చైనాలో చందమామలు అమ్ముతున్నారు

చైనా కృత్రిమ చందమామలను తయారు చేస్తోందా? వినడానికీ, చదవడానికీ విచిత్రంగా ఉంది కదూ..! 2022 కల్లా ఇలాంటి వాటిని మూడింటిని అభివృద్ధి చేసి అంతరిక్షంలోకి పంపాలని భావిస్తోంది. 2020 నాటికి ఈ ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి వస్తాయని చైనాకు చెందిన ఓ శాస్త్ర సాంకేతిక వార్తా సంస్థ వెల్లడించింది. రాత్రి సమయాల్లో వీధి లైట్ల బదులు ఈ కృత్రిమ చందమామలనే వాడాలని చైనా యోచిస్తోంది. ఓ అత్యంత భారీ దర్పణాన్ని ప్రత్యేక పద్ధతిలో తయారు చేసి దాన్ని అంతరిక్షంలోకి పంపుతారు. దీనిపై సూర్యుడి కాంతి పడి అది ప్రకాశిస్తుంది. దీనిపై పడ్డ కాంతి పరావర్తనం చెంది భూమిని చేరుతుంది. పరావర్తనం చెందిన సూర్య కాంతి భూమిపై దాదాపు 3,600 నుంచి 6,400 చదరపు కిలోమీటర్ల పరిధిలో పడుతుందని చెప్పారు. ఈ కాంతి తీవ్రత సహజ చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల కాంతి కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. కృత్రిమ చందమామలను భూమి ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. సాధారణ చంద్రుడు భూమి నుంచి 3,80,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ కృత్రిమ చందమాల నుంచి వచ్చే కాంతి వల్ల రాత్రి, పగలు చక్రానికి విఘాతం కలుగుతుందనే విమర్శలున్నాయి. దీనివల్ల మొక్కలు, జంతువులు తమ రోజువారీ క్రియలను జరపలేవని కొందరు అంటున్నారు. అయితే ఈ కృత్రిమ చందమామల నుంచి కాంతి పరావర్తనం చెందే తీవ్రతను, పరిధిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. భూమి నుంచి చూస్తే ఇది ఒక ప్రకాశవంతమైన నక్షత్రంలా మాత్రమే కనబడుతుందని తెలిపారు. కృత్రిమ చందమామల వాడకం వల్ల విద్యుత్‌ బాగా ఆదా అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి 50 చదరపు కిలోమీటర్ల పరిధికి 1.2 బిలియన్‌ యువాన్‌ల విలువైన కరెంటును ఆదా చేయవచ్చని అంటున్నారు. 1990లో రష్యా ‘బ్యానర్‌’ పేరుతో ఇలాంటి కొత్తరకం ప్రయోగాన్నే చేసింది. కానీ, వివిధ రకాల సమస్యలతో ఆ ప్రయోగం ఆగిపోయింది. కృత్రిమ చందమామలను అంతరిక్షంలోకి పంపే సమయం.. ఏ కక్ష్యలో ప్రవేశపెట్టాలనుకుంటున్నారు.. తదితర వివరాలను 2020 కల్లా పూర్తి చేయాలనుకుంటున్నట్లు వూ చున్‌ఫెంగ్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com