దేశవ్యాప్తంగా శక్తిపీఠాలు

1. శక్తిపీఠాలు తెలుసుకుందామా!-ఉజ్జయినీ మహంకాళీ-తదితర ఆద్యత్మిక వార్తలు
అష్టాదశ శక్తిపీఠాల్లోని తొమ్మిదో శక్తిపీఠం ఉజ్జయినీ మహంకాళి. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లో ఉంది. హరసిద్ధిమాత, అన్నపూర్ణాదేవితో కలిసి అమ్మవారిని సేవించే చోటు ఇదే. సప్తమోక్ష పురాలలో ఇదొకటి. అమ్మవారు మహాకాళి కాగా, అయ్యవారు మహాకాళేశ్వరుడు, జ్యోతిర్లింగమూర్తి. సతీదేవి పై పెదవి ఇక్కడ పడినట్లు చెబుతారు. ఎక్కడైతే మహాకాళి ప్రకాశిస్తుందో ఆ పురమే అవంతిక (రక్షించేది), ఉజ్జయిని (జయించేది), అదే (యజ్ఞాలకు యోగ్యమైన) కుశస్థలి. ఇవన్నీ ఉజ్జయినీ నగరానికి మారుపేర్లు. ఈ క్షేత్రాన్ని భూమికి నాభిస్థానం అని అంటారు. మహాకవి కాళిదాసుకు బీజాక్షరాలను ప్రసాదించిన శక్తి ఈ కాళీమాతే. నగరానికి కొద్ది దూరంలో క్షిప్ర/సిప్ర, ఖాన, సరస్వతి నదుల సంగమం ఉంది. ఇక్కడ ఇదే త్రివేణి సంగమ స్థలం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగాన్ని ఎవరికి వారే అభిషేకించే అవకాశం ఉంది. ఇక్కడ సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతాయి. అయితే దేవీ నవరాత్రుల్లో జరిగే ఉత్సవాలు మాత్రం భారీస్థాయిలో ఉంటాయి.
శ్లో: త్రిపురాసుర సంహర్తా మహాకాలో త్రవర్తతే
యస్యాట్ట హాస సందగ్థం దుస్సహం తత్ పురత్రయమ్!
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా
ఉజ్జయిన్యం మహాకాళీ భక్తానామిష్టదాసదా !!
******పురూహూతికా దేవి
శ్లో: ఏలర్షి పూజిత శ్శంభుః- తస్మై గంగా మదాత్ పురా
రురావ కుక్కుటో భూత్వా- భగవాన్ కుక్కుటేశ్వరః!!
దేవీ చాత్ర సమాయాతా- భర్తృ చిత్తానుసారిణీ
పురుహూత సమారాద్దా- పీఠాయాం పురుహూతికా!!
అమ్మవారి పిరుదు భాగం పడిన ప్రాంతం పిఠాపురం. ప్రసిద్ధ క్షేత్రాలన్నింటిలో ప్రత్యేకతగల ఆలయం పిఠాపురం పాదగయ క్షేత్రం. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం దశమ శక్తిపీఠం. దసరా సందర్భంగా అమ్మవారికి ఆలయంలో కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల నమ్మకం. మహిళలు ఉపవాసంతో ఈ కుంకుమార్చన చేస్తారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పురూహుతికా అమ్మవారికి తొలిరోజు కలశస్థాపన, ప్రతిరోజు ఉదయం శ్రీచక్ర నవార్చన, ఛండీ సప్తపతి పారాయణ, మధ్యాహ్నం చండీ హోమం, సాయంత్రం లక్ష కుంకుమార్చన జరుగుతాయి. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి భవానీ దీక్ష చేపట్టిన భక్తులు 9 రోజులపాటు ఈ క్షేత్రంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. అలానే శతచండీయాగం, కుంకుమ పూజలు ఇక్కడ ప్రత్యేకతం.
2. సంఖ్యా శాస్త్ర పరంగా 9 అంకె గొప్పదనం ఏంటి?

సంఖ్యా శాస్త్రంలో తొమ్మిది అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య, వృద్ధి సంఖ్య, పురాణ సంఖ్యగా పేర్కొంటారు. ఎంత చిన్న లేదా పెద్ద సంఖ్యనైనా తొమ్మిదితో హెచ్చవేసి, శేషాల మొత్తాన్ని కలిపితే తొమ్మిదే వస్తుంది. అలాగే కృతయుగం (17,28,000), త్రేతాయుగం (12,96,000), ద్వాపరయుగం (8,64,000).. ఈ యుగాల మొత్తం సంవత్సరాలను కలిపినా తొమ్మిదే వస్తుంది. ఇదీ తొమ్మిది అంకెకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. అలాగే హిదువుల ఆరాధ్య గ్రంథమైన మహాభారతం కూడా తొమ్మిది సంఖ్యతో ముడిపడి ఉంది. భారతంలోని పర్వాలు 18, యుద్ధం జరిగిన రోజులు 18, అక్షౌహిణులు 18, భగవద్గీత అధ్యాయాలు 18… వీటిని ఏక సంఖ్యగా మారిస్తే తొమ్మిదే వస్తుంది. అంతేకాదు, తొమ్మిదిని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు. బిడ్డ తల్లి గర్భంలో ఉండేది నవమాసాలు- అంటే 270 రోజులు. దీన్ని ఏక సంఖ్యగా మారిస్తే మళ్లీ తొమ్మిదే వస్తుంది. అలాగే మనిషికి ఉన్న ప్రాణ రంధ్రాలు కూడా తొమ్మిదే. సృష్టిలోని వెన్నెముక ఉన్న ప్రతి ప్రాణికీ నవరంధ్రాలు ఉండటం గమనార్హం.
