ఆకలి బాగా అయితేనే మనం ఆహారం తింటాం. జీర్ణం బాగా అవుతుంది. దాంతో మనకు శక్తి, పోషకాలు లభిస్తాయి. అయితే ఆకలి లేకపోతే ఏ ఆహారాన్నీ తినలేం. దీంతో నీరసం, అలసట వస్తుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆకలి లేకపోవడమనే సమస్యతో సతమతమవుతుంటారు. మరి ఆకలి బాగా పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఒక టీస్పూన్ బెల్లం పొడి, అర టీస్పూన్ నల్లమిరియాల పొడిలను కలిపి రోజూ ఒక పూట తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది.
2. అర టీస్పూన్ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి 10 రోజుల పాటు రోజూ ఈ మిశ్రమాన్ని భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది.
3. ఒక కప్పులో నీటిని తీసుకుని అందులో 2 టీస్పూన్ల ఉసిరికాయ రసం, 2 టీస్పూన్ల నిమ్మరసం, 2 టీస్పూన్ల తేనెలను బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఆకలి బాగా పెరుగుతుంది.
4. రోజూ భోజనం చేసే ముందు 2 లేదా 3 యాలకుల గింజలను నమిలి మింగాలి. దీంతో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడమే కాదు, ఆకలి కూడా బాగా పెరుగుతుంది.
5. ఒక టీస్పూన్ నిమ్మరసంలో 2 టీస్పూన్ల వామును కలిపి ఈ మిశ్రమాన్ని ఎండలో పెట్టాలి. అనంతరం కొంత సేపు అయ్యాక అందులో నల్ల ఉప్పును కొద్దిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. దీంతో ఆకలి పెరుగుతుంది.