తెలంగాణ ఎన్నికలపై TNI ప్రత్యేక కథనాలు

1.కేసీఆర్‌పై గద్దర్‌ పోటీ.. తెలంగాణ ఎన్నికలపై TNI ప్రత్యెక కధనాలు
సీఎం కేసీఆర్‌పై ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీచేస్తారని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు అంగీకరించారని టీమాస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య వెల్లడించారు. ఈ విషయంలో గద్దర్‌ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీచేయకుండా తనకు సహకరించాలని కోరగా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కార్యాలయంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సైలెన్‌ బాటిల్‌ సాయం తో చేసిన ఉద్యమం కంటే ప్రజాఉద్యమాల కోసం తన శరీరంలో బుల్లెట్లు ఉంచుకున్న గద్దర్‌ నిజమైన ఉద్యమ నాయకుడని అన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు అధికారం దక్కాలన్నదే బీఎల్‌ఎఫ్‌ లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. అధికారంలోకి వస్తే రైతుబంధుకు అదనంగా కూలీ బంధుపథకం తీసుకొస్తామని హామీఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను పటిష్టపర్చి అందులో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రారంభిస్తామన్నారు.
2. గంగుల కమలాకర్పై క్రిమినల్ కేసు పెట్టాలి -ఈసీకి ఫిర్యాదు చేసిన భాజపా
తెరాస నేతల దౌర్జన్యంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. కరీంనగర్ భాజపా నేత సంజయ్ని బెదిరించిన మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై క్రిమినల్ కేసు పెట్టాలని కోరామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సోమవారం ముఖ్యఎన్నికల అధికారి రజత్కుమార్ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ అలుసును ఆసరాగా తీసుకొనే జిల్లాల్లో నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంపీ కవిత సహా తెరాస నాయకుల ఫొటోలతో కనిపిస్తున్న పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మరోవైపు కూకట్పల్లి నియోజకవర్గంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు తెరాసకు మద్దతుగా పని చేస్తున్నారని బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్యారెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.
3. కాంగ్రెస్ వస్తే కక్ష సాధింపులు ఉండవు: జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలు ఉండవని మాజీ విప్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని సైతం ఇదే కోరినట్లు చెప్పారు. జగ్గారెడ్డి సోమవారం గాంధీభవన్లో మాట్లాడుతూ..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై మేనిఫెస్టో కమిటీకి వినతిపత్రాలు అందజేశామన్నారు. సంగారెడ్డిలో తనతోపాటు భార్య నిర్మల నామినేషన్ వేస్తుందని తెలిపారు.
4. వినోద్ కాంగ్రెస్లో చేరడం కుదరదు
కాకా(జి.వెంకటస్వామి) కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో జరిగినంత న్యాయం ఎక్కడా జరగలేదని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు పేర్కొన్నారు. ఇష్టం వచ్చినప్పుడు పార్టీ నుంచి వెళ్లడం, తిరిగి రావడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. వినోద్ కాంగ్రెస్లో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అలాంటి వాళ్లను తిరిగి పార్టీలో చేర్చుకుంటే కార్యకర్తలు నిరుత్సాహ పడుతారన్నారు. ప్రస్తుతం చెన్నూరులో కాంగ్రెస్ బలంగానే ఉందని, వినోద్ రాకతో పార్టీకి నష్టమే గానీ లాభం లేదన్నారు.
5. కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి -సీట్ల ఖరారులో జాప్యం: చాడ
మహాకూటమి తరఫున తాము పోటీ చేయదలచిన స్థానాలకు సంబంధించి జాబితాను ఇచ్చినప్పటికీ సీట్ల సంఖ్యను ఖరారు చేయడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు తాము అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాట వాస్తవమేనన్నారు. దీనిపై అడిగితే ఇంకా సమయం ఉందంటూ దాటవేస్తున్నారని చెప్పారు. సీట్ల సర్దుబాటులో తాము కోరిన విధంగా కేటాయింపు లేకపోతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
6. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార జోరు..
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా అభ్యర్థులకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు విశేష ప్రజాదారణ లభిస్తుంది. మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజు మధిర మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
7. రేపు మధ్యాహ్నం 2.30కు టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం
రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటివరకు ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేకే తెలిపారు. రేపటి సమావేశానికి మేనిఫెస్టో కమిటీ సభ్యులంతా హాజరుకావాలని కేకే అన్నారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రజల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నందున వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే హామీలను ప్రజల్లోకి తీసుకుపోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే పూర్తి మేనిఫెస్టో సిద్ధమయ్యేలోగా ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలను వెల్లడించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మేనిఫెస్టో కమిటీ సమావేశంలో చర్చించి పాక్షిక మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నట్లు సమాచారం.
