పదో రికార్డు కైవసం చేసుకున్న కూచిభొట్ల ఆనంద్-TNI ప్రత్యేకం


ఓ వ్యక్తి రూపొందించిన ఒక వ్యవస్థ అద్భుతాలను సృష్టిస్తోంది. యావత్ తెలుగు జాతి గర్వించే విధంగా కార్యకలాపాలను చేపడుతోంది. విదేశాల్లో పుట్టిన ఒక చిన్న తెలుగు సంఘం మాతృభూమిని మరచిపోకుండా సొంతగడ్డ పై చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు తెలుగువారందరికి గర్వకారణంగా ఉంటున్నాయి.

*** ఉపాధి కోసం భార్యబిడ్డలతో కలిసి అమెరికా వెళ్లి ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని 18ఏళ్ల క్రితం కూచిభొట్ల ఆనంద్ అనే ఒక చిన్న వ్యక్తి ఏర్పాటు చేసిన ‘సిలికానాంధ్ర’ అనే చిన్న సంస్థ తెలుగుజాతి గర్వించే విధంగా చేస్తున్న కార్యక్రమాలు నేడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టకూడదు’ అనే ఆలోచన ప్రతి తెలుగు సంస్థలో రేకెత్తిస్తున్నాయి.

*** ఒకటా…రెండా…మొత్తం పది రికార్డులు…!
కూచిభొట్ల ఆనంద్ సారధ్యంలోని సిలికానాంద్ర ఇప్పటి వరకు తొమ్మిది గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. 2008లో అమెరికా గడ్డపై తొలిసారిగా ఒకే వేదిక పై దాదాపు నాలుగు వందల మంది కూచిపూడి కళాకారిణిలతో చేయించిన నృత్యంతో సిలికానాంద్ర గిన్నీస్ రికార్డుల పర్వం ప్రారంభమైంది. అక్కడితో ఆగకుండా ‘అన్నమయ్య లక్ష గళార్చన’, తదితర అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేపట్టి గడిచిన పదేళ్ళలో మొత్తం తొమ్మిది గిన్నిస్ రికార్డులను కూచిభొట్ల ఆనంద్ నెలకొల్పారు.

*** కూచిపూడి ‘సంజీవని’తో మరో రికార్డు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా నూటికి నూరు శాతం ప్రజల భాగస్వామ్యంతో కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సంజీవని వైద్యశాల ఆనంద్ సాధించిన మరో రికార్డుగా రూపుదిద్దుకోబోతోంది. కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో 50కోట్ల ఖర్చుతో కూచిపూడి వంటి చిన్న గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 200 పడకల ఆసుపత్రి తెలుగువారికే కాదు యావత్ భారత జాతికే గర్వకారణం అనటంలో సందేహం లేదు.

*** సంజీవని ఆస్పత్రి నిర్మాణంలో అన్నీ వింతలే?!
వాస్తవానికి కూచిపూడి నాట్యం రూపుదిద్దుకొన్న గ్రామంలో ‘కూచిపూడి నాట్యారామం’ నిర్మించే బాద్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూచిభొట్ల ఆనంద్ కు నాలుగేళ్ళ క్రితం అప్పగించారు. ఈ పని మీద కూచిపూడి వెళ్ళిన ఆనంద్ కు, ఆయన అనుచర బృందానికి అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. ముందుగా అక్కడి ప్రజలు ఆయనకు సహకరించడానికి ఆసక్తి చూపలేదు. అక్కడ ఉన్న కూచిపూడి నాట్యాచార్యులు కొంతమంది ఆనంద్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

** ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని…
కూచిపూడిలో తొలుత తనకు ఎదురైన ఇబ్బందులను కూచిభొట్ల ఆనంద్ తన చాకచక్యంతో అనుకూలంగా మార్చుకున్నారు. పంచె పైకి ఎగగట్టి జోలె పట్టుకున్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని దానగుణం ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరిని కలిశారు. కూచిపూడి గ్రామ అభివృద్దికి కూచిభొట్ల ఆనంద్ చేపట్టిన నిధుల వేట పలువురిని కదిలించివేసింది. కరడుగట్టిన మీడియా అధినేతగా పేరుపొందిన రవిప్రకాష్ లో ఉన్న మరొక కోణాన్ని ఆనంద్ బయటకు తీసుకువచ్చారు. సంజీవని నిర్మాణానికి రవిప్రకాష్ సొంతగా నాలుగు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించారు. మరొక పదికోట్ల విరాళాన్ని తన టీవీ9 ద్వారా ప్రజల నుండి ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఇప్పించారు. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న సంజీవని నిర్మాణంలో రైతు కూలీలు, రిక్షా కార్మికులు, పదవీవిరమణ చేసిన వృద్దులు, షాపు గుమ్మస్తాలు తదితర వర్గాల వారిని సంజీవని ఆకర్షించింది. వంద రూపాయల నుండి కోట్ల వరకు విరాళాలు ఈ ఆస్పత్రి నిర్మాణానికి పెద్ద ఎత్తున తరలిరావటం పెద్ద విశేషమే కాదు, గొప్ప వింత కూడా! కూచిపూడిలో ఒక పక్క ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతూనే మరొక పక్క ఆ గ్రామాన్ని సిలికానాంద్ర కుటుంబం సుందరవనంగా తీర్చిదిద్దింది. ఆ గ్రామంలో ఆరు కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశారు. గ్రామం అంతా ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చారు. పాఠశాలల్లో అమెరికా తరహాలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

*** ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కూచిపూడి.
సిలికానాంద్ర నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖ తెలుగు వైద్యులు ఈ ఆస్పత్రికి తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. అన్ని జబ్బులకు ఈ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. తుఫాను పనుల ఒత్తిడిలో శ్రీకాకుళంలో ఉన్న చంద్రబాబు దసరా పండగ రోజున ఈ ఆస్పత్రి ప్రారంభానికి తీరిక చేసుకుని తరలివచ్చారు. ప్రభుత్వం నుండి పదికోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఈ ఆస్పత్రి నిర్వహణ కోసం మంజూరు చేశారు. కూచిభొట్ల ఆనంద్ తదితర సిలికానాంద్ర కుటుంబ సభ్యుల సేవాభావాన్ని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగుజాతికే గర్వకారణమని కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో నిరంతరాయంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆరు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఆనంద్ వందేళ్ళ పాటు ప్రజల మధ్య ఉండి మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటూ……కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com