3. రూ. పదికోట్లతో అమ్మవారికి బంగారుచీర?!
‘జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే’… అంటూ ఆ దుర్గామాతను వేనోళ్ల కొనియాడుతూ అంగరంగవైభవంగా దేశవ్యాప్తంగా చేసుకునే అపురూపమైన వేడుకే దసరా. దుష్టశిక్షణకోసం శిష్టరక్షణకోసం అవతరించిన ఆ అమ్మను, ఒక్కోచోట ఒక్కోరూపంలో పూజిస్తూ ఒక్కోతీరులో పండగ జరుపుకుంటారు. అయితే ఆ దుర్గమ్మ ఆరాధనలోనూ వేడుకల్లోనూ బెంగాలీల ఘనత, ప్రత్యేకతే వేరు. అదెలానో చూద్దాం..!శంఖచక్ర గదాహస్తే శుభవర్ణ సుశోభితే మమ దేవి వరం దేహి సర్వసిద్ధి ప్రదాయిని…
…అంటూ దేశవ్యాప్తంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకూ ఆ జగన్మాతను స్తుతిస్తారు. ఉత్తరాదిన దుర్గాపూజతోబాటు రాముడు రావణాసురుడిని సంహరించిన రోజుగా రామలీలా ఉత్సవాలు జరుపుకుంటే, దక్షిణాదిన దుష్టసంహారం గావించిన ఆ దుర్గమ్మ తల్లిని తొమ్మిది రోజులపాటు విభిన్న రూపాల్లో అర్చిస్తారు. పాండవులు ఆయుధాల్ని దించిన రోజుగా భావించి దశమినాడు ఆయుధపూజ చేస్తారు. అయితే బెంగాల్తోబాటు తూర్పు భారతావనిలో కూడా ఆశ్వయుజ శుక్లపక్ష షష్ఠి నుంచి దశమి వరకూ ఐదురోజులపాటు దుర్గోత్సవ్ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
**అలంకారం… ఆడంబరం!
దుర్గోత్సవ్ సమయంలో కోల్‌కతాలో కొత్తగా అడుగుపెట్టినవాళ్లకి ఎక్కడ ఉన్నామో అర్థంకాని పరిస్థితి. అసలు కోల్‌కతా ఇదేనా అన్న సందేహమూ కలగొచ్చు. ఏ కూడలిలోకెళ్లినా విద్యుద్దీపకాంతులతో మెరిసే కొత్త కట్టడాలు కనిపిస్తాయి. అవే పండాల్స్ ఉరఫ్ దుర్గామాత వేదికలు. పశ్చిమభారతంలోని గణపతి వేడుకల మాదిరిగానే బెంగాలీయులకి శరదోత్సవ్ అతిపెద్ద సామాజిక వేడుక. అందుకోసం భారీ వేదికలు కట్టి అమ్మ విగ్రహాన్ని షష్ఠి రోజున ప్రతిష్ఠిస్తారు. తరవాత లక్ష్మి, సరస్వతి, గణేశ, కార్తికేయల్ని ప్రతిష్ఠిస్తారు. అయితే ఆ వేదిక ఏదో సాదాసీదాగా కాకుండా ఏదో ఒక థీమ్‌తో సెట్టింగుల రూపంలో వేయడం సంప్రదాయంగా మారింది. ఐఫిల్ టవర్, కొలోజియం, మధురమీనాక్షి, సోమనాథ్, అక్షరధామ్, బకింగ్‌హామ్ ప్యాలెస్, లండన్బ్రిడ్జి, థాయ్ వైట్ టెంపుల్… ఇలా దేశవిదేశాల్లోని ఏ ప్రసిద్ధ కట్టడమైనా అక్కడ కనిపించవచ్చు. స్థానికంగా ఒకరిని మించి మరొకరు ఈ పండాల్స్ని రూపొందించి, అమ్మవారిని అలంకరిస్తారు. దాంతో కోల్‌కతా దుర్గోత్సవ్ సంబరం వెయ్యికోట్ల బడ్జెట్‌ను దాటిపోయింది. ఏటికేడూ ఇది పెరుగుతూనే ఉంది.
