పదిహేనో పాశురం వరకు తెల్లవారుజామునే పూజలు, పారాయణాలు, నివేదనలు పూర్తిచేస్తారురెండోది పాపత్తు. అంటే పగటివేళ ఆచరించే వ్రతం. సూర్యోదయం తరువాతనే పూజలు, పారాయణాలు, నివేదనలు పూర్తిచేస్తారు. పదహారో పాశురం నుంచి ముప్పది పాశురం వరకు పగటి పూటే వ్రతాన్ని ఆచరిస్తారు.