పల్నాడులో బతుకమ్మ ప్రత్యేక విశేషాలు

బతుకమ్మ అనగానే తెలంగాణ పల్లెలు గుర్తుకొస్తాయి. అయితే తెలంగాణ ఆడబిడ్డల వేడుకగా పేరున్న బతుకమ్మ పండుగ ఆంధ్ర ప్రాంతంలోని పలనాటిలోనూ అత్యంత వైభవంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీ. బతుకమ్మను తమ ఇంటిఆడపడుచుగా భావించి, కులమతాలకు అతీతంగా మహిళలు ఆంధ్ర ప్రాంతంలోనూ చేసుకొనే ఈ సంబరం వెనుక కథేమిటంటే…

**ప్రతిరోజూ ఒక పాటగా…
పలనాడులో బతుకమ్మకు చెందిన ఒక కథను ఈ తొమ్మిది రోజులూ పూజల్లో మహిళలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ కథ ఇదీ:ఒక రాజుకు ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు. వారందరికీ వివాహాలు జరిగాయి. కుమార్తెకు వివాహమైనా ఇంకా పుట్టింట్లోనే ఉంది. ఈలోగా రాజు, ఆయన భార్య కాశీయాత్రకు వెళ్ళాలనుకున్నారు. కుమార్తెను ఎక్కడ ఉంచాలనే ప్రశ్న పుట్టింది. ఆరుగురు కోడళ్ళు అంగీకరించలేదు. ఏడవ కోడలు మొదట తన వల్ల కాదని చెప్పినా, చివరికి ఒప్పుకుంది. రాజ దంపతులు కాశీ వెళ్ళారు. ఈలోగా అట్లతద్ది పండుగ వచ్చింది. ఉయ్యాల ఊగడానికి రాజ కుమార్తెను ఆమె స్నేహితులు పిలిచారు. తన దగ్గర చీరలు, రవికలు లేవు కాబట్టి రాలేనని ఆమె చెప్పింది. ‘మీ వదినను అడిగి తెస్తామ’ని వారు హామీ ఇచ్చారు. ఏడవ వదిన దగ్గరకు వెళ్ళారు. ఆమె చీర, రవిక ఇచ్చి, అవి చిరగకుండా తేవాలని జాగ్రత్తలు చెప్పి పంపింది. వారు ఉయ్యాల ఊగుతూండగా, చెట్టు కొమ్మకు చీర తగిలి చిరిగింది. ఇంటికి వెళితే వదిన తిడుతుందని రాకుమార్తె భయపడింది. ఆమెను స్నేహితులు సముదాయించారు. రాకుమార్తెతో పాటు వెళ్ళి, ఆమెను ఏమీ అనవద్దని వదినకు నచ్చజెప్పారు. అప్పటికి సరేనని చెప్పిన వదిన వారు వెళ్ళగానే రాజకుమార్తె మీద విరుచుకుపడింది. ‘‘అన్నట్టుగానే చీరను చింపేశావ్… నిన్నేం చేస్తానో చూడు!’’ అని హెచ్చరించింది. భర్త ఇంటికి వచ్చేసరికి ఆమె జుట్టు విరగబోసుకొని, తలకు కట్టు కట్టుకొని, చీకటి గదిలో పడుకుంది. ఏమయిందని భర్త ప్రశ్నించాడు. ‘‘మీ చెల్లెలు వచ్చిన దగ్గర నుంచీ మన కాపురాన్ని గుల్ల చేస్తోంది. ఇవాళ చీరలు చింపి పెట్టింది. మీ చెల్లెలు రక్తాన్ని నా జుట్టుకు రాస్తే కానీ నా తల నొప్పి తగ్గదు’’ అని చెప్పింది. భార్య మాట కాదనలేక, చెల్లెల్ని చేతులారా ఎలా చంపాలని అతను ఆవేదన పడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లెలిని అడవిలో ఒక చోట ఉంచి, కాకి నెత్తురును ఒక గిన్నెతో తీసుకువెళ్ళి, భార్యకు ఇచ్చాడు. దాన్ని రాసుకొని ఆమె బావి దగ్గరకు వెళ్ళింది. ‘‘కాకి నెత్తురు రాసుకొని వచ్చావ్! ఇదేం నోము, ఇదేం వ్రతం?’’ అని అక్కడ ఉన్న వరుణ కన్యలు ఆమెను చూసి పకపకా నవ్వారు.