వందల సంవత్సరాలనుంచీ ఈ దుర్గారాధన ఉన్నప్పటికీ ఈ పండగను ఓ సామాజిక వేడుకలా మాత్రం 16వ శతాబ్దం నుంచీ చేస్తున్నారనీ, ఇందుకోసం రాజులూ సంపన్నులూ భూరివిరాళాలు ఇచ్చేవారనీ చరిత్ర చెబుతోంది. మధ్యయుగంలో ముస్లిం దాడులతో అక్కడ దుర్గాదేవిని యుద్ధదేవతగా అభివర్ణిస్తూ ఆరాధించడం మరింత పెరిగింది. ఈ పండాల్స్‌లో ప్రతిష్ఠించిన ఆ లోకమాతను పూజించేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తుంటారు. ప్రాచుర్యం పొందిన కొన్ని పండాల్స్ దగ్గరకయితే లక్షల్లో భక్తులు రావడం విశేషం. ఆ ఐదు రోజులూ బెంగాలీలు రాత్రివేళలో నిద్రపోరు. తెల్లవార్లూ పూజలతోనూ సంగీతసాంస్కృతిక అందాలపోటీలతోనూ ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా అష్టమి, నవమి రాత్రుల్లో కోల్‌కతా వీధులన్నీ జనసంద్రంలా గోచరిస్తాయి.అయితే ఈ మొత్తం వేడుకలో స్టేజీ అలంకరణ ఓ ఎత్తయితే, విగ్రహం తయారీ మరోయెత్తు. గతేడాది శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ఏకంగా 10 కోట్ల రూపాయలతో బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని పోలిన సెట్ వేసి రికార్డు సృష్టించింది. అదే క్లబ్ ఈ ఏడాది సంజయ్‌లీలా భన్సాలీ పద్మావత్ సినిమాలోని ఛిత్తోడ్ ప్యాలెస్ సెట్‌తో భక్తుల్ని అలరించనుంది. అలాగే 83 ఏళ్ల నుంచీ దుర్గాపూజ నిర్వహిస్తోన్న సంతోష్మిత్రా స్క్వేర్ కమిటీ గతేడాది రూ.10 కోట్ల విలువ చేసే 30 కిలోల బంగారంతో అమ్మవారికి చీర తయారు చేయించింది. అయితే తయారీలో భాగంగా నెమళ్లూ పువ్వులూ డిజైన్ల చెక్కుడులో తరుగుపోగా చివరకు మిగిలింది తొమ్మిది కిలోలేనట. పైగా దీనికోసం ముప్ఫైమంది స్వర్ణకళాకారులు మూడునెలలపాటు శ్రమించినట్లు ఈ చీర తయారీని చేపట్టిన సెన్కో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏకంగా 40 కోట్ల రూపాయల ఖరీదు చేసే పది టన్నుల వెండితో 60 అడుగుల ఎత్తులో రథం సెట్ వేసి ఆకర్షించనున్నారట. ఈ రథాన్ని తరవాత ఒడిశా రథయాత్రలో వాడతారట. అయితే విగ్రహాల అలంకరణలో వాడే బంగారంతోబాటు వెండి పండాల్ రక్షణకోసం అంతేస్థాయిలో భద్రతా ఏర్పాట్లూ చేయనున్నారట. ఈ రెండే కాదు, నగరంలోని ఎక్దాలియా, ఎవర్గ్రీన్, బాగ్‌బజార్, కుమర్తులి పార్క్, కాలేజ్ స్క్వేర్, సురుచి సంఘ, జోథ్‌పూర్ పార్కు… ఇలా పలు ప్రాంతాలు భారీ సెట్టింగులతో కళకళలాడుతుంటాయి.
**దుర్గోత్సవ్..!
పితృపక్షం చివరిరోజైన మహాలయ అమావాస్యనాడు మట్టితో చేసిన విగ్రహానికి కళ్లను దిద్దడం ద్వారా బెంగాలీల దుర్గారాధన మొదలవుతుంది. నిజానికి కుంభకారులు రథోత్సవం రోజునే విగ్రహం తయారీని ప్రారంభిస్తారు. కానీ అమావాస్యనాడే అమ్మవారు మట్టిలో ప్రవేశిస్తుందన్న కారణంతో- మొత్తం తయారైన విగ్రహానికి కళ్లను మాత్రం ఆ రోజునే తీర్చిదిద్దుతారు. దీన్నే చోకు దాన్ అంటారు. విగ్రహాన్ని ఇంట్లోగానీ వేదికమీద గానీ షష్ఠి రోజునే ప్రతిష్ఠించాక, పూజారి కళ్లకు కాటుక దిద్ది, దేవి చేతుల్లో ఆయుధాల్ని అమర్చడంతో పూజ మొదలవుతుంది.మిగిలిన చోట్లకు భిన్నంగా ఆరో రోజునే పూజ ప్రారంభించడం వెనక పౌరాణిక గాథలనేకం ప్రాచుర్యంలో ఉన్నాయక్కడ. రావణ సంహరణార్థం రాముడు శుక్ల పక్ష షష్ఠిరోజునే అమ్మను అర్చించాడనీ, ఏటా తన సంతానమైన సరస్వతి, లక్ష్మి, గణేశుడు, కార్తికేయలతో పార్వతీదేవి ఆ రోజునే పుట్టింటికి వచ్చి విజయదశమి రోజున భర్త దగ్గరకు వెళ్లిపోతుందనీ విశ్వసిస్తారు బెంగాలీలు. అందుకే అమ్మవారితోబాటు లక్ష్మి, సరస్వతి, గణేశుడు, కార్తికేయులతోపాటు రాక్షస రూపాలను ప్రతిష్ఠించి, దశమినాడు నిమజ్జనం చేయడం ద్వారా అమ్మను కైలాసానికి సాగనంపుతారు.
