తెలంగాణాలో ఎన్నికల కోలాహలం –TNI ప్రత్యేక వార్తా కథనాలు

1. సూర్యోదయంలాగే తెరాస గెలుపు ఖాయం-మాజీ స్పీకర్ మధుసూదనాచారి
రేపటి సూర్యోదయం ఎంత నిజమో.. తెరాస మళ్లీ అధికారంలోకి రావటం అంతే వాస్తవమని జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ తెరాస అభ్యర్థి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. మహా కూటమి ఓ మాయా కూటమని.. అది మాయమయ్యే కూటమని విమర్శించారు. ఆ కూటమికి జెండా గానీ.. ఓ అజెండా గానీ లేదన్నారు. అవసరార్థం ఎన్నికల కోసమే ఏర్పడే కూటముల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. నాయకులంతా కలిసినంత మాత్రాన ఓట్లు రాలవనే సత్యాన్ని మహాకూటమి నేతలు తెలుసుకోవాలని సూచించారు. నాలుగేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని కితాబిచ్చారు. సమర్థ నాయకత్వం కేసీఆర్ సొంతమని కొనియాడారు. దోపిడీకి మారుపేరుగా కాంగ్రెస్ నాయకులు నిలిస్తే.. నిజాయతీకి నిలువుటద్దంగా తెరాస నాయకులు నిలిచారని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థులే లేరని పేర్కొన్నారు. రూ.2500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని.. ఏడాదిలో 250 రోజులు నియోజకవర్గ ప్రజల మధ్యే ఉన్నానని చెప్పుకొచ్చారు. తాగు, సాగునీరు, రహదారులు, విద్యుత్తు వంటి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించగలిగానని పేర్కొన్నారు. వరదల కారణంగా గ్రామాలు జల దిగ్బంధం కాకుండా ఎక్కడికక్కడ వంతెనలు నిర్మించామని చెప్పారు.
2.కేసీఆర్ నిర్ణయంతో నేతల ఇంట్లో గొడవలు?
తమకు పార్టీ టిక్కెట్ వస్తుందని ఆశించారు. తీరా అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఆ ఆశ కాస్తా ఆవిరైపోయింది. తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోవాలనుకున్న నేతల కలలు కల్లలయ్యాయి. కేసీఆర్ మాటకు ఎదురు చెప్పలేక.. తమ ఇంట్లో నచ్చచెప్పుకోలేక వారు సతమతమవుతున్నారు. వరంగల్ జిల్లాలో నేతలకు వారసుల సెగ తగిలింది. తమ తమ నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఇప్పిస్తామంటూ రెండేళ్లుగా బాసలు చేసిన తండ్రుల మాటలు నీటిమూటలు అవ్వడంతో వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. నియోజకవర్గాలను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పినచోట తమకే చోటులేకుండా పోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ఓరుగల్లు వాకిట వారసుల గోడు ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోండి.
వరంగల్ జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన నేల. ఈ నేలపై ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల్లో తమదంటే తమది పైచేయి కావాలంటూ పార్టీలు పోరుబాట పట్టాయి. ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలుంటే, అందులో 11 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థిత్వం కోసం సర్వేలు ఇతర మార్గాలను అన్వేషిస్తోంది. మరోవైపు మహాకూటమి ఇప్పటికీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది.
3. కోదండరాంతో వీహెచ్‌ భేటీ
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు భేటీ అయ్యారు. ఈ ఉదయం తార్నాకలోని కోదండరాం నివాసానికి వీహెచ్‌ వెళ్లారు. దసరా సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎన్నికల సమయం కావడంతో వీరిద్దరి భేటీపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమికి సంబంధించిన అంశాలపై కోదండరాంతో వీహెచ్‌ చర్చించినట్లు సమాచారం.