***భర్త తిరిగి వచ్చేసరికి, ఆమె మళ్ళీ తల విరగబోసుకొని ఉంది. కాకి నెత్తురు తెచ్చి మోసం చేశావని అతణ్ణి నిందించింది. అతను మళ్ళీ అడవికి వెళ్ళి, గద్ద నెత్తురు తెచ్చాడు. మళ్ళీ వరుణ కన్యలు ఆమెను ఎద్దేవా చేశారు. మరోసారి నక్క నెత్తురు తెచ్చాడు. ఆ సంగతి కూడా వరుణ కన్యల వల్ల అతని భార్యకు తెలిసిపోయింది. భార్య ఒత్తిడితో, ఇక చేసేదేం లేక, చెల్లెలిని ఆమె అత్తవారి ఇంటికి తీసుకువెళ్తానని అతను బయలుదేరాడు. అడవిలో ప్రయాణం చేస్తూ, ఒక బావి దగ్గర వారు విశ్రాంతికి ఆగారు. చెల్లెలు ‘‘ఆకలి’’ అని అడిగింది. తమతో తెచ్చుకున్న మూటలో ఉన్న ఆహారం తిని, బావిలో నీళ్ళు తాగి ఆమె పడుకుంది. నిద్రపోతున్న చెల్లెలి కంఠాన్ని అతను నరికేశాడు. ఆమె మొండెం పోయి, చెట్టు మీద కూర్చుంది. తల ఆకాశంలో నిలిచింది. తల రామ కీర్తన పాడుతోంది, మొండెం భజన చేస్తోంది. ఆమె రక్తం పడిన ప్రాంతమంతా సుగంధభరితమైన తోటగా మారిపోయింది. ఈలోగా చెల్లెలు నెత్తురు తీసుకొచ్చి అతను భార్యకు ఇచ్చాడు. ఆమె దాన్ని రాసుకొని బావి దగ్గరకు వెళ్ళింది. ‘‘ఏమిటమ్మా! ఆడపడుచు రక్తం రాసుకు వచ్చావ’’ని వరుణ కన్యలు అడిగారు. ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది.
**కొన్నాళ్ళ తరువాత కాశీ నుంచి రాజ దంపతులు వచ్చారు. కూతురు ఏదని అడిగారు. ఆమెను అత్తవారింటికి పంపించామని ఏడో కొడుకు, కోడలు చెప్పారు. అదంతా అబద్ధమంటూ ఆ అకృత్యాన్ని ఆకాశవాణి వివరించింది. జరిగిన ఘోరం తెలుసుకొని రాజదంపతులు దిగ్ర్భాంతి చెందారు. తమ వంశాన్ని పాప విముక్తం చెయ్యాలని ప్రార్థించారు. ఆకాశవాణి ఆదేశం మేరకు, ఏడుగురు అన్నలూ కోటలుగా మారి, చెల్లెలిని తమ మధ్య నిలుపుకొని, ‘బతుకమ్మ’ పేరిట పూజించసాగారు.
**ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పలనాటి సీమనూ, తెలంగాణనూ మధ్యలో ప్రవహిస్తున్న కృష్ణానది విడదీస్తోంది… కానీ ఆ ప్రాంతాల మధ్య పెనవేసుకున్న ఆచారాలనూ, సంప్రదాయాలనూ కాదు. అందుకే ఇరు ప్రాంతాల మధ్యా జీవన సరళిలో, చేసుకొనే వేడుకల్లో ఎన్నో సారూప్యాలు కనిపిస్తాయి. వాటిలో బతుకమ్మ పండుగ ఒకటి. ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ఉన్న పల్నాటి ప్రజల్లో అధికశాతం ప్రజలకు తెలంగాణ ప్రాంతంతో బంధుత్వాలున్నాయి. ఆడపిల్లలను ఇచ్చి పుచ్చుకోవడంతో అవి మరింత బలపడ్డాయి. అందుకే ఇక్కడి ప్రజలు బతుకమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. తెలంగాణ నుంచి ఈ ప్రాంతానికి మెట్టిన ఆడ బిడ్డలు తమ అత్తవారి ఇళ్ళలో బతుకమ్మలను ఏర్పాటు చేయడంతో ఈ ఆనవాయితీ మొదలైంది. పుట్టిల్లూ, అత్తిల్లూ సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటూ వేడుక చేసే వాడుక ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరి ఇంటా స్థిరపడిపోయింది.
**పుట్టమన్నుతో ఏడు కోటలు
ఆశ్వయుజ మాసం వచ్చిందంటే, గుంటూరు జిల్లా పలనాడు ప్రాంతంలోని ఇళ్లల్లో బతుకమ్మ పండుగ కోసం… అమ్మవారి ప్రతి రూపంగా భావించి ప్రత్యేకంగా సేకరించిన పుట్ట మన్నుతో ఏడు కోటలు కడతారు. జంట నాగులు, తలపై మణి ఉన్న నాగులు, మూడు పడగలనాగులు ఉన్న కోటలు తయారు చేస్తారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు వెండి కోటలను తయారు చేయించి, వాటిలో సారవంతమైన పుట్ట మన్ను నింపుతారు. వాటిలో వెంపల చెట్లు, తులసి, నిత్యమల్లి చెట్లు ఉంచి, భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు. పదవ రోజైన దసరా పండుగ నాడు… ఇంటి ఆడపడుచు అత్తవారింటి వెళ్లేటప్పుడు పెట్టే చలిమిడి, గాజులు, పూలు, పసుపు, కుంకుమ, ఇతర పిండి వంటలు అమ్మవారికి వాయనంగా సమర్పిస్తారు. ఒడిమాల ఒడికట్టు బియ్యం కడతారు. మేళతాళాలతో గ్రామానికి సమీపంలోని వాగులు, కుంటలు, చెరువులలో వున్న నీటిలో ఇప్పటి వరకు పూజలందుకున్న మట్టి కోటతో సహా బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. మట్టి ప్రమదల్లో దీపాలు వెలిగించి నీటిలో వదిలివేస్తారు. రోజు వారీ పూజలకు బతుకమ్మలను ఎత్తుకొని తీసుకువెళ్ళడం భాగ్యంగా మహిళలు భావిస్తారు. పిల్లలు లేనివారు ఇలా తీసుకువెళ్తే సంతానం కలుగుతుందనే విశ్వాసం బలంగా ఉంది.
**పర్యావరణ రక్ష
బతుకమ్మ పండుగలో ఆధ్యాత్మికత, పర్యావరణ స్పృహ కనిపిస్తాయి. శీతకాలం ప్రారంభం కావడంతో వర్షాల వల్ల చెరువులు నిండా నీరుంటుంది. ఔషధ మొక్కలు, పూలు కలవడం వల్ల నీరు శుద్ధి అవుతుంది. రంగురంగుల పూలు ఆరు బయటపూసి వుంటాయి. బంతి, చేమంతి, నందివర్ధనం, గునుగు, తంగెడు పూలు, పచ్చగన్నేరు పూలతో బతుకమ్మను ప్రకృతి స్వరూపిణిగా భావించి ఆరాధిస్తారు. గ్రామాల్లోలోని ప్రధాన వీధుల వద్ద బతుకమ్మను మట్టితో ఏర్పాటు చేస్తారు. వాటిని రంగు రంగు పూలతో అలంకరిస్తారు. ఈ అలంకరణలు ఎంతో వైవిధ్యంతో పోటాపోటీగా ఉంటాయి. ప్రతి రోజూ సాయంత్రం బతుకమ్మలను వీధుల్లోకి తీసుకువస్తారు. పూజలు చేస్తారు. వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ కథను పాటలా ఆలపిస్తారు. కోలాటాలు అడుతారు. చప్పట్లు చరుస్తూ, వలయంగా తిరుగుతూ వినసొంపైన, భక్తిపూరితమైన పాటలు పాడతారు. నిమజ్జనం రోజున బండ్ల మీద బతుకమ్మల ఊరేగింపుల వైభవం చూడడానికి రెండు కళ్ళూ చాలవు!
*బతుకమ్మ ఒడిమాల
పసుపు, కుంకుమ, ఐదు సోలల పొంగలి, రెండు కొబ్బరి చిప్పలు, 50 గ్రాములు చాయ పెసర పప్పు, బెల్లం, తమలపాకులు, వక్కలు, రెండు కొబ్బరి కాయలు తెల్లని వస్త్రంలో మూటగడతారు. దీన్ని ‘ఒడిమాల’(ఒడికట్టు బియ్యం) అంటారు
***రోజుకో నైవేద్యం
ఉత్సవాల్లో రోజుకొక రకమైన పిండి వంటలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
*మొదటి రోజు
నువ్వులు, బియ్యంపిండి, నూకలతో తయారు చేసిన నైవేద్యం పెడతారు.
*రెండవ రోజు
అటుకుల బతకమ్మ- సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు. ఇలా రోజుకో రకం నైవేద్యం అమ్మవారికి నివేదిస్తారు.
*తొమ్మిదో రోజు
ఐదు రకాల నైవేద్యాలను తయారు చేస్తారు. లడ్లు, పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం ప్రసాదంగా నివేదన చేస్తారు.
ఆ రోజున ఇంట్లిల్లిపాదీ తలస్నానాలు చేస్తారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. బతుకమ్మను అగరొత్తులతో అలంకరిస్తారు. స్థోమతను బట్టి రంగు రంగుల దుస్తులు, ఆభరణాలు ధరింపజేస్తారు. తర్వాత బతుకమ్మను నీటి వనరుల్లో వదిలేస్తారు. ఆ నీటిని పాత్రల్లో ఇంటికి తెచ్చుకుంటారు. బతుకమ్మను వదిలివేసిన నీటిని చల్లుకుంటే మంచిజరుగుతుందని భక్తుల విశ్వాసం.

1. తిరుమలలో వైభవంగా పుష్పక విమానోత్సవం
ఐశ్వర్యానికి ప్రతీకగా నిలిచే గజరాజును వాహనంగా మలుచుకున్న శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. వేలాదిమంది భక్తులు మంగళహారతులు పలుకుతుండగా గజగమనంతో వాహనం ముందుకు సాగింది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వాహనసేవ కనువిందుగా సాగింది. సాయంత్రం 4 గంటల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వర్ణరంజిత పుష్పాలతో అలంకరించిన పల్లకిలో ఊరేగారు. ఉదయం హనుమంత వాహనసేవలో అయోధ్యరాముడి రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో ఏడో రోజు మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరగనున్నాయి.

2. కాత్యాయనిగా శ్రీశైల భ్రామరి
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం శ్రీభ్రమరాంబాదేవి కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ వేదికపై ఆశీనులైన కాత్యాయని అమ్మవారికి, హంస వాహనంపై కొలువైన శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. శ్రీగిరి వీధుల్లో దేవదేవులకు పుష్పపల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 18న శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామికి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఈ వస్త్రాలు బహుకరిస్తారు.

3. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ
విజయవాడ దుర్గగుడిలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సోమవారం దుర్గమ్మ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చారు. ఆరు రోజుల్లో రికార్డు స్థాయిలో 10 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు వెళ్లడించారు. ఒక్క మూలానక్షత్రం రోజునే 4.15లక్షల మంది దర్శించుకున్నారని ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ప్రకటించారు. గత ఏడాది మొదటి ఐదు రోజుల్లో 5.37లక్షల మంది దర్శించుకోగా.. ఈ ఏడాది ఏకంగా 9.40లక్షల మంది వచ్చారన్నారు. ఆరో రోజుతో కలిపితే.. అమ్మవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య పది లక్షలు దాటిందన్నారు.

4. శక్తిపీఠాలు తెలుసుకుందామా!-కామాఖ్యాదేవి
కామాఖ్యే కామదే దేవి – నీలాచల నివాసిని
కామస్య సర్వదే మాతః – మాతృ సప్తక సేవితే!!
జామదగ్న్యస్య రామస్య మాతృహత్యా విమోచని
పంచ శంకర సంస్థానా భక్తపాలన తత్పరా !!
కల్యాణ దాయినీ మాతా విప్ర దర్శిత నర్తనా
హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా భవ సర్వదా !!
ఇది అసోం రాష్ట్రంలోని గువహటిలో ఉంది. సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అయ్యాక, అమ్మవారి యోనిభాగం ఇక్కడ పడిందని అంటారు. ఇది పదమూడో శక్తిపీఠం. కామాఖ్యదేవి అనేక మహిమలు చూపిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయ సమీపంలోనే ఊర్వశీ (ఊర్చసి) కుండం ఉంది. ఈ కుండంలో స్నానం చేసిన తరువాతే ఆలయంలో ప్రవేశించాలి.
ఇక్కడ ఆలయం కిందకు ఉంటుంది. మెట్లు దిగి వెళ్లాలి. కామాఖ్య పీఠ దర్శనం చేసి, అక్కడి జలధారను తీర్థంగా స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు ప్రతీ ఏటా రజస్వల అవుతుంది.
ఆ సమయంలో ఈ పీఠంలోని జలధార ఎర్రగా మారుతుంది. ఈ సమయాన్ని ‘అంబుబాషిమేళ’ అంటారు. ఈ కాలంలో మూడు రోజులపాటు అమ్మవారి ఆలయాన్ని, సమీపంలోని ఇతర ఆలయాలను మూసివేస్తారు. అమ్మవారికున్న వస్త్రాలు కూడా ఎర్రగా మారతాయంటారు. నాలుగో రోజు అమ్మవారికి శిరః స్నానం చేయించి ఆలయాలు తెరుస్తారు. భక్తులు మాత్రం అమ్మవారిని కామేశ్వరి అని కూడా పిలుస్తారు. మహా త్రిపుర సుందరిగా పరిగణిస్తారు. దసరా సమయంలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు.
***మాధవేశ్వరి
త్రివేణీ సంగమోద్భుతా- త్రిశక్తీ నాం సమాహృతిః
ప్రజాపతి కృతా శేష – యాగమాలాభివందితా!!
బృహస్పతి కరాంత స్థ- పీయూష పరిషేచితా
ప్రయాగే మాధవీదేవీ – సదా పాయాత్ శుభాకృతి!!
సతీదేవి కుడిచేతి నాలుగు వేళ్లు ప్రయాగ (అలహాబాద్) ప్రాంతంలో పడినట్లు చెబుతారు. అక్కడే మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం వెలసింది. ఇది పద్నాలుగో శక్తిపీఠం. ఈ క్షేత్రంలోని గంగానది నీరు స్వచ్ఛంగా తెల్లగా ఉంటే, యమున నీరు మాత్రం నల్లగా ఉంటుంది. యమున విష్ణు భక్తురాలు. విష్ణుపాదోద్భవ అయిన గంగలో కలిసిపోయే క్షేత్రం కనుక, దీనికి మాధవక్షేత్రం అని పేరు వచ్చింది. ఆ కారణంతోనే ఈ శక్తిపీఠాన్ని మాధవేశ్వరీ పీఠంగానూ పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బింధుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ, సూర్యుడు అమ్మవారిని ఆరాధించే క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రమనీ కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మూడు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పులో నలుచదరంగా ఉన్న ఒక పీఠం మాత్రమే కనిపిస్తుంది. ఆ పీఠం మధ్యలో గుంట ఉంటుంది. అక్కడే అమ్మవారి చేతి వేళ్లు పడిన చోటు అని చెబుతారు పురోహితులు. దాన్ని ముట్టుకుంటే చేతికి తడి తగులుతుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి అడుగున ఊయల మాదిరి కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంది.

5. కాళరాత్రి అలంకరణలో జ్ఞాన సరస్వతి
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగాజరుగుతున్నాయి. నిన్న కాత్యాయినీ రూపంలో కనిపించిన జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం శుభప్రదంగా భావిస్తున్న భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి వేద పండితులు వేకువజామున నుంచే సుప్రభాత సేవ, మంగళహారతితో పాటు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని.. తమ చిన్నారులకు అక్షరాభాస్యం చేస్తున్నారు. నవరాత్రి ఉత్సావాల్లో అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభాస్యం చేయడం శుభప్రదమని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

6. మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కనకదుర్గ అమ్మవారు నేడు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వరాలిచ్చే తల్లిగా, సిరిసంపదలు కురిపించే మాతగా మహాలక్ష్మీదేవి రూపానికి పేరుంది. అందుకే ఈ రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. కృష్ణానదిలోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.దసరా సమీపిస్తుండటంతో కొండపైకి భవానీల రాక మొదలైంది. దీంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణ వర్ణం సంతరించుకుంటున్నాయి. వినాయక ఆలయం వద్ద క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులు… ఘాట్ రోడ్డు మార్గంలోని కామధేను అమ్మవారిని దర్శించుకుని కొండపైకి వస్తున్నారు. జగన్మాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

7. దశ మహావిద్యల ఆలయాలు