**పూజా విధానం!
షష్ఠి నుంచి వరసగా మూడురోజులూ శ్లోకాలూ స్తుతులూ ప్రార్థనలూ వేద, తాంత్రిక మంత్రాలతో అమ్మను కొలుస్తారు. సప్తమినాడు కుమారిపూజ. ఆ రోజున ఇంట్లోగానీ వేదికమీదగానీ 5-8 ఏళ్ల లోపు పిల్లల్ని పూజిస్తారు. అష్టమి వెళ్లి నవమి వచ్చే సమయంలో అటు 24 ఇటు 24 మొత్తం 48 నిమిషాలపాటు సంధిపూజ చేస్తారు. ఆ సమయంలో దుర్గాదేవి మూడోకంటినుంచి ఉద్భవించిన చాముండీ దేవి చండ, ముండ అనే రాక్షసుల్ని సంహరించినట్లుగా భావిస్తూ ఆ క్రతువును నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మేక లేదా గుమ్మడికాయను బలి ఇచ్చి, ఆ దుర్గమ్మతల్లి మీద చిందిన రుధిరం గుర్తుగా సింధూర పూజ చేస్తారు. తరవాత అమ్మవారికి ప్రసాదం పెట్టి, అందరూ పంచుకుంటారు. నవమిరోజున దేవీమాత విజయానికి గుర్తుగా హోమం చేస్తారు. దశమిరోజున స్త్రీలంతా ఒకరికొకరు సింధూరం పూసుకుంటూ ఆనందంగా నృత్యాలు చేస్తూ విగ్రహాలను ఊరేగిస్తూ, వెళ్లిరమ్మని పాటలు పాడుతూ కన్నీటితో వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేసి వస్తారు. తరవాత స్నేహితులూ చుట్టపక్కాలంతా బహుమతులూ మిఠాయిలు పంచుకుంటూ వేడుకను ముగిస్తారు.
4. లోక శుభంకరి నమో నమో
భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనను విశిష్టమైందిగా చెబుతారు. ఆ శక్తి ఆరాధన కోసం జరిపే అతిపెద్ద ఉత్సవమే విజయదశమి. నమ్మి కొలిచినవారికి కొంగుబంగారమై విరాజిల్లుతున్న దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అర్చించి ఆ జగన్మాత కృపాకటాక్షాలను పొందడానికీ, దసరా సందడిని ముంగిళ్లలోకి తీసుకురావడానికీ ఊరూవాడా ముస్తాబైపోతోంది.
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ కృతాబ్ధి యిచ్చుత మహాత్వ కవిత్వ పటుత్వ సంపదల్ …లక్ష్మిగా సంపదనూ, పార్వతిగా శక్తినీ, సరస్వతిగా జ్ఞానాన్నీ మనకందించే మూలపుటమ్మ దుర్గమ్మ. అందుకే పోతనామాత్యుడు సైతం పై పద్యంలో దుర్గమాయమ్మ, చాలా పెద్దమ్మ అంటూ పరమభక్తితో స్తుతించాడు. నమ్మి కొలిచిన వారికి ఆ తల్లి దయాసముద్ర. లోకకంటకులకు ఆమె ఓ ప్రళయరూపిణి. దుష్టసంహారానికి దుర్గాదేవి ధరించిన తొమ్మిది అవతారాలను తొమ్మిది రోజులపాటు పూజించడమే దసరానవరాత్రి విశిష్టత. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉన్న తొమ్మిది రోజులూ దేవీ నవరాత్రులు. పదోరోజు విజయ దశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండగ. దేవీ నవరాత్రులనే శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కాబట్టి దీనికా పేరువచ్చింది. కొందరు ఈ నవరాత్రుల్లో మొదటి మూడు రోజులూ పార్వతీదేవికీ, తర్వాతి మూడురోజులూ లక్ష్మీ దేవికీ, చివరి మూడురోజులూ సరస్వతి దేవికీ పూజలు చేస్తారు. సామాన్యులే కాదు యోగులు కూడా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువులు పెట్టే ఆనవాయితీ కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారాన్నీ, ఒక్కో రకమైన నివేదననూ సమర్పిస్తారు.
**నవ దుర్గలు…
ప్రథమా శైలపుత్రీ ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకీ
పంచమా స్కందమాతేతి షష్ఠ్యా కాత్యాయనీతచ
సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతిచాష్టమీ
నవమా సిద్ధిదాత్రీతి నవదుర్గాః ప్రతీర్తతాః
…మార్కండేయ పురాణం ప్రకారం దుర్గాదేవి తొమ్మిది రూపాలను ధరించింది. ఆ రూపాలకే నవదుర్గలు అని పేరు. పై పద్యాన్ని అనుసరించి ఆ రూపాలు వరుసగా…
శైలపుత్రి: పర్వతరాజు హిమవంతుడి కుమార్తె. వాహనం వృషభం. కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేత కమలం ధరించిన శైలపుత్రి నవదుర్గల్లో తొలిఅవతారం.
బ్రహ్మచారిణి: పరమశివుడిని భర్తగా పొందేందుకు వేల సంవత్సరాలు తపస్సు చేసిన దాక్షాయణి ‘బ్రహ్మచారిణి’. అందుకు గుర్తుగా జపమాల, కమండలంతో కనిపిస్తుందీ అమ్మవారు.
