WorldWonders

ఈ ఫోటో తీయడానికి 8ఏళ్లు పట్టింది

8 Years Exposure Time To Take This Photo

మామూలుగా ఒక ఫొటో క్లిక్ మనిపించాలంటే క్షణం కూడా పట్టదు. ఇంకా చెప్పాలంటే ఆధునిక స్పీడ్ కెమెరాల్లో క్షణంలో వెయ్యోవంతు సమయంలో షటర్ తెరుచుకుని మూసుకుంటుంది. వేగంగా కదిలే వస్తువులను ఫొటో తీయడానికి వాటిని వినియోగిస్తారు. కానీ క్షణం, గంట కాదు ఏళ్లతరబడి

ఎక్స్‌పోజ్ చేసిన ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. రెగీనా వాల్కెన్‌బోర్గ్ కేవలం ఓ ఖాళీ బీర్‌క్యాన్‌ను ఉపయోగించి ఈ అపురూపమైన ఫొటో తీశారు. క్యాన్‌లో ఫొటోగ్రాఫిక్ పేపర్‌ను ఉంచి ఆమె ఓ కీహోల్ కెమెరా తయారు శారు. ఇది జరిగింది 2012లో. యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో

ఎంఏ ఫైనార్ట్స్ చదువుతున్నప్పుడు ఆమె ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. బేఫోర్డ్‌బరీ నక్షత్రశాల టెలిస్కోప్‌పై ఆమె తన డబ్బా కెమెరాను అమర్చారు. ఎనిమిది సంవత్సరాల ఒకనెల పాటు ఆమె ఆ కెమెరా ఆకాశదృశ్యాలను ఎక్స్‌పోజ్ చేస్తూనే ఉంది. సూర్యోదయ, సూర్యాస్తమయాలు అందులో

రికార్డయ్యాయి. రుతువులను బట్టి సూర్యుని స్థితి మారడం వల్ల అటూఇటూ వాలుగీతలు నమోదయ్యాయి. మొత్తం 2,953 సూర్యరేఖలు కెమెరాలో నమోదయ్యాయి. రెగీనా ఈ కీహోల్ కెమెరా ఎందుకు తయారు చేసిందంటే తనకు ఆధునిక కెమెరాలతో ఫొటోలు తీయడం ఇష్టం లేదట. బీర్‌క్యాన్‌లో

ఫొటోగ్రాఫిక్ పేపరు అతికించి మూసివేసింది. దానికి చిన్న రంధ్రం చేసి సూర్యగమనాన్ని క్యాప్చర్ చేసేలా నక్షత్రశాల టెలిస్కోప్‌పై అమర్చింది. ఏతావాతా ఆ సంగతి మరచిపోయారు. గత సెప్టెంబర్ లో నక్షత్రశాల సాంకేతిక విభాగాధిపతి అనుకోకుండా ఆ కీహోల్ కెమెరాను గమనించి

బయటకు తీశారు. లోపలున్న పేపరుపై అద్భుతమైన దృశ్యం కనిపించింది. సాధారణంగా పట్టణ దృశ్యాలను, ల్యాండ్‌స్కేప్ దృశ్యాలను నమోదు చేయడానికి లాంగ్ ఎక్స్‌పోజర్ ఫొటోగ్రఫీని వినియోగిస్తారు. జర్మన్ ఆర్టిస్టు మైకేల్ వెస్లీ నాలుగేళ్ల ఎనిమిది నెలల సుదీర్ఘమైన ఎక్స్‌పోజర్‌ ఫొటోతో

రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు రెగీనా తీసిన ఫొటో ఎనిమిదేళ్ల పైచిలుకు ఎక్స్‌పోజర్‌తో ఆ రికార్డును అధిగమించింది. తన బీర్‌క్యాన్ ఫొటో సురక్షితంగా దక్కడం అదృష్టమేనని రెగీనా అంటున్నారు. ఇదివరకు ఇలాంటి ప్రయోగాలే చేస్తే ఫొటో రాకపోవడం లేదా ఫొటోకాగితం చుట్టుకుపోవడం జరిగిందట.

ప్రస్తుతం రెగీనా బార్నెట్ అండ్ సౌత్‌గేట్ కాలేజీలో ఫొటోగ్రఫీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు.