తెలంగాణలో ఎన్నికల రణరంగం-TNI కధనాలు

1. జైపాల్రెడ్డివి మతిలేని మాటలు -మంత్రులు హరీశ్రావు, నాయిని నర్సింహారెడ్డి ధ్వజం
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డివి మతిలేని మాటలని.. తెలంగాణ గురించి గానీ, ఇక్కడి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హతే ఆయనకు లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, అబద్ధాలు మాట్లాడితే గుర్తింపు వస్తుందని దిగజారి మాట్లాడారని విమర్శించారు.
2. నిస్సిగ్గుగా కాపీ కొట్టారు
తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను మక్కీకి మక్కీ కాపీ కొట్టిన సీఎంది సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. మంగళవారం తెరాస పాక్షిక మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటించిన అనంతరం ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజన్కుమార్యాదవ్, సుధీర్రెడ్డి, బిక్షపతియాదవ్తో కలసి గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. తెరాస మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ…కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలతో వాటిని సరిపోల్చుతూ ఉత్తమ్ పదునైన మాటలతో తెరాస అధ్యక్షునిపై విమర్శలను సంధించారు. నాలుగున్నర ఏళ్లు పదవిలో ఉండి పలు వాగ్దానాలు అమలుచేయని కేసీఆర్..రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
3. మునుగోడు ప్రచారంలో ఉద్రిక్తత
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో మంగళవారం మునుగోడు నియోజకవర్గ తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. నాలుగేళ్ల క్రితం ఆ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి శాసనసభ సభ్యుడిగా శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేయకపోవడంపై అదే సామాజిక వర్గానికి చెందిన సీపీఎం, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. పనులు ఎప్పుడు పూర్తి చేయిస్తారో తెలపాలని నిలదీశారు. దీంతో తెరాస శ్రేణులు, సీపీఎం, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో చొక్కాలు చిరిగి పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించారు. అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఇలా నిలదీయాల్సి వచ్చిందని నిరసనకారులు తెలిపారు. కాగా సీపీఎం, కాంగ్రెస్, భాజపా నేతలు తనపై కుట్రతో ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నారని ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. మూడు పార్టీలు ఏకమైనా గులాబీ దండును ఏమీ చేయలేవన్నారు.
4. నేను ప్రచారం చేస్తే ఓట్లు పడవు -దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యలు – శాసనసభ ఎన్నికల్లో తాను కనుక ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్య బహుశా తగ్గిపోతుందేమోనన్న సీనియర్నేత దిగ్విజయ్సింగ్ మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్న మధ్యప్రదేశ్లో ఇప్పుడీ వీడియో వివాదానికి తెరలేపినట్లయింది. అక్టోబరు 13న రికార్డు అయినట్లుగా చెబుతున్న ఈ వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం మొదలైంది.
5. ముఖ్యమంత్రి కేసీఆర్పై హెచ్చార్సీలో ఫిర్యాదు
ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. అక్టోబరు 5న నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ‘కుంటోళ్లు, గుడ్డోళ్లు’ అని సీఎం అనడం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ఛైర్మన్ ముత్తినేని వీరయ్య, రాష్ట్ర నాయకుడు సతీష్గౌడ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.వికలాంగుల హక్కుల చట్టం-2016, సెక్షన్ 93 ప్రకారం శిక్షార్హులవుతారని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు పరిశీలనలో ఉంది.
6. అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టులో డీకే అరుణ పిటిషన్
తెలంగాణ శాసన సభను రద్దు చేయడం రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దసరా సెలవులు కావడంతో సెలవుల అనంతరం పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొంది. సత్వరమే వెకేషన్ బెంచ్ విచారణ చేయాలన్న ఆమె విజ్ఞప్తిని రిజిస్ట్రీ తిరస్కరించింది. సెలవుల అనంతరం ఈనెల 22న పిటిషన్ విచారణకు స్వీకరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేయనున్నట్లు డీకే అరుణ తెలిపారు.
7. జేడీ(యు) ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిశోర్
ఎన్నికల వ్యూహకర్తగా ఖ్యాతిగాంచిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు జనతాదళ్(యునైటెడ్) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. బిహారు ముఖ్యమంత్రి, జేడీ(యు)సారధి నితీశ్కుమార్ మంగళవారం ఈ మేరకు నియామకం చేశారు. అంటే ప్రశాంత్ కిశోర్ పార్టీలో నితీశ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేత అయ్యారు.
8. పినపాకలో ‘కారు’కు ఎదురు దెబ్బ
ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో తెరాసకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పినపాక మండలంలోని తెరాస ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఏడూళ్ల బయ్యారం, ఉప్పాక నుంచి సుమారు 400 మంది కార్యకర్తలు తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో ముఖ్య నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తెరాస అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అభ్యర్థిత్వాన్ని అసమ్మతి వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే, వారిని బుజ్జగించేందుకు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో గత మూడు రోజులుగా తెరాసలోని ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
9. ప్ర‌తికూల స‌ర్వే నివేదిక‌లు…! త‌డ‌బ‌డుతున్న గులాబీ బాస్..!
తెలంగాణాలో అదికార గులాబీ పార్టీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న‌ట్టు స‌ర్వేలు నిర్దారిస్తున్నాయి.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ శాసనసభ మొత్తం 119 స్థానాలకు గాను అధికార పార్టీకి 43 స్థానాలు దక్కుతాయని ఇంటిలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో 35 స్థానాల్లో గట్టి పోటీ ఎదురవుతుందని నివేదికలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. 100 స్థానాలు సాధిస్తామన్న ధీమాతో ముందస్తు ఎన్నికలకు తెరతీసిన చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఈ నివేదిక ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.
