ఉద్యోగం కోసం జన్మభూమిని వదిలి వేలాది మైళ్లు దాటి అమెరికాకు వెళ్లి స్థిరపడి కష్టపడి సంపాదించిన సొమ్మును దానధర్మాలకు వెచ్చించడంలో కాలిఫోర్నియాకు చెందిన డా.లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రవాసాంధ్రులు అందరిలోకెల్లా ముందంజలో ఉన్నారనడంలో సందేహం లేదు. దాదాపు 40ఏళ్ల క్రితం, తన స్వగ్రామం, తాను పుట్టి పెరిగిన కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం వదిలి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లిన డా.లకిరెడ్డి హనిమిరెడ్డి కార్డియాలజిస్టుగా స్థిరపడ్డారు. కష్టపడి బాగా సంపాదించారు. ఇప్పటివరకు ఆయన తాను పుట్టి పెరిగిన వెల్వడం, తాను హైస్కూల్ విద్యనభ్యసించిన మైలవరంతో పాటు, వైద్య విద్యను అభ్యసించిన వరంగల్‌తో పాటు అటు అమెరికాలో తనకు సంపాదించుకునే అవకాశం కల్పించిన మెర్సెద్ నగర అభివృద్ధికి డా.హనిమిరెడ్డి దాదాపు $10మిలియన్ డాలర్లను విరాళంగా అందజేశారు.
* జన్మభూమి ఋణం తీర్చుకుంటూ…
ఆయన జన్మించిన కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామాన్ని గత 20సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అమెరికాను తలదన్నే విధంగా వెల్వడం గ్రామంలో ఇప్పటివరకు దాదాపు ₹10కోట్ల విరాళంతో ఆయన ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సిమెంట్ రాదారులు, పాఠశాలలకు సొంత భవనాలు, డ్రైనేజీలు తదితర నిర్మాణ కార్యక్రమాలకు నిధులు సమకూర్చారు. తాజాగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న టౌన్‌హాల్ తరహాలో గ్రామ సచివాలయం (విలేజ్ చావిడి) భవనాన్ని ఆయన ₹2కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తున్నారు. పూర్తిగా గ్రానైట్‌తో, ఖరీదైన ఫర్నీచర్‌తో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. శాన్‌ఫ్రాన్సిస్కో టౌన్‌హాల్ మాదిరిగానే ఆ గ్రామ చావిడిపై నిర్మించిన గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మైలవరం, వెల్వడం పరిసర ప్రాంత ప్రజలు ఈ కట్టడాన్ని ప్రతినిత్యం తిలకించేందుకు పెద్దసంఖ్యలో విచ్చేస్తున్నారు. త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెల్వడంలో హనిమిరెడ్డి నిర్మించిన భవనం ఆదర్శంగా నిలుస్తోంది. దీనితో పాటు మైలవరంలో హనిమిరెడ్డి హైస్కూల్ విద్యనభ్యసించారు. వరంగల్‌లో వైద్యవిద్యను అభ్యసించారు. తన ఉన్నతికి పాటుపడిన ఈ రెండు ప్రాంతాల్లో ₹10కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనందించారు. ఛత్తీస్‌ఘఢ్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే మైలవరం పొలిమేరల్లో తన సొంత ఖర్చులతో దాదాపు ₹25కోట్ల విలువ చేసే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ఆయన నిర్మించారు. దాదాపు 6 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి తన సొంత ఖర్చుతోనే ప్రభుత్వ సాయం లేకుండా ఈ భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి నిర్వహణ నిమిత్తం అందజేశారు. వైద్య సదుపాయాలను కూడా పేద ప్రజలకు అందజేసే ఏర్పాట్లు చేశారు. – కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
డా.లకిరెడ్డి ఔదార్యం – అమెరికా తరహాలో జన్మభూమి అభివృద్ధి – TNI ప్రత్యేకం
Related tags :