చంద్రఘంట: శిరసున చంద్రుణ్ణి దాల్చిన చల్లని తల్లి చంద్రఘంట. పులి వాహనం మీద దర్శనమిచ్చే ఈ తల్లిని పూజిస్తే భూతప్రేత పిశాచాది భయాలు పోతాయని ప్రతీతి.
కూష్మాండ: తన చిరుదరహాసంతో బ్రహ్మాండాన్ని సృజించిన అమ్మ. కూష్మాండ బలి (గుమ్మడికాయ) అంటే ప్రీతి కాబట్టి ఆ పేరుతోనే ప్రసిద్ధి పొందిందంటారు. కూష్మాండ కూడా పులి వాహనంమీదే కనిపించడం విశేషం.
స్కందమాత: స్కందుడిగా పేరొందిన కుమారస్వామి తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. సింహవాహనారూఢ అయిన ఈ తల్లి ఒడిలో షణ్ముఖుడిని దర్శించవచ్చు.
కాత్యాయని: పార్వతీదేవి తన కుమార్తెగా జన్మించాలంటూ తపస్సుచేసిన కాత్యాయన మహర్షికి జన్మించిన శక్తి స్వరూపిణి. కాత్యాయనీదేవి వాహనం సింహం.
కాళరాత్రి: నవదుర్గల్లో ఏడో దుర్గ. గాడిదను వాహనంగా కలిగిన కాళరాత్రి మిక్కిలి భయంకర రూపిణి. కానీ, ఆ తల్లి శుభాలను ప్రసాదించే శుభంకరి అని భక్తుల నమ్మిక.
మహాగౌరి: శివుడి అర్ధాంగి కావడం కోసం ఘోరతపమాచరించిన సాత్విక శక్తిరూపిణి. వాహనం ఎద్దు. అభయవరద ముద్రలతో కరుణా కటాక్షాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తుల విశ్వాసం.
సిద్ధిదాత్రి: శివుడికి సర్వసిద్ధులనూ ప్రసాదించిన దేవత సిద్ధిదాత్రి అని దేవీపురాణం చెప్తోంది. కమలాసనంమీద కూర్చున్న ఈ దేవి దర్శనంతో కోరికలు నెరవేరుతాయంటారు. వీటితోపాటు దుర్గాదేవి, బాలాత్రిపుర సుందరి, గాయత్రి, సరస్వతి, వనదుర్గ, అన్నపూర్ణ… ఇలా ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా దుర్గమ్మ పూజలందుకుంటుంది. పూజించే విధానం మారినా, అమ్మవారి అలంకారాల్లో భేదాలున్నా విషయమొక్కటే… చెడుపై మంచి విజయం సాధించేలా చేసిన ఆ శక్తిస్వరూపిణిని శరణువేడటమే.
5. కృష్ణాలంకృతుడై.. తృష్ణ ప్రదాయుడై
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం రాత్రి మలయప్పస్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. అశేష భక్తజనం మధ్య దేవదేవుడు నవనీత కృష్ణుడి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులతో కూడి సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించిన స్వామివారిని సేవించడం ద్వారా భక్తుల్లో అహంకారం తొలగి శాశ్వత ముక్తి లభిస్తుందని పురాణ ప్రశస్తి. ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంలో శ్రీరాజమన్నార్ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
6. దుర్గమ్మకు రూ.8లక్షల ఆభరణాలు బహూకరణ
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఏడు వారాల నగల్లో మంగళవారం అలంకరించే ఆభరణాలను ప్రవాసాంధ్రుడు గుత్తికొండ శ్రీనివాస్ బహూకరించారు. రూ.8 లక్షల విలువైన బంగారు హారం, వజ్రాలు పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులాకీలను దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మకు.. మంత్రి కొల్లు రవీంద్ర, పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబుల సమక్షంలో శనివారం అందజేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన శ్రీనివాస్ తెదేపా నాయకుడు గొట్టిపాటి రామకృష్ణతో కలిసి అన్నదానానికి విరాళం ఇచ్చేందుకు ఇటీవల గుడికి వచ్చారు. ఈవో కోటేశ్వరమ్మ ఏడు వారాల నగల గురించి వారికి తెలియజేయగా.. మంగళవారం అలంకరించే ఆభరణాలు ఇచ్చేందుకు అంగీకరించి శనివారం అందజేశారు.
7. ఆటపాటల దసరా
దసరా అంటేనే సరదాలకు లేపిన పరదా. ఆటపాటల వరద. ఊరూరా పందిళ్లూ సందళ్లూ .. అనేకనేక సాంస్కృతిక సంరంభాలూ సంబరాలూ. ఈ పండగ వెనక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పోల్చి చూస్తే ఒకదానికొకటి పొంతన ఉండదు. ఆలోచిస్తే సంబంధం కుదరదు. ఎవరి కథలు వారికి కారణాలుగా ఉండడమే భిన్నత్వం. ఆ కథాకథనాలు ఉన్నా- దేశవ్యాప్తంగా కోట్లాదిమంది పండగ సందడిలో మునిగి తేలడమే ఏకత్వం. అందుకే ఇది భిన్నత్వంలో ఏకత్వంలా అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. పిల్లలూ పెద్దలూ మహిళలూ.. ఆటలపాటలతో, సాంస్కృతిక సందళ్లతో సంతోషంగా గడిపే పండగ. వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో జరుపుకునే దసరా.. ఒక సాంస్క ృతిక ప్రాభవానికి చిరునామా.
ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజులూ దేవీ నవరాత్రులని, పదో రోజు విజయ దశమి అని అంటారు. ఈ రెండూ కలిసి దసరా. దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఆటలకు, పాటలకు ఆలవాలం. దేశమంతటా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిలో ఈ పండగ జరుగుతుంది. శరదృతువు ఆరంభంలో వచ్చే సందళ్లు కనుక వీటిని శరన్నవరాత్రులు అని కూడా అంటారు. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులూ… అమావాస్య నుంచి నవమి వరకూ బతుకమ్మ ఆడతారు.
**దసరా పండగకు గల కారణాలుగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కాలక్రమంలో ఏ పండగకు అయినా కారణాలతో సంబంధం ఉండదు. జనం దృష్టిలో కేవలం సందడీ సరదాలే ఉంటాయి.రావణుడిపై రాముడు విషయం సాధించిన రోజు అని ఒక కథ. పాండవులు అజ్ఞాతవాసం ముగించి జమ్మిచెట్టు మీద నుంచి ఆయుధాలు తీసుకున్న రోజు అని మరొక కథ. మహిషాసురుడిని దుర్గాదేవి వధించిన రోజు అని ఇంకొక కథ. విశ్లేషించి చూస్తే ఈ కథల మధ్య సామీప్యత కానీ, సమంజసత్వం కానీ కనిపించవు. పురాణాల ప్రకారం చూసినా- రామాయణ, భారతకథల మధ్య కొన్ని వేల సంవత్సరాల అంతరం ఉంది. ఎక్కువగా దుర్గాదేవి పండగగా, స్త్రీ శక్తి ప్రతీకగా చూస్తారు. మరి అసలు కారణం ఏమై ఉంటుంది అంటే – ఎవరి కథ వారికి ఉంటుంది. నిజానికి సామాన్య జనానికి ఈ కథలతో సంబంధం లేకుండా – ఈ సందర్భాన్ని ఓ సందడిగా, సరదాగా భావిస్తారు. ఉన్నంతలో దసరాను ఆనందంగా గడిపేస్తారు.
మనది భిన్నత్వం గల దేశం. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సమూహాల్లో వేర్వేరు సంస్కృతీ సాంప్రదాయాలు ఉంటాయి. అవి దేశ వైవిధ్యానికీ, భిన్నత్వపు సౌందర్యానికీ చిహ్నాలు. కానీ, రాన్రానూ ఈ సాంస్క ృతిక భిన్నత్వం బలహీనపడుతోంది. అదే సమయంలో బలమైన స్వరంగానూ వినిపిస్తోంది. చాలా పండగల విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య అంతరాలు కనిపిస్తాయి. రామాయణంలోని రావణుడు ఉత్తరాదిలో విలనైతే- తమిళనాడులో నాయకుడు. అక్కడ రావణున్ని నిందిస్తే ఇక్కడ పూజిస్తారు. దీని వెనక కథలో వైరుధ్యాలు, సాంస్క ృతిక కారణాలే కాదు; సామాజిక, చారిత్రిక కారణాలు కూడా ఉన్నాయి. దీపావళి కథల వెనక కూడా ఇలాంటి కారణాలే ప్రచారంలో ఉన్నాయి. ఆర్యులు దేశాన్ని ఆక్రమిస్తూ, ఆధిపత్యంలోకి వస్తూ… అప్పటికే ఇక్కడ నివాసం ఉన్న వారిపై సంధించిన సాంస్కృతిక ఆధిపత్య ఆయుధాలే ఈ కథలన్నీ అని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, ఇంతలోతుగా ఆలోచించకుండానే అత్యధిక ప్రజానీకం ఈ పండగలను ఆనందంగా జరుపుకుంటారు. దసరా రోజుల్లో ఒకప్పుడు వివిధ వేషాలు వేసుకొని గ్రామాల్లో సందడి చేసే కళాకారులు ఉండేవారు. ఇంటింటికీ తిరిగి దానం స్వీకరించేవారు. దసరా సంబరాల్లో ఇప్పటికీ ఈ వేషాలు కనిపిస్తాయి. సినిమాలూ, టీవీలూ లేని రోజుల్లో ఈ వేషధారులే చూసేవారికి కనువిందు. పిల్లలకు ఆనందం.
**వివిధ ప్రాంతాల్లో దసరా
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. మైసూరు దసరా ఉత్సవాలు, కలకత్తా సంబరాలూ దేశంలో చాలా ప్రసిద్ధి. మైసూరులో 400 ఏళ్ల నుంచి దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. అప్పటి మహారాజు ఆధ్వర్యంలో చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగించేవారు. అదే ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. మైసూరు వీధుల్లో కోలాహలంగా చేసే కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. రాజభవనాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రదర్శనలో ముందు భాగాన ఏనుగులు పాల్గొనటం ప్రత్యేకత. ఆ ఏనుగుల అలంకరణ కూడా నేత్రపర్వమే! ఆయుధపూజ వైభవంగా నిర్వహిస్తారు.
