చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

1. చినవెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం – తదితర ఆద్యాత్మిక వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో చినవెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు వివిధ రకాల పుష్పాలు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి స్వామివారిని పెండ్లి కుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించారు. వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య కనులపండువగా జరిగిన ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారు కొలువైన శేషాచలం కిటకిటలాడింది.
2. మహా భోగ నివేదనం -అమ్మవారికి 108 వంటకాలతో నైవేద్యం
రంగు రంగుల గాజులతో కొలువుదీరిన ఉమాదేవి అమ్మవారు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలోని శివాలయంలో అమ్మవారిని 1,108 డజన్ల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం 108 రకాల పిండి వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు.
3. శరణుఘోషే నిరసన మంత్రం
శబరిమల కొండలు శుక్రవారం ‘స్వామియే శరణం అయ్యప్పా’ అన్న నినాదంతో ప్రతిధ్వనించాయి. ఈ శరణుఘోషను భక్తులు తొలుత నిరసన తెలపడానికి, అనంతరం ఆనందం వ్యక్తం చేయడానికీ ఉపయోగించుకున్నారు. రుతుక్రమ వయసులో ఉన్న ఇద్దరు మహిళలు భారీ పోలీసు బందోబస్తు నడుమ కొండపైకి వచ్చి ఆలయ ప్రవేశానికి ప్రయత్నించడం ప్రస్తుత సమస్యలో కీలక పరిణామంగా మారింది. వారి రాకపై అభ్యంతరం తెలుపుతూ పిల్లలు, వృద్ధులు సహా భక్తులంతా పెద్దయెత్తున శరణుఘోష చేశారు. వారు గర్భగుడి వద్దకు వస్తే ఆలయాన్ని మూసివేస్తామని ప్రధాన అర్చకుడు గట్టిగా హెచ్చరించడం, ఎప్పుడూ లేని విధంగా దాదాపు 35 మంది సహాయ అర్చకులు పూజల్లో పాల్గొనడకుండా ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. వాస్తవాలను గమనించిన పోలీసులు…భక్తులపై బలప్రయోగం చేసి, స్వామి సన్నిధానం వద్దకు తీసుకెళ్లబోమంటూ ప్రభుత్వం తరఫున ఆ ఇద్దరు మహిళలకు స్పష్టంగా చెప్పడం ఉద్రిక్తతలు తగ్గడానికి మార్గం చూపింది. స్వామి దర్శనం చేస్తామని తొలుత పట్టుపట్టిన ఆ మహిళలు వెనక్కితగ్గడంతో భక్తులు మళ్లీ ఆనందంతో ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ నినదించారు.
4. శ్రీవారి లడ్డూలు పక్కదారి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పొరుగుసేవల సిబ్బంది పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. ధర్మదర్శనం చేసుకునే భక్తులకు రాయితీపై రూ.20కి 2; రూ.50 చెల్లించే పక్షంలో మరో 2.. మొత్తం రూ.70కి నాలుగు లడ్డూలను తితిదే అందజేస్తుంది. యాత్రికుల రద్దీ నేపథ్యంలో సాంకేతిక కారణాలతో లడ్డూ టోకెన్లు స్కానింగ్ కాకపోయినా ప్రసాదం అందించాలని అధికారులు ఆదేశించారు. ఈ వెసులుబాటుతో 16 వేల లడ్డూలను వివిధ బ్యాంకుల పొరుగుసేవల సిబ్బంది దారి మళ్లించారు. ఇప్పటి వరకు 4 వేల లడ్డూల అక్రమానికి సంబంధించి ఆధారాలు లభించాయి. మరో 12 వేల లడ్డూలకు లెక్కలు తేలలేదు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఇతర రద్దీ రోజుల్లో అక్రమాలు సాగించినట్లు తేలింది. తితిదే విజిలెన్స్ ఈ అక్రమాలను గుర్తించింది. గోప్యంగా విచారణ సాగిస్తోంది.