10. కేసీఆర్‌ హామీలు నిరుద్యోగులు నమ్మరు’
నిరుద్యోగభృతి సాధ్యం కాదన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎలా ప్రకటించారని, కేసీఆర్‌ మోసపూరిత హామీలను నిరుద్యోగులు ఎవరూ నమ్మరని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ కోచైర్మన్‌ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనే టీఆర్‌ఎస్‌ కాపీకొట్టిందని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు దక్షిణ భారతదేశ బడ్జెట్‌ చాలదని చెప్పిన కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. ఉద్యోగుల సీపీఎస్‌ విధానం రద్దుపై టీఆర్‌ఎస్‌ ఎందుకు స్పందించలేదని అడిగారు. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ 4 విడతలుగా మాఫీ చేయడం వల్ల రైతుల మీద అదనపు వడ్డీ భారం పడిందన్నారు. టీఆర్‌ఎస్‌ రుణమాఫీ వల్ల బ్యాంకర్లకే లాభం జరిగిందన్నారు.
11. ఆంధ్రవాళ్ల శని.. చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రవాళ్లకు పట్టిన శని అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చంద్రబాబు అవసరం ఇంకా ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల తరుణంలో రాజకీయాల కోసం తెలంగాణలో ఉడుములాగా సొచ్చారని విమర్శించారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌ భస్మమైపోతుందని అన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వందకుపైగా సీట్లతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత గడ్డం గీక్కునేది ఎవరో, ఉంచుకునేది ఎవరో తెలుస్తుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్న వాళ్లంతా తెలంగాణ వారేనని పునరుద్ఘాటించారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.
12. కాంగ్రెస్‌కు టచ్‌లో టీఆర్‌ఎస్‌ సీనియర్లు- పొన్నం
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి స్థాయి నేతలు, సీనియర్లు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. నియంత కేసీఆర్, ఆయన కుటుంబ పాలనలో పని చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. మంగళవారం కరీంనగర్‌లో విలేకరులతో పొన్నం మాట్లాడారు. కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కాంగ్రెస్‌ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారంపై అడిగిన ప్రశ్నలకు పొన్నం పైవిధంగా స్పందించారు. 2014 ఎన్నికల్లో పేర్కొన్న మేనిఫెస్టో అంశాలను తుంగలో తొక్కిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచిందని దుయ్యబట్టారు.
13. గద్దర్‌ మీద ఓడిపోతాననే భయంతోనే..- ఐలయ్య
గద్దర్‌ మీద ఓడిపోతాననే భయం తోనే కేసీఆర్‌ గజ్వేల్, మేడ్చల్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని టీమాస్‌ ఫోరం చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని, త్యాగం చేసిన వారిని దూరం పెట్టిందని ఆరోపించారు.
14. టీఆర్‌ఎస్‌ వంచనను ప్రజలు గుర్తించారు
తెలంగాణ ప్రజలను టీఆర్‌ఎస్‌ ఎన్ని రకాలుగా వంచించిందో, అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వివిధ వర్గాల కు చెందిన పలువురు నేతలు మంగళవారం టీజేఎస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీజేఎస్‌ కండువాలను కప్పి కోదండరాం వారిని పార్టీలోకి ఆహ్వానిం చారు.
ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చి, అధి కారంలోకి వచ్చాక నమ్మిన ప్రజలను కేసీఆర్‌ వంచించారని మండిపడ్డారు. యువకులను, రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను కేసీఆర్‌ వంచించారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పతనం తప్పదని జోస్యం చెప్పారు. టీజేఎస్‌లో చేరిన వారిలో తెలంగాణ పరిరక్షణ సమితి అధ్య క్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మైనారిటీ నేతలు మహ్మద్‌ అబ్దుల్‌ తదితరులు ఉన్నారు.
15. రాష్ట్రానికి రానున్న ఈసీ బృందం
రాష్ట్ర శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పరిశీలన జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎం యంత్రాల సంసిద్ధత, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అం శాలపై పరిశీలన జరపడంతోపాటు రాజకీయ పార్టీ ల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌తో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.
16. గజ్వేల్‌ ప్రజలు పరివర్తనను కోరుతున్నారు- వీహెచ్‌
గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలు పరివర్తనను కోరుకుంటున్నారన్న విషయం తన రథయాత్రలో అర్థమైందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఉమ్మడి మెదక్‌జిల్లాలో ఇందిరా విజయ రథయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.తాను పర్యటించిన ప్రతీ చోటా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, గజ్వేల్‌తో పాటు నర్సాపూర్, మెదక్, జహీరాబాద్‌లలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని ఆయన చెప్పారు. కేసీఆర్‌ను ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజలు అసహ్యిం చుకుంటున్నారని, ఆయన మోసం చేశారని ప్రజ లకు అర్థమైందని వీహెచ్‌ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ హవా నడుస్తోందని, తాము కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
17. 19న టీడీపీలోకి నందీశ్వర్‌గౌడ్‌
మెదక్‌ జిల్లా పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ ఈ నెల 19న టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణను మర్యాదపూర్వకంగా కలిశారని, 19న టీడీపీలో బేషరతుగా చేరుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బుచ్చిలింగం వెల్లడించారు. నందీశ్వర్‌గౌడ్‌ 2014 ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లారు.ఆ తర్వాత తన రాజకీయ గురువు డి.శ్రీనివాస్‌ కూడా కాంగ్రెస్‌లోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో గత నెలలో ఆయన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కుంతియా, ఉత్తమ్‌లను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమి పరిణా మాల నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్‌ పక్షాన టికెట్‌ ఇచ్చే అవకాశం లేకపోవడంతో టీడీపీలో చేరుతున్నారని తెలుస్తోంది. పటాన్‌చెరు అసెం బ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీ కారం తెలిపిందని, ఆయన టీడీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి బరిలో దిగుతారని ఎన్టీఆర్‌ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com