భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని నమోదు చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సి-50 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో నమ్మిన బంటు అయిన పీఎస్‌ఎల్వీ వాహక నౌక కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 22 నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. 11 ఏళ్ల కిందట పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-12 జీవిత కాలం ముగియడంతో దానిస్థానంలో సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని పంపారు. మొత్తం ఏడేళ్ల పాటు ఇది సేవలందించనుంది. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్ సేవలను అందించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. దీని పరిమితి భారత్‌తో పాటు, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లకు విస్తరిస్తుంది. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యునికేషన్ ఉపగ్రహం కావడం గమనార్హం. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ శివన్ సంతోషం వ్యక్తంచేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. కొవిడ్-19 వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతమైన పనితీరు కనబర్చారని కొనియాడారు.
PSLVతో కమ్యూనికేషన్ వ్యవస్థకు బలం
Related tags :