5. భీమా పుష్కరాలకు భారీగా తరలివచ్చిన భక్తులు
పవిత్ర భీమా పుష్కరాలల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం కుసుమూర్తి, సుకూర్ లింగంపల్లి ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. కుసుమూర్తి ఘాట్ వద్ద 6200, సుకూర్ లింగంపల్లి ఘాట్ వద్ద 1250 మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం భక్తులు భీమా నది ఒడ్డున గల శ్రీ కృష్ణ ద్వైపయాణ మఠం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. పుష్కరాల సందర్భంగా గతించిన పితృదేవతలకు పిండప్రదానం చేశారు. ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మక్తల్ సీఐ వెంకట్ ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. గజ ఈతగాళ్ల పర్యవేక్షణలో ఘాట్లను ఉంచారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
6.దేవరగట్టులో కర్రల సమరం
కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో ఈ ఏడాదీ హింస తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది బన్ని ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కర్రల సమరంలో 35 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏటా విజయదశమి రోజు కర్రల సమరం జరగడం ఆనవాయితీగా వస్తోంది. హోళగొంద మండలం దేవరగట్టు సమీపంలో ఉన్న కొండపై వెలసిన మాళమ్మ మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలు దక్కించుకోవడం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరు వర్గాల వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని స్థానికులు బన్ని ఉత్సవంగా వ్యవహరిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏపీ, కర్ణాటకకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
7. ఆరోగ్య భోగాలనిచ్చే యోగ నరసింహ స్వామి
తిరుమల ఆలయాన్ని దర్శించిన ఎవరికైనా యోగ నరసింహస్వామి గురించి తెలిసే ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కున యోగ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. విమాన ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు రామానుజులవారి సన్నిధి దాటి ముందుకు వెళుతుండగానే యోగ నరసింహ స్వామి వారి సన్నిధి కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఆలయంలో స్వామి వారు పడమర వైపు తిరిగి వెంకటేశ్వరస్వామి వారిని చూస్తున్నట్లు ఉంటుంది. ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. యోగ రూపంలో దర్శనమిచ్చే దేవతలు ఈ ఆసనం లోనే ఉంటారు.రెండు మోకాళ్లకు యోగపట్టిక వేసి ఉంటుంది. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామి వారిని కేవల నరసింహమూర్తి, గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది వైఖానసాగమం ఈ మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో ఉంటాడని చెప్పింది. ఈ స్వామి వారిని దివ్యప్రబంధంలో ఆళ్వారులు అలగియ సింగర్‌(అందాల నరసింహుడు) అనే పేరుతో పిలిచారు.శ్రీమద్రామానుజులవారు ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్టించారు.ఈ స్వామికి నిత్యకైంకర్యాలేవీ జరుగకపోయినా ప్రతి శనివారం తిరుమంజనం (దివ్యాభిషేకం) నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు,దివ్యప్రబంధపారాయణలు అందుకుంటాడు.ఈ స్వామికి ఉత్సవవిగ్రహం లేదు.కానీ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు మాత్ర ఈ యోగనరసింహస్వామివలె యోగాసనంతో దర్శనమిస్తారు. యోగనరసింహస్వామివారిని దర్శిస్తే శతృబాధలుండవనీ, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతున్నాయి.
8. అవును.. శబరిమల మరో అయోధ్య-వీహెచ్‌పీ
శబరిమల ఆలయం దక్షిణ భారతదేశపు అయోధ్య అని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి వినోద్ బన్సాల్ పేర్కొన్నారు. శబరిమలలో నెలకొన్న అశాంతిని బాబ్రీ విధ్వంసంతో పోల్చుతూ సీపీఎం నేత సీతారాం ఏచూరి వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సీతారాం ఏచూరి తనంత తానుగా శబరిమలను అయోధ్యతో పోల్చారు. అవును.. శబరిమల దక్షిణ భారత అయోధ్య..’’ అని వినోద్ బన్సాల్ పేర్కొన్నారు. కేరళ అధికార వామపక్షాలపైనా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.‘‘శబరిమల పవిత్రత, ప్రశాంతత, విశ్వాసాలకు భంగం కలిగిస్తూ సీపీఎం తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. కేరళలోని నన్స్ ఇబ్బందులను నిర్లక్ష్యం చేస్తూ కళ్లుమూసుకున్న సీపీఎం… ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డులో హిందూయేతరులను నియమించింది. శబరిమల పవిత్రతను కాపాడేందుకు ఆందోళన చేపట్టిన ప్రజలకు అభినందనలతెలుపుతున్నాం…’’ అని వినోద్ బన్సాల్ పేర్కొన్నారు.
9. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవాని భక్తులు అమ్మవారి దర్శనంకు రెండు గంటల సమయం భక్తులను వెంటాడుతున్న ప్రసాదం కొరత లడ్డులు లేక మూడు గంటలుగా క్యూ లైన్లలోనే భక్తులు క్యూ లైన్లో పడిగాపులు పడుతున్న భవానిలు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com