దశ మహావిద్యలకు దేశంలో ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రసిద్ధ ఆలయాల గురించి తెలుసుకుందాం…కోల్‌కతాలోని కాళీ ఆలయాలు ప్రసిద్ధమైనవి. వీటిలో ఒకటి కాళీఘాట్‌ ఆలయం, మరొకటి దక్షిణకాళి ఆలయం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయానికి చేరువలోనే కాళీ ఆలయం కూడా ఉంది. భువనేశ్వర్‌లో రక్షకాళీ ఆలయం, కటక్‌లో మహానది ఒడ్డున కాళీ ఆలయం, వరంగల్‌లోని భద్రకాళి ఆలయం ప్రసిద్ధి పొందినవే. పశ్చిమబెంగాల్‌లో బీర్‌భూమ్‌ జిల్లాలోని తారాపీuŠ‡ పట్టణంలో తారాదేవి ఆలయం ఉంది. హిమాచల్‌ రాజధాని సిమ్లాలోను, అదే రాష్ట్రంలోని నాలాగఢ్‌లోను, భవన్‌లోను, బహిదా బాఘ్‌లోను కూడా తారా ఆలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో అల్మోరా జిల్లా ఉడాల్‌కోట్‌లోను, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోనూ తారాదేవికి ఆలయాలు ఉన్నాయి.బెంగళూరులోని కెంపపుర ప్రాంతంలోను, చెన్నైలోని భారతీదాసన్‌ కాలనీలోను భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి. లక్నోలోని అదిల్‌నగర్‌ ప్రాంతంలోను, విశాఖపట్నం జిల్లా యాతపాలెం గ్రామంలోనూ భువనేశ్వరి ఆలయాలు ఉన్నాయి.మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోను, ఉజ్జయినిలో కాలభైరవ ఆలయానికి చేరువలో ఛత్తీస్‌గఢ్‌లోని రాజనంద్‌గాంవ్‌లో కూడా పాతాళభైరవి ఆలయాలు ఉన్నాయి. ఒడిశాలోని బౌ«ద్‌ పట్టణంలో భైరవి ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం పట్టణంలో లింగభైరవి ఆలయం ఉంది. అస్సాంలో గువాహటిలోని సుప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య ఆలయానికి చేరువలోనే ఛిన్నమస్త ఆలయం ఉంది.పశ్చిమబెంగాల్‌లోని బిష్ణుపూర్, బంకురా పట్టణాలతో పాటు జార్ఖండ్‌లోని రాజ్‌రప్పలో ఛిన్నమస్తాదేవి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని మంగళూరులోను, ఉడిపిలోనూ ధూమావతి ఆలయాలు ఉన్నాయి. కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లా పాలడుక్క గ్రామంలో కూడా ధూమావతి ఆలయం ఉంది.తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా పాప్పకుళంలో బగళాముఖి ఆలయం ఉంది. మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌ జిల్లా నల్‌ఖేడా గ్రామంలోను, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా సమేలి గ్రామంలోను, ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లోను, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోను, పంజాబ్‌లోని లూధియానాలోను, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లోనూ బగళాముఖి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోను, తమిళనాడులోని నాగపట్టణం జిల్లా నాంగూరులోను, మధ్యప్రదేశ్‌లోని ఝబువా పట్టణంలోను మాతంగీదేవి ఆలయాలు ఉన్నాయి.కర్ణాటకలోని బెల్గాం జిల్లా చిక్కలదిన్ని గ్రామంలోను, మహారాష్ట్రలోని థానే జిల్లా దండిపడా గ్రామంలోను, తమిళనాడులోని తిరువారూరులో త్యాగరాజ ఆలయానికి చేరువలోను కమలాదేవి ఆలయాలు ఉన్నాయి.

8. ఆరోగ్య భాగ్యం.. బతుకమ్మ ప్రసాదం
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి అద్దం పట్టే పండగ బతుకమ్మ. ఇందులో అనేక వైవిధ్య అంశాలు ఇమిడి ఉండటం ఓ ప్రత్యేకత. పూల సేకరణ మొదలు వృత్తాకారంలో ఆడటం.. నిమజ్జనం చేయడం వంటివాటి వెనక శాస్త్రీయత దాగి ఉంది. బతుకమ్మ ప్రసాదాల తయారీలోనూ ఓ శాస్త్రీయత ఇమిడి ఉంది. ధనికులు, ఆర్థిక స్థోమత కలిగిన వారికి నిత్యం ఓ పండుగే. వారు కావాలనుకున్నప్పుడల్లా పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటారు. మరి నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబీకుల పరిస్థితేంటి. వారి కోసమే పోషక విలువలు గల ఆహారం అందుబాటులో ఉంచడానికి బతుకమ్మ ప్రసాదాలను మన పూర్వీకులు సంప్రదాయ చేశారు. ఇవి మహిళల్లో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. పోషక విలువల సమాహారం కూడిన బతుకమ్మ ప్రసాదాలపై కథనం.
