చెక్కిళ్ళను ఎరుపెక్కించే పండుగ అట్లతద్ది

పడుచుల ఊహలకు మరింత ఊతమిస్తూ అరచేతులనే కాదు చెక్కిళ్లనూ ఎరుపెక్కించే పండగే అట్లతద్ది. మెచ్చినవాడే భర్తగా రావాలని కన్నెపిల్లలూ, మూడుముళ్లూ వేసినవాడిని కొంగునముడేసుకోవాలని ముత్తయిదువులూ నోచే నోమే అట్లతద్ది. పట్టుపరికిణీల అందాలతో ఊయలల సందడితో వాయనాల ఘుమఘుమలతో కొత్తసందళ్లు తెచ్చే ఈ పండగ (అక్టోబరు 27) చేసే ఇంటికే కాదు చూసే ఊరికీ ఉత్సవమే.
***మన పండగలన్నీ మన జీవనవిధానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అందులో భక్తి ఎంతగా కనిపిస్తుందో, సంస్కృతీ అంతే స్పష్టంగా ఉంటుంది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకునే వేడుకే అట్లతదియ. ఇది పూర్తిగా ఆడపిల్లల పండగ. అక్కడక్కడా మగపిల్లలు ఉప్పు పొట్లాలు తిప్పి సందడి చేసినా ముందురోజు రాత్రి గోరింటాకు పెట్టుకోవడం దగ్గర్నుంచి మర్నాడు సాయంత్రం ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చేవరకూ హడావిడి అంతా కన్నెపిల్లలదే. ఆశ్వయుజ బహుళ తదియను అట్లతదియ లేదా అట్లతద్ది అంటారు. ఆ రోజున మహిళలంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అట్లతదియకు ముందురోజును భోగి అంటారు. నిజానికి తదియ సందడంతా భోగి రోజునుంచే మొదలైపోతుంది. భోగినాడు పెరట్లోని గోరింటాకును మెత్తగా నూరి అందంగా తమ అరచేతులకు అలంకరించుకుంటారు. మరుసటిరోజు అట్ల పండగ. చల్లని రాత్రి దుప్పటి ముసుగు తీయకముందే నిద్రలేవడం, పండిన గోరింటాకుని చూసుకుని మురిసిపోవడం, పట్టుపావడాలు కట్టుకుని ముస్తాబవడం, చద్దన్నం తినడం, తాంబూలాలు వేసుకోవడం, ఆడపిల్లలంతా ఒక్కచోట చేరి ఆడిపాడటం, ఊయలలూగడం… అన్నీ సరదాలే.
***మొదటి నోము అమ్మదే
పరమశివుడిని భర్తగా పొందాలని తపస్సుచేసిన గౌరీదేవికి త్రిలోకసంచారి అయిన నారదుడు ఈ వ్రతం గురించి చెప్పాడని పురాణాలు తెలుపుతున్నాయి. నారదుడి ప్రోద్బలంతో అమ్మవారు అట్లతద్ది నోమును నోచుకుని, పరమేశ్వరుడి అర్ధాంగి అయ్యింది. ఈ నోములో చంద్రారాధన ప్రధానమైంది. అందుకే సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి, రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఫలహారం తీసుకుంటారు. ఈ వ్రతంలో గౌరీదేవికి అట్లు నైవేద్యంగా పెడతారు. నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే మహా ప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెట్టడం వల్ల కుజదోషాలు ఏమైనా ఉంటే పరిహారమవుతాయని చెబుతారు. అంతేకాదు అట్లకు ఉపయోగించే మినుములు రాహువుకూ, బియ్యం చంద్రుడికీ సంబంధించిన ధాన్యాలు. వీటితో చేసిన అట్లను దానం ఇవ్వడం వల్ల ఆయా గ్రహదోషాలు తొలగి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయంటారు. అందుకే అయిదు సంవత్సరాలు దాటిన అమ్మాయిల దగ్గర్నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ ఈ నోమును నోచుకుంటారు. సాక్షాత్తూ ఉమాదేవే ఈ వ్రతం ఆచరించడంతో దీన్ని ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని కూడా అంటారు.
