Food

గుడ్లు తినవచ్చా? లేదా?

గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే విషయంపై కొనే్నళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం, పోషకాహార నిపుణులు, వైద్యులు.. ఇలా అందరూ గుడ్లను తినమనే చెబుతున్నారు. అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? ప్రతిరోజూ గుడ్డు తప్పక తినాలా? అన్నదానిపై ఇటీవల ‘జామా’ మెడికల్ జర్నల్‌లో అచ్చయిన ఓ కొత్త అధ్యయనం ఇలా వివరించింది..
గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి.. మనం రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలు సంభవించవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. రోజులో మనం తీసుకునే కొవ్వుపదార్థాలు 300 మిల్లీగ్రాములకు మించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ ఒక నాణ్యమైన గుడ్డులో దాదాపు 185 మిల్లీగ్రాముల కొలెస్టరాల్ ఉంటుందని అమెరికా వ్యవసాయ శాఖ చెబుతోంది. అంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్కలో సగానికిపైగా కొవ్వు పదార్థం ఒక గుడ్డు ద్వారానే లభిస్తుంది. 17 దాటిన 30 వేలమందిపై ఈ అధ్యయనం చేశారు. వీరిపై ఆరు రకాల ప్రయోగాలు నిర్వహించి ఫలితాలను విశే్లషించారు. రోజుకు 300 మిల్లీగ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవడం ద్వారా గుండె జబ్బు వచ్చే ప్రమాదం 17 శాతం ఉందని, అకాల మరణం సంభవించే ప్రమాదం 18 శాతం పెరుగుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఇక గుడ్డు విషయానికి వస్తే.. వారానికి మూడు-నాలుగు గుడ్లు తినడం వల్ల గుండెజబ్బు వచ్చే ప్రమాదాలు ఆరు శాతం, అకాల మరణాల ప్రమా దం ఎనిమిది శాతం పెరుగుతాయని అధ్యయనకారులు చెబుతున్నారు. కానీ రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల మాత్రం ఈ ప్రమాద శాతం 27 నుంచి 34 వరకు ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అధ్యయనం పాల్గొన్నవారి వయసు, వారి శారీరక పటుత్వం, పొగాకు వాడకం, వారిలో అంతకుముందే రక్తపోటు, మొదలైన సమస్యలుండటం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇద్దరు వ్యక్తులకు ఒకే రకమైన ఆహారం ఏర్పాటుచేసి, అందులో ఒకరికి అదనంగా ఒక గుడ్డు ఇచ్చినప్పుడు రెండో వ్యక్తికంటే, గుడ్డు తిన్న వ్యక్తికి గుండెజబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది అని అధ్యయన కర్త అయిన ప్రొఫెసర్ నోరినా అల్లెన్ చెబుతున్నారు. గుడ్డు తినడానికి, గుండె జబ్బు ప్రమాదాలకు సంబంధం లేదని చెప్పిన గత అధ్యయనాలకంటే ఈ తాజా అధ్యయనం భిన్నమైన ఫలితాలనిచ్చింది. గతంలో అధ్యయనం సమయం తక్కువగా ఉందని, అధ్యయనం కోసం సేకరించిన నమూనాలు కూడా తక్కువేనని అల్లెన్ అన్నారు. గతంలో అధ్యయనం చేసినవారు మాట్లాడుతూ ఎన్నిసార్లు గుడ్డు తిన్నారు.. అన్న సమాచారాన్ని తాము ఒక ప్రశ్నావళి ద్వారా సేకరించామని అధ్యయనంలో పాల్గొన్నవారు కొన్ని నెలలుగా తాము తీసుకుంటున్న ఆహారాన్ని గుర్తుకు తెచ్చుకుని సమాధాన పత్రంలో నింపారని తెలిపారు. అయితే తాజా అధ్యయన ఫలితాలు పరిశీలనాత్మకమే కానీ గుడ్లు తినడం కారణంగా గుండెజబ్బులు, అకాల మరణాలు సంభవిస్తాయని రుజువు చేయలేమని కొందరి నిపుణులు అభిప్రాయం. అమెరికా జనాభాలోని భిన్న జాతులవారికి ప్రాతినిధ్యం కల్పించి, అమెరికాలోని సాధారణ ప్రజలు తీసుకునే ఆహారంపై అధ్యయనం చేశారు. ఈ విషయాలే అధ్యయనానికి బలం చేకూరుస్తున్నాయి అని మరికొందరి అభిప్రాయం.
**ఎన్ని గుడ్లు తినాలి?
వారానికి మూడు గుడ్లకు మించి తినరాదని అధ్యయనకారుడైన అల్లెన్ చెబుతున్నాడు. గుడ్లను ఇష్టపడేవారు కేవలం తెల్లసొనను మాత్ర మే తినొచ్చట.. ఈ అధ్యయన ఫలితం గుడ్లు తినడం పూర్తిగా ఆపేయాలని కాదు, కానీ కాస్త మితంగా తినాలని సలహా ఇస్తున్నారు అధ్యయనకారులు. ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ 2015 లెక్కల ప్రకారం, ప్రపంచంలో ఒక సంవత్సరానికి తలసరి గుడ్డు వినియోగం ఇలా ఉంది.మెక్సికోలో తలసరి వినియోగం 352, మలేసియాలో తలసరి వినియోగం 342, జపాన్‌లో తలసరి వినియోగం 329, రష్యాలో తలసరి వినియోగం 285, అర్జెంటీనాలో తలసరి వినియోగం 256, చైనాలో తలసరి వినియోగం 254.8, అమెరికాలో తలసరి వినియోగం 252గా ఉంటే, డెన్మార్క్‌లో గుడ్డు తలసరి వినియోగం 245గా ఉంది. అమెరికాలో ఒక వ్యక్తి రోజుకు తీసుకోదగిన సగటు కొలెస్ట్రాల్ 600 మిల్లీగ్రాములు ఉంటే, ఇంగ్లండులో రోజుకు దాదాపు 225 మిల్లీగ్రాములు ఉండొచ్చట. ఇంటర్నేషనల్ ఎగ్ కమీషన్ 2015 గణాంకాల ప్రకారం ఒక వ్యక్తి సంవత్సర కాలంలో తీసుకునే గుడ్ల సంఖ్య 252 మాత్రమే.. కానీ అమెరికాలో సంభవించే మరణాల్లో 20 శాతం గుండెజబ్బులకు సంబంధించిన మరణాలే.. జపాన్‌లో ఒక వ్యక్తి సంవత్సరానికి 328 గుడ్లు తింటుంటే.. అక్కడ గుండెజబ్బు కారణంగా మరణించేవారు కేవలం 11 శాతం మాత్రమే.. కాబట్టి వారానికి మూడు-నాలుగు గుడ్ల వరకు తినడం మంచిదేనని నిపుణుల అభిప్రాయం