*మొదటి రోజు
ఎంగిలి పూల బతుకమ్మ పాటిస్తారు. అమావాస్య రోజున దీనిని పేరుస్తారు. ఈ రోజు ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం పెడతారు. మరికొందరు పెసరపప్పుతో గారెలు చేస్తారు. ఆర్థిక స్థోమత అంతగా లేనివారు పప్పుల మొలకలు తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో తులసి ఆకులు, వక్కపొడి, పసుపు కుంకుమలనూ తీసుకెళతారు.
*రెండో రోజు
అటుకుల బతుకమ్మ అంటాం. ప్రసాదంగా చప్పిడి పప్పు చేస్తారు. ఈ వంటకం చేయనివారు పప్పు బెల్లం కలిపి తీసుకెళతారు. పెసరపప్పు నానబెట్టి అటుకులు, బెల్లం కలిపి నైవేద్యంగా అందజేస్తారు.
*మూడో రోజు
ముద్ద పప్పు బతుకమ్మ ఆచరిస్తారు. చలిమిడి/చలివిడి ముద్దలు చేస్తారు. దీని తయారీలో పుట్నాల పిండిలా బియ్యం పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలు ఉపయోగిస్తారు. ఇదే రోజు మరికొందరు గారెలు చేస్తారు.
*నాలుగో రోజు
నానబియ్యం బతుకమ్మ అంటారు. నానబాలు చేస్తారు. బెట్టిన బియ్యంతో నువ్వులు బెల్లం కలిపి ప్రసాదం తయారు చేస్తారు.
*ఐదో రోజు..
అట్ల బతుకమ్మ అంటాం. బియ్యం నానబెట్టి దంచి తీసిన పిండితో తయారు చేసిన అట్ల ప్రసాదమే నైవేద్యం.
*ఆరో రోజు..
ఈ రోజు బతుకమ్మ ఆటకు సెలవు. అందుకే అలిగిన బతుకమ్మ అని పిలుస్తాం. ఆడలేకపోయినా దీనిని అర్రెలుగా పరిగణిస్తారు. బతుకమ్మను పేర్చరు. కొన్నిచోట్ల పేర్చి ఆడినా ప్రసాదం ఏమీ ఉండదు.
*ఏడో రోజు..
వేపకాయల బతుకమ్మగా పేరు. కొందరు పాలకాయలు చేస్తారు. మరికొందరు అటుకులు నానబెట్టి పెడతారు. బియ్యం గింజలు, నువ్వులు కలిపి నూనెలో వేయించి సమర్పిస్తారు. మరోవిధంగా చెప్పాలంటే చకినాలు చేసే పిండిని వేపకాయలంత పరిమాణంలో ముద్దల్లాగా చేసి వేయిస్తారు. ఇందులో వాము, నువ్వులు వేస్తారు.
*ఎనిమిదో రోజు..
వెన్నముద్దల బతుకమ్మ. ఈ రోజున బూరెలు చేస్తారు. బియ్యంపిండి లేదా గోధుమ పిండి వినియోగించి నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యి కలిపి వీటిని ప్రసాదంగా అందిస్తారు.
*తొమ్మిదో రోజు..
దీన్నే సద్దుల బతుకమ్మ అంటారు. ఒకప్రాంతంలో ఒక్కోరకంగా సద్దులను నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు మూడు రకాలు, మరికొందరు ఐదు, ఇంకొందరు తొమ్మిది రకాలు చేస్తారు. ఐదు రకాల పులిహోరాలు చేస్తారు. పెరుగన్నం తప్పనిసరిగా ఉంటుంది.

9. రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం…మహిళల ప్రవేశంపై సర్వత్రా ఉత్కంఠ
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశంపై కేరళ అట్టుడుకుతోంది. నెలవారీ పూజల నిమిత్తం రేపు అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు సిద్ధమయ్యారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే రాష్ట్రంలో భౌతిక దాడులు తప్పవని కొంతమంది హెచ్చరిస్తే, శబరిమలకు మహిళలు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని శివసేన కార్యకర్తలు బెదిరింపులకు దిగారు. అటు సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించింది. ఆలయం విషయంలో ప్రతిష్టంభన తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కేరళ బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్తత పెరిగింది.శబరిమల వివాదాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోగా పరిష్కరించకుంటే ప్రతీ గ్రామం నుంచి జనాలను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు. 10 నుంచి 50ఏళ్ల బాలికలు, మహిళలను అయ్యప్పస్వామి ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలు, వర్గాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో మహిళలు నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఇక కేరళలో రోజురోజుకూ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. కొట్టాయం, మలప్పురం తదితర జిల్లాలు ర్యాలీలు, ధర్నాలతో మార్మోగాయి. శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ అయ్యప్ప స్వామి భక్తులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీలతో పాటు హిందూ సంఘాలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు వెళ్లాలంటూ పట్టుబడుతున్నాయి. అటు కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు తీర్పును అడ్డుకోబోమంటూ గతంలోనే వెల్లడించింది. పైగా కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను సీఎం విజయం తప్పుబట్టారు.పందాలం రాజుకుటుంబీలుకు, ప్రధాన పూజారి కుటుంబసభ్యులతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. రేపటి నుంచి మొదలయ్యే మండలం, మకరవిలకు యాత్ర కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నెలవారీ కార్యక్రమాల నిమిత్తం రేపు తెరుచుకోబోతున్న శబరిమల ఆలయం ఈనెల 22న తిరిగి మూతపడుతుంది. ఆలయం లోపలకు మహిళలను అనుమతించేది లేదని, ప్రవేశ మార్గాల వద్దే వారిని నిలువరించేందుకు తాము అడ్డంగా పడుకుంటామని నిరసనకారులు ప్రకటించారు. ఆలయానికి రాదల్చుకున్న అందరికీ తగిన భద్రత కల్పిస్తామని మంత్రి ఈపీ జయరాజన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆలయంలో ఆలయ ప్రధాన పూజారి కుటుంబసభ్యులు, రాజకుటుంబీకులతో పీసీబీ అధ్యక్షుడు పద్మకుమార్ భేటీ కీలకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

10. శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రేపటి నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోనుండటంతో మహిళల రాక మొదలైంది. ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు. ఆలయంలోకి మహిళలను అడుగు పెట్టనీయబోమని.. అవసరమైతే దాడులకు వెనుకాడమని హెచ్చరిస్తున్నారు. కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని.. ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తామని అంటోంది.శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆలయం తెరవాల్సి ఉండగా.. అయ్యప్ప భక్తులు, ఆందోళనకారులు శబరిమలలోకి ప్రవేశించే బస్సులు, ఇతర వాహనాల్లో మహిళల కోసం గాలిస్తున్నారు. మహిళలను వాహనాల నుంచి కిందకు దించేస్తున్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలో తొలి క్యాంప్‌ అయిన నీలక్కాల్‌ వద్దే మహిళలను అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి పంబా ప్రాంతానికి వెళ్తారు. గతంలో మహిళల్ని పంబా వరకు అనుమతించేవారు. అయితే ఇప్పుడు ఆందోళనకారులు నీలక్కాల్‌ వద్దే మహిళల్ని ఆపేస్తున్నారు.తమను నీలక్కాల్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద ఆపేసినట్లు కొందరు మహిళలు, జర్నలిస్టులు వెల్లడించారు. ఆందోళన చేపడుతున్న పలు సంఘాలు నీలక్కాల్‌, పంబా క్యాంపుల వద్ద పెద్దయెత్తున మోహరించాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని భాజపా ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ ఆందోళనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు. అయితే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాత్రం తాము సుప్రీం తీర్పునకు అడ్డుచెప్పబోమని వెల్లడించారు. ప్రజలు శాంతి భద్రతలను వారి చేతుల్లోకి తీసుకోవడాన్ని ప్రభుత్వం అంగీకరించదని తెలిపారు. తీర్పుపై పునఃసమీక్ష పిటిషన్‌ దాఖలు చేయబోమని, కోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారు. భక్తులకు భద్రత కల్పిస్తామని తెలిపారు.ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆలయ నిర్వహణ చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు, పండలం రాజ కుటుంబం, ఆలయ ప్రధాన పూజారి, అయ్యప్ప సేవా సంఘం తదితర భక్తి సంఘాలు నేడు సమావేశమయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న వివాదాలపై వీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com