***వ్రత కథ
పూర్వం ఒక రాజకుమారి తన స్నేహితురాళ్లతో కలిసి మంచి భర్తని పొందేందుకు అట్లతద్ది నోముని నోచుకుంది. నోములో భాగంగా ఉపవాసం ఉన్న రాజకుమారి ఆకలికి తాళలేక సాయంవేళకేసొమ్మసిల్లిపోయింది. రాజకుమారి అలా శోషవచ్చి పడి ఉండటాన్ని చూడలేని ఆమె సోదరుడు, చంద్రోదయం అయిపోయిందని నమ్మించి ఆమె ఆహారం తీసుకునేలా చేశాడు. యుక్తవయసు వచ్చిన రాజకుమారికీ ఆమె స్నేహితురాళ్లకీ పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఆ రోజు నోము నోచుకున్న వారందరికీ మంచి భర్తలు లభించగా… రాజకుమారికి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ముసలి వ్యక్తులే వచ్చేవారు. దీంతో విసుగు చెందిన రాజకుమారి అడవులకు వెళ్లి పార్వతీపరమేశ్వరుల కోసం తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన ఆదిదంపతులు ప్రత్యక్షమై జరిగిన లోపాన్ని వివరించి, ఎలాంటి విఘ్నాలూ లేకుండా మళ్లీ వ్రతం చేయమని చెప్పారు. రాజకుమారి మరోసారి శ్రద్ధగా ఆ వ్రతాన్ని ఆచరించడంతో ఆమెకు మంచి భర్త లభించాడు.
పాటల్లో పరమార్థం
అట్లతద్దికి పాడుకునే పాటలు ఇప్పటికీ తెలుగువారి నోళ్లలో నానుతున్నాయి. ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్…’, ‘చెమ్మ చెక్క చారడేసి మొగ్గ… అట్లుపోయంగా ఆరగించంగా…’ మొదలైన పాటలు ఈ వ్రత విధానాన్ని వివరించడంతోపాటు ఆడపిల్లలకు అట్లతద్ది మీద ఉన్న మక్కువనూ తెలియజేస్తున్నాయి.
‘… రాముడంతటివాడె రట్టుపడ్డాడు
మానవులకెట్లమ్మ మాటపడకుండ
దేవిసీతమ్మ కూడ జననిందపడెను
మానవులకెట్లమ్మ మాటపడకుండ..’
… ఇలా, సీతారాములకు కూడా నింద తప్పలేదని తెలుపుతూ, లోకం తీరును
చెబుతుందీ పాట. అంతేకాదు అవతారపురుషులే కష్టాలూ అపనిందలూ మోయాల్సి వచ్చింది మానవమాత్రులం మనమెంత… కష్టాల్ని ఎదుర్కొంటూ, అపవాదుల్ని
తప్పించుకుంటూ ముందుకెళ్లాలన్న మహత్తర సందేశం దాగుంది ఇందులో!
1. దేవతల పాదముద్రలు!
సైన్సుకీ తర్కానికీ అందని ప్రదేశాలూ విశేషాలూ ఈ భూమ్మీద ఎన్నో. లక్షలకొద్దీ వలయాకారాలతో నిండిన నమీబ్ ఎడారి అందులో ఒకటి. సుమారు 2,500 కి.మీ. విస్తీర్ణంలోని అక్కడి గడ్డిమైదానంలో ఎవరో కావాలని గుండ్రని ఆకారం వచ్చేలా గడ్డి పీకినట్లుగా 2 మీటర్ల నుంచి 15 మీటర్ల వ్యాసం వరకూ ఉండే వలయాకారాలు కనిపిస్తాయి. దూరం నుంచి ఏదో తేనెతుట్టె డిజైన్లో కనిపించే ఈ వలయాలను, ఫెయిరీ సర్కిల్స్గా పిలుస్తారు. భారీ కీటకాలేవో ఆ మధ్యలోని గడ్డిని తిని ఉంటాయనేది ఓ వాదనే తప్ప అవి ఎలా ఏర్పడ్డాయనేది ఎవరూ ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అవి నేలలోని రేడియోధార్మిక గుణంవల్ల ఏర్పడ్డ గుంతలనీ… అక్కడి మొక్కల నుంచి కొన్ని విషపదార్థాలు విడుదల కావడంవల్ల ఏర్పడిన ఖాళీలనీ… నేలలో నివసించే చెదపురుగులు నీటిని నిల్వచేసుకునేందుకే అలా చేసి ఉంటాయనీ… ఆ ఎడారి వాతావరణంలో జీవనపోరాటంలో భాగంగా బలహీనమైన మొక్కలు చనిపోయి, బలమైనవి మాత్రమే జీవించి ఉంటాయనీ… ఇలా ఎవరికి తోచినది వారు చెబుతున్నారే కానీ కచ్చితమైన కారణాన్ని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇవేవీ పట్టించుకోని స్థానిక తెగలు మాత్రం అవన్నీ దేవతల పాదముద్రలేనని ఘంటాపథంగా చెప్పేస్తారు. దాంతో ఆ వలయాకారాలు ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయాయి.
2. శుభకరుడు… శయనేశ్వరుడు
హిందూ దేవతలలో శయనం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది విష్ణుమూర్తి. ఆయన శేషాన్ని పాన్పుగా చేసుకుని శయనిస్తాడని, అందుకే ఆయనకు అనంతశయనమూర్తి అని పేరు ఉందని అందరికీ తెలిసిన విషయమే. కానీ సదా యోగముద్రలో, యోగిరూపంలో కనిపించే పరమేశ్వరుడు విగ్రహ రూపంలో కనిపించడమే అరుదు. అందులోనూ శయనించిన భంగిమలో కనిపిస్తే మరీ అరుదు. అటువంటి శివరూపాలలో అరుదైన రూపం మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుజిల్లా దగ్గర సురుటుపల్లిలో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారిని పల్లికొండేశ్వర స్వామి అంటారు. ఇక్కడ అమ్మవారు సర్వమంగలాదేవి మరకతాంబిక అనే పేరుతో నెలకొని వుంది. ఇక్కడ పరమేశ్వరుడు ఒక వైపు ఒరిగి కుడిచేతిని మడిచి తలకింద ఉంచుకొని, తలను అమ్మవారి ఒడిలో ఉంచి విశ్రమిస్తున్న రూపం మనకు గర్భగుడిలో కనిపిస్తుంది. ఈ స్వామి వారి వెనక సూర్యచంద్రులు, దేవతలు ఆయనను సేవిస్తున్నట్లు కనిపిస్తుంది. స్వామివారు సురులతో సేవించబడ్డ పురం కాలక్రమంలో సురుటుపల్లిగా మారిందని క్షేత్ర ఐతిహ్యం.
ఈ స్వామివారి శయనరూపానికి సంబంధించి ఒక పురాణగాథ ఇలా ఉంది.
క్షీరసాగర మథన సమయంలో వెలువడిన విషాన్ని లోకక్షేమం కోసం పరమేశ్వరుడు తన చేతిలో నేరేడుపండు వలే తీసుకుని కంఠంలో దాచుకున్నాడు. ఆ విషప్రభావానికి తాళలేక శివుడు అమ్మవారి ఒడిలో తల ఉంచి కాస్త విశ్రమించాడట. అప్పుడు దేవతలందరూ ఆయన వెనకాల ఉండి శీతలోపచారాలు చేశారట. అదే నేడు మనం చూస్తున్న రూపమని ఈ క్షేత్రపురాణం చెబుతోంది. ఆగమ, శిల్ప శాస్త్రాలలో మరెక్కడా కానరాని శివుడి శయనమూర్తి రూపాన్ని అరుదైనదిగా భావించవచ్చు. కాలకూటవిషాన్ని స్వీకరించిన ఈ స్వామివారిని విషపానమూర్తి, విషాపహరణమూర్తి అని ఆగమ, శిల్పశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రీతిగా ఈ స్వామివారి శయనమూర్తిని, సర్వమంగలాదేవిని దర్శించి భక్తులు సకల శుభాలను పొందగలరనడంలో ఏ సందేహమూ లేదు. అలాగే ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారు సతీసమేతంగా దర్శనమివ్వడం మరో అద్భుతమైన విషయం.
3. అభయ ప్రదాత
కలియుగంలో పెళ్లి కోసం అప్పు చేసిన మొదటివాడు శ్రీనివాసుడేనట. ఈ విషయం మనకు శ్రీ శ్రీనివాస కల్యాణమనే గ్రంథమే చెబుతోంది. పద్మావతీ అమ్మవారిని పెళ్లాడడానికి తన దగ్గర డబ్బులేకపోవడంతో స్వామివారు కుబేరుడి దగ్గర అప్పు చేశారట. కల్యాణం అనంతరం తన దేవేరితో కలిసి తిరుమలకు వెళుతూ, మార్గమధ్యంలో అప్పలాయగుంట వద్ద ఉన్న వేముల పర్వతంపై తపస్సు చేస్తున్న సిద్ధేశ్వర మహర్షి భక్తికి మెచ్చి ఆయనను అనుగ్రహించేందుకు ఆయన వద్దకు వచ్చాడట. తన స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి అప్పు చేసినట్లు మహర్షికి తెలియడంతో ఆయన స్వామివారిని ‘అప్పులాయన’ అని సంబోధిస్తూ, తనను అనుగ్రహించినందుకు గుర్తుగా ఇక్కడే ఉండిపొమ్మని కోరుకున్నాడట. ఆ మహర్షికి అభయమిచ్చిన చోటే వేంకటేశ్వరుడు వెలిశాడట. అక్కడ నీటికుంట ఉండడంతో అప్పులాయనకుంటగా పేరొచ్చిందని కూడా చెబుతారు. నాటి అప్పులాయన కుంటనే నేడు అప్పలాయగుంటగా పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని టీటీడీ ధార్మిక సంస్థ నిర్వహిస్తోంది.
**తిరుమలకే ఎందుకు వెళ్లారు…?
వేంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఎక్కడ ఉండాలనే విషయంపై చర్చ జరిగింది. అప్పుడు అమ్మవారి తండ్రి ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి తిరుమల కొండపై ఒక కుటీరం ఏర్పాటు చేశారని, అందువల్ల స్వామివారు అక్కడ కొలువై ఉన్నారని స్థలపురాణం చెబుతోంది.
**ఆరునెలలు అగస్త్యేశ్వరుని అతిథిగా..
పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత స్వామివారు కాలినడకన తిరుమలకు వెళ్తుండగా మధ్యలో శ్రీనివాసమంగాపురం దగ్గర తొండాపురంలో అగస్త్యేశ్వర స్వామి మందిరానికి వెళ్తాడు. అప్పుడు అగస్త్యేశ్వరుడు వెంకన్న–పద్మావతి దంపతులకు ‘తిరుమలలో 33 కోట్ల మంది రుషులు తపస్సు చేస్తున్నారు. అందువల్ల మీరు ఆర్నెల్లపాటు ఇక్కడే ఉండాలి’ అని చెబుతాడు. దీంతో స్వామి, అమ్మవారు అగస్త్యేశ్వరుడి మందిరంలో ఆర్నెల్లపాటు అతిథులుగా ఉన్నారని చరిత్ర. తదనంతర కాలంలో ఆ కుటీరం వకుళామాత కుటీరంగా పిలువబడుతోంది.
**ఆలయానికి విజయనగర రాజుల బహుమానం…
నాటి విజయనగర రాజ్యస్థాపకులు అప్పలాయగుంట వేంకటేశ్వరుని ఆలయానికి కొన్ని దీపపు స్తంభాలను బహూకరించినట్లు ప్రతీతి. అప్పటి నుంచి ఇప్పటివరకు స్వామివారి సేవలకు ఆ దీపపుస్తంభాలనే వాడుతున్నారు. దీనికితోడు స్వామివారి ఆలయానికి తూర్పుముఖంగా అభయాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు.
**తిరుమలలో లాగే పూజా కైంకర్యాలు..
తిరుమలలో జరిగే నిత్యకైంకర్యాలు, ప్రతి వైఖానస పూజా కార్యక్రమం, అన్ని సేవలు, బ్రహ్మోత్సవాలను కూడా టీటీడీ ఆధ్వర్యంలో అప్పలాయగుంటలో జరుగుతాయి. స్వామివారికి శనివారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు ఊంజల్సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.
**ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోరు..
తిరుమల కొండపై వేలాదిమంది పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ అప్పలాయగుంట అభయహస్తం వేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం పెళ్లిళ్లు చేసుకోరు. చేసుకోవడానికి భక్తులు కూడా ఆసక్తి చూపరు.