4. తెలంగాణలో రాహుల్‌ గాంధీ ప్రచార సభలు
ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సిద్ధమైంది. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భైంసా, కామారెడ్డిలలో జరిగే రెండు బహిరంగ సభల్లో రాహుల్‌ ప్రసగించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగే రాజీవ్‌ సద్భావనా యాత్రలోనూ పాల్గొంటారు.వచ్చే వారం నుంచి సోనియా గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. రాహుల్‌ పర్యటన ముగిసిన వెంటనే పీసీసీ ప్రచార కమిటీ ప్రచారాన్ని కొనసాగించనుంది. భట్టి విక్రమార్క, విజయశాంతిలతో పాటు ఇతర ప్రముఖ నేతలు ఈ ప్రచారంలో పాల్గొంటారు. 27,28 తేదీల్లో మరో దఫా రాష్ట్రంలో పర్యటించేందుకు రాహుల్‌ గాంధీ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వరంగల్‌ లేదా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.
5. ఆజాద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
తనను ఎన్నికల ప్రచారానికి పిలిచే హిందువుల సంఖ్య తగ్గిపోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష పార్టీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారిస్తుందని విమర్శించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ.. ఆజాద్‌ను తక్కువ మంది ప్రచారానికి పిలువడానికి.. ఆయన హిందూ, ముస్లింలను వేరుగా చూడటమే కారణమని ఆరోపించారు. బీజేపీ అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీని ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.
6. పూర్తి మేనిఫెస్టో చూస్తే ఎన్నికల్లో నిలబడరేమో!
తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలోని పలు సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చే సలహాలు, సూచనలతో నవంబర్‌ మొదటి వారంలో పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వరంగల్‌లో కడియం మీడియాతో మాట్లాడారు.తెరాస ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దేశంలోనే మంచి పేరుందని ఆయన అన్నారు. తెరాస హామీ ఇస్తే అమలు చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని.. అందుకే తమ పార్టీ పాక్షిక మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని కడియం వ్యాఖ్యానించారు. ప్రజల్లో తమకు మంచి స్పందన రావడాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయని ఆయన ఆరోపించారు.
7. రాహుల్‌ పర్యటనను స్వాగతిస్తున్నా- గద్దర్‌
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా గాయకుడు గద్దర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ పర్యటనను స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో రాహుల్‌గాంధీ ఉద్యమిస్తున్నారని, తెలంగాణలో ఆయన సభలను విజయవంతం చేయాలని గద్దర్‌ పిలుపునిచ్చారు.
8. మా పాక్షిక మేనిఫెస్టోకే బెంబేలు’
తమ మేనిఫెస్టోను మక్కి మక్కి కాపీ కొట్టారంటున్న టీపీసీసీ నేతలపై తాజా మాజీ మంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రయకటించిన పాక్షిక మేనిఫెస్టోను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని శ్రీహరి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టోకే భయపడిపోతున్న కాంగ్రెస్ నేతలు‌.. తమ పూర్తి మేనిఫెస్టోను చూస్తే పోటీ చేస్తారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. శుక్రవారం ప్రెస్‌ మీట్‌లో మాట్లాడిన కడియం శ్రీహరి.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కంటే బెటర్‌ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రకటించి చూపాలని సవాల్‌ చేశారు.
9. 6 స్థానాల్లో ఏకాభిప్రాయం.. 20న బీజేపీ తొలి జాబితా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. శనివారం(అక్టోబర్‌ 20) రోజున 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది. ఈ భేటీలో ముఖ్యంగా 5 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అందులో ఆరు స్థానాల్లోని అభ్యర్థుల పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. కాగా, మిగతా స్థానాలపై చర్చించడానికి శుక్రవారం ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.
10. 21న మధ్యాహ్నం 2.30 కు టీఆర్‌ఎస్ అభ్యర్థులతో సీఎం భేటీ
ఈనెల 21న మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల అవగాహన సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సీఎం, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పాల్గొని అభ్యర్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులపై సీఎం కేసీఆర్ అవగాహన కల్పించనున్నారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సమావేశంలో విధిగా పాల్గొనాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com