బెంగాల్లో దుర్గాపూజ సందర్భంగా వీధులు ధగద్ధయామానంగా వెలుగొందుతాయి. సప్తమి, అష్టమి, నవమి తిధుల్లో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదో రోజున కాళికామాతను దర్శిస్తారు. లక్షలమంది పాల్గొంటారు. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాత విగ్రహాలను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాల పందిళ్లలో పుస్తకాల ప్రదర్శనలు నిర్వహించే ఆనవాయితీ బెంగాల్లో ఉంది. సామరస్యపూర్వకంగా సందడిని ఆస్వాదించే సాంస్కృతిక వాతావరణం అక్కడ ఉంది. అయితే, ఇటీవలి కాలంలో మత సంబంధ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యానిచ్చే ఒరవడి అక్కడ కూడా ప్రారంభమైంది. ఒడిశాలో దసరా సమయంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన విగ్రహాలను వీధుల్లో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి పూజలు నిర్వహిస్తారు. దీనిని వారు మానబాన అంటారు. దసరా రోజున బాణసంచా కాలుస్తారు.
**తెలంగాణాలో బతుకమ్మ
తెలంగాణా ప్రజలు దసరా సమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. ఇది ఆ రాష్ట్రం అధికారిక పండగ. ఈ పండగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు స్త్రీలంతా ఒకచోట చేరి ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఆడపడుచులంతా ప్రతి సాయంత్రం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతారు. బతుకమ్మ చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుక పూలను, ఇంకా రకరకాల పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఇంటిల్లిపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. గునగ పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెంలో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పేర్చుతారు. ఆపై తంగేడు పూలతో కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఇలా చాలాసేపు ఆడాక దగ్గర్లో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఉత్తరాంధ్రలో గౌరమ్మ పేరిట ఈతరహా సంబరాలే జరుగుతాయి. కరీంనగర్లో గని కార్మికులు ఈ పండుగను గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా జరుపుకుంటారు. ఆయుధ విన్యాసాలను ప్రదర్శిస్తారు. అక్కడి నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండగ మొదలవుతుంది. ఇనుప బెల్టు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతారు. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
**గుజరాత్లో …
దసరా సమయంలో ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం. పొలం నుంచి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి.. దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి.. ఆపైన మట్టి కుండ పెడతారు. దానిని నీటితో నింపి.. పోకచెక్క, వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండనే దేవిగా భావిస్తారు. దానినే కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున పూజ నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటారు. దాండియా పాటలూ, ఆటలతో గొప్ప సందడిని, ఉత్సాహాన్నీ సృష్టిస్తారు.
**విజయవాడలో భేతాళ నృత్యం
మనకు దసరా అనగానే విజయవాడనే గుర్తొస్తుంది. ఇక్కడ తొమ్మిది రోజులూ వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి రోజున కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుపుతారు. తర్వాత అమ్మవారిని పాత నగరంలో ఊరేగిస్తారు. ఊరేగింపు వన్ టౌన్ పోలీసు స్టేషను వద్దకు రావడంలో ఉత్సవం ముగుస్తుంది. చివరిరోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ సందర్భంగా ప్రదర్శించే భేతాళ నృత్యం విజయవాడ ప్రత్యేకత.
**వీరవాసరంలో ఏనుగు సంబరం
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో సుమారు వందేళ్ల నుంచి దసరా సమయంలో ఏనుగు సంబరాలు జరపడం ఆనవాయితీ. నవరాత్రుల తొలిరోజున ఏనుగు గుడిలో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ సంబరానికి వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితంపూలు, తగరంతో అలంకరణలు చేస్తారు. కొత్తగా చిన్న ఏనుగును తయారు చేసి .. దానినీ అలంకరిస్తారు. చివరిరోజున ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుంచి దాటిస్తారు. సంబరాన్ని సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారు ఆరు గంటలవరకూ జరుపుతారు.
**విజయనగరంలో సిరిమాను
విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. దసరా వెళ్ళిన తరువాత వచ్చే మొదటి మంగళవారం జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు.ఈ సిరిమాను సంబరం చూడటానికి ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమందీ వస్తారు.
**రాళ్ళయుద్ధం.. కర్రల కొట్లాట
కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరా సమయంలో రాళ్ళయుద్ధం చేసుకుంటారు. దసరా రోజు సాయంత్రం ప్రజలు కాలువ ఒడ్డున కంకర రాళ్ళను గుట్టలుగా పోసుకుంటారు. ఒకవైపు రామసేన, ఒకవైపు రావణ సేనగా ఏర్పడి ఒక గుంపుపై మరొక గుంపువారు రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత బాగా ఉత్సవం జరిగినట్టుగా వారు ఉత్సాహపడతారు. ఇదే జిల్లాలోని దేవరగట్టులో కూడా బన్ని ఉత్సవం జరుగుతుంది. మాల మల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు… పోటీ పడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ గ్రూపు, తమ గ్రామంలోనే ఉండేలా ఇంకో గ్రూపూ వెదురుకర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు.
**బందరు శక్తి పటాలు
కృష్ణా జిల్లా బందరులో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. వందేళ్ల క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఓ సైనికుడు కలకత్తా నుంచి తెచ్చి మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేశాడు. అప్పటినుంచి దసరా సమయంలో ఈ ఆలయం నుంచి శక్తి పటాన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు. పటాన్ని వీపుకు కట్టుకుని ముఖానికి అమ్మవారి ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధుల్లో తిరుగుతారు. తొమ్మిది రోజులూ ఇలా అన్ని వీధుల్లోనూ ఇంటింటికీ తిరుగుతారు. పటం ధరించినవారు డప్పుల శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తుంటారు. చివరిరోజు కోనేరు సెంటరుకు తీసుకొచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.
**ఒంగోలులో కళారాలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో దసరా ఉత్సవాల్లో భాగంగా కళారాల (ముఖాకృతులు)ను ఊరేగిస్తారు. ఈ కళారాలను చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్ధినికి, నరసింహ స్వామికి కళారాలు ఉన్నాయి. కళారాన్ని బండి మీద ఎక్కించి అటూ ఇటూ పట్టుకోవడానికి అనువుగా కొయ్యలను అమర్చుతారు. డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనుక భాగంలో ఒకరు వీరనృత్యం చేస్తూ… కళారాన్ని ఉగ్రంగా ఊపుతూ ఉంటారు. కళారాన్ని ఊరి మధ్యకు తీసుకొచ్చి… అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.
**బొమ్మల కొలువులు
దసరా సందర్భంగా బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దేవతామూర్తులు, పక్షులు, జంతువులు, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే రకరకాల బొమ్మలను కొలువు తీరుస్తారు. ఈ కొలువులో తప్పకుండా ఓ షావుకారు, ఆవు, దూడ బొమ్మలు పెడతారు. తమిళనాడులో కూడా బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. మధుర మీనాక్షి ఆలయంలో పెట్టే పెద్ద బొమ్మల కొలువు చాలా ప్రసిద్ధి. తమిళనాడులోని కులశేఖర పట్టణంలో జరిగే దసరాకు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లేవారు వివిధ వేషాలను ధరిస్తారు. పులి, కోతి, బిక్షగాడు, రాజు, రాక్షసుడు.. ఇలా రకరకాల వేషాలు ధరిస్తారు. ‘ప్రతి రూపంలోనూ దేవుడు ఉంటాడు.’ అని చెప్పటం దీని ఉద్దేశమట! ఈ ఉత్సవాలకు వందేళ్ల చరిత్ర ఉంది. వేడుకలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు.పండగలు ఏవన్నా సందళ్లను ఆవిష్కరిస్తాయి. సంతోషాలను పురిగొల్పుతాయి. దసరా కూడా అంతే! ఒక జన సమూహపు సమిష్టి సమ్మేళనానికి, సమైక్య సందళ్లకూ ఇదొక సందర్భం. ఎవరి కథలు వారికి ఉంటాయి. ఆ భిన్నత్వాన్ని గుర్తించాలి. ప్రసార మాధ్యమాలు పెరిగిన క్రమంలో అన్నిచోట్లకూ ఆధిపత్యంలోని ఆటపాటలు ప్రవేశిస్తున్నాయి. ఒకేరకపు సంస్క ృతి చొచ్చుకొస్తుంది. సంస్క ృతి కూడా గ్లోబళీకరణ, గ్లామరీకరణ, మార్కెట్టీకరణ చెందుతోంది. ఏది పాపులర్‌గా కనిపిస్తే అది .. ఏది ఆకర్షణీయంగా అనిపిస్తే అది .. మూలవిరాట్టులై కూచుంటున్నాయి. పండగలన్నా, వాటిలో ఇమిడి ఉన్న సంస్క తి అయినా- జనపక్షంగా ఉండాలి. జనానికి చెందినదై ఉండాలి. అప్పుడే పండగలకు సహజత్వపు సొగసు. సందళ్లకు మానవత్వపు మెరుపు!
8. మహాసరస్వతి అలంకారంలో దుర్గమ్మ
దసరా ఉత్సవాల్లో కీలకమైన మూల నక్షత్రం వేళ ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. కనకదుర్గ అమ్మవారు మహాసరస్వతిదేవి అలంకారంలో దర్శనమిస్తుండటంతో ఇంద్రకీలాద్రి భక్తజనంతో నిండిపోయింది. అర్థరాత్రి 1 గంట నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
*భక్తులకు ఇబ్బందులు
బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. క్యూలైన్లకు రెండు కిలోమీటర్ల అవతలే వాహనాలు నిలిపివేసి కాలినడకన పంపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూం, పండిట్ నెహ్రు బస్టాండ్, భవానీపురం వద్ద వాహనాలు నిలిపివేయాల్సి రావడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. క్యూలైన్లు చేరుకునేందుకే రెండు కిలోమీటర్ల మేర నడవాల్సి రావటం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు చెప్పుల స్టాండ్లు, లగేజి కౌంటర్లు ఎక్కడున్నాయో చెప్పేవారు లేరు. కనీసం సమాచార బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే పోలీసు అధికారులు మాత్రం భారీ స్థాయిలో తరలివచ్చిన భక్తులను నియంత్రించే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
9.శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు
కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం స్కందమాత అవతరాంలో భ్రమరాంబదేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కాగా… సాయంత్రం శేషవాహనంపై భ్రమరాంబసమేత మల్లికార్జునస్వామి విహారించనున్నారు. దసరా మహోత్సవాలను పురష్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ఆయా ఏర్పాట్లు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com