**ఎలా వెళ్లాలంటే..
తిరుపతి బస్టాండులో అప్పలాయగుంటకు వెళ్లే బస్సులు ఉన్నాయి. ఆ బస్సు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపం మీదుగా అప్పలాయగుంటకు చేరుకుంటుంది. అలాగే చెన్నై నుంచి వచ్చే భక్తులు పుత్తూరు మండలం సరిహద్దులోని తడుకు ఆర్ఎస్ గ్రామం జాతీయరహదారి నుంచి ఎడమవైపునకు వెళ్తే అప్పలాయగుంట వస్తుంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే ప్రతి బస్సు వడమాలపేట మీదుగా వెళ్తుంది. వడమాలపేట నుంచి ఆటోలో వెళ్లొచ్చు. లేదంటే తడుకు ఆర్ఎస్ గ్రామం వద్ద దిగి అక్కడి నుంచి కూడా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు.
**ఇక్కడి స్వామివారి గొప్పతనం
తిరుమల కంటే ముందే వేంకటేశ్వరుడు అభయహస్తంతో వెలిశారు గనుక ఇక్కడికి వచ్చే భక్తులంతా తమను అప్పుల బాధ నుంచి విముక్తుల్ని చేయాలని వేడుకుంటారు. కొన్నివారాల పాటు అప్పలాయగుంట అభయహస్తం వేంకటేశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. తిరుమలలో వేంకటేశ్వరుడు భక్తుల నుంచి కానుకలు తీసుకుంటాడని, కానీ అప్పలాయగుంట వేంకటేశ్వరుడు మాత్రం భక్తులకు అభయమిస్తాడని నమ్మకం. తిరుమలలో స్వామివారి హస్తం కిందకు ఉంటే.. అప్పలాయగుంటలో స్వామి చేతివేళ్ళు పైకి ఉంటాయి. అందుకే అభయహస్తం వేంకటేశ్వరుడిగా కీర్తింపబడుతున్నారు.
4. మేథకు అందనిది
భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మగా చెప్పబడే అనంతమైన శక్తి నిరాకారమైనది. ఎందుకంటే, పరిమితంగా ఉంటేనే కదా ఆకృతి కనిపించేది. ఎక్కడా అణువంత ఖాళీ లేకుండా విశ్వమంతా నిండి ఉన్న ఆ అనంత శక్తికి పదార్థ లక్షణాలు కానీ, కాంతి, శబ్దం, ఉష్ణం, ఆకర్షణ లాంటి శక్తి రూపాలకుండే లక్షణాలు కానీ ఏవీ లేవు. ఏ పరిమాణాలకూ, కొలతలకూ చిక్కకుండా, నిశ్చలంగా ఉంది. ఆస్టన్రామికల్ యూనిట్, కాంతిసంవత్సరాలు, పార్సెక్ లు, మెగా పార్సెక్ లాంటి ఖగోళదూరాలు కొలిచే ఏ ప్రమాణాలూ ఆ అనంతశక్తిని ఇసుమంత కూడా కొలవలేవంటే అతిశయోక్తికాదు.అంతటి శక్తిలోనుండే ఈ దృశ్యమాన ప్రపంచం పుట్టుతూ, గిట్టుతూ ఉంది. ఒక ప్రాంత జనాభా ఏవిధంగాౖ నయితే స్థిరంగా ఉండదో, అదేవిధంగా ఈ దృశ్యమాన ప్రపంచంలో ఖగోళ పదార్థాల సంఖ్యా స్థిరంగా ఉండదు. ఒక గ్యాలక్సీ పుట్టి, ఎదిగి, మళ్లీ ఆ అనంతశక్తిలో కలిసిపోయే లోపల మరెన్నో గ్యాలక్సీలు ఎక్కడెక్కడో రూపుదిద్దుకుంటూనే ఉంటాయి. ఈ ప్రక్రియ నిరంతర స్రవంతి. తనలో తాను, తనంత తానుగా పరిణామం చెందుతూ స్థిరంగా ఉండటమే వైచిత్రి.అట్టి ఆత్మను సందర్శించడం ఒక యోగం. యోగం అంటే కలయిక. ఆత్మతో అభేదాన్ని సాధిస్తేనే సందర్శించినట్టు. అణువణువూ నిండి ఉన్న అనంత శక్తిని అనుభవించడం ఒక ఉత్కృష్ట మానసిక స్థితి. భగవద్గీతలో కేవలపదార్థ రూపాన