8. కాంగ్రెస్ పార్టీకి దూరంగా చిరంజీవి
సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నాయి. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి… ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
9. సూట్‌ వేసుకుంటేనే మోదీకి ‘భాయ్‌’
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రత్యక్ష విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సోమవారం దతియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ పారిశ్రామికవేత్తల కోసమే ప్రధాని పనిచేస్తున్నారు తప్ప, పేదల కోసం కాదని విమర్శించారు. ఈ సందర్భంగా రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారాన్నీ ప్రస్తావించారు. ప్రధాని మోదీ పేదలను విస్మరిస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేశారు. ‘‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రుణాలు ఎగవేసిన మెహుల్‌ చోస్కీని మెహుల్‌ భాయ్‌ అని పిలుస్తారు. నీరవ్‌ మోదీని నీరవ్‌ భాయ్‌ అంటారు. అనిల్‌ అంబానీని అనిల్‌ భాయ్‌ అని సంబోధిస్తారు. ఎప్పుడైనా ఓ కూలీనో, పేదవాణ్ణో, రైతునో భాయ్‌ అని పిలవరు. వారిని కౌగలించుకోరు. ఎందుకంటే ఆయన హృదయంలో వారికి చోటు లేదు. సూటు-బూటు వేసుకోకపోతే మీరు ప్రధాని భాయ్‌ కాలేరు. నీరవ్‌ మోదీ బ్యాంకులకు రూ.35 వేల కోట్లు ఎగవేశారు. అది ఎంత మొత్తమో తెలుసా? ఉపాధి హామీ పథకానికి కేటాయించిన బడ్జెట్‌ అంత..’’అని విమర్శించారు.
10. మునుగోడు మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మునుగోడు టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌ రెడ్డి చేదు అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి వెళ్లగా అక్కడి ప్రజలు ప్రభాకర్‌ను అడ్డుకున్నారు. గ్రామంలో కనీస సదుపాయాలు కల్పించలేదని ఆయన్ను ప్రశ్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది.
11. ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు: హరీశ్‌రావు
జలయజ్ఞం కాదు ధన యజ్ఞమని చంద్రబాబు నాయుడుతో సహా ఆనాడు లోకమంతా కోడైకూసిందని టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి నిన్న నీటి ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు మంగళవారం కౌంటరిచ్చారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని అన్నారు. 15 వేల గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. జైపాల్‌ రెడ్డి మాటలు చూసి పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతల విమర్శలు హాస్యాస్పదమని హరీశ్‌రావు అన్నారు. జైపాల్‌ రెడ్డి పుట్టి పెరిగిన కల్వకుర్తికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నీళ్లు వచ్చాయన్నారు. 8 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని ఆయన అన్నారు. 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
12.గజ్వేల్ లో గద్దర్ పోటీ
ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. కేసీఆర్‌పై పోటీకి మొదటి నుంచీ టికెట్‌ ఆశిస్తున్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి అవకాశం లభిస్తుందా.. స్వతంత్ర అభ్యర్థిగా గద్దర్‌ నిల్చుంటే ఆయనకు కాంగ్రెస్‌ మద్దతిస్తుందా అనే గజిబిజి నెలకొంది.బుల్లెట్‌ పోరు నుంచి అనూహ్యంగా బ్యాలెట్‌ పోరు బాట పట్టిన ప్రజాయుద్ధ నౌక గద్దర్‌.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడం, అన్ని పార్టీలు అంగీకరిస్తే గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించడంతో ఇప్పుడు గజ్వేల్‌లో చర్చంతా గద్దర్‌ చుట్టే తిరుగుతోంది. చాలాకాలంగా టీడీపీలో ఉండి, కాంగ్రెస్‌లోకి వచ్చాక కేసీఆర్‌పై ఒంటరి పోరు చేస్తున్న ఒంటేరు ప్రతాపరెడ్డి మళ్లీ తన అదృష్టాన్ని గజ్వేల్‌ నుంచే పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతుండటం, ఆయనకు టీపీసీసీ ముఖ్యుల మద్దతు కూడా ఉండటంఆసక్తి రేకెత్తిస్తోంది.
13. మహాకూతమికి ఓటమి తప్పదు
మహాకూటమి తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మార్చి వేసిందని టీజే ఎస్ చైర్మన్ కోదండరాం అన్నారు. పొత్తును కాపాడుకోవాల్సిన బాద్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. శనివారం టీజే ఎస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఐఏ కోర్టు రిటైర్డు జడ్జి రవీంద్ర రెడ్డి టీజేస్ లో చేరారు. ఈ సందర్భంగా కోడందరం మాట్లాడుతూ రాష్ట్రంలో మహాకూటమి ఆద్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. నిరుద్యోగులకు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు మహాకూతమికి మద్దతుగా ఉన్నాయన్నారు. సీట్ల సర్దుబాటు పై చర్చలు వేగావంతంయ్యయని సీట్లపై ఇవాలో, రేపో స్పస్థత వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
14. కేసీఆర్ ఆంధ్ర గుత్తేదార్లకు కట్టుబానిస
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా గుత్తేదార్లకు కుట్టు బానిస అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ లంచగొండి తనం, అవినీతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే తెరాస ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్లో జైపాల్రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తెరాస పాలనలో పట్టపగలే రాష్ట్ర సంపద దోపిడీకి గురవుతోందని, ఇదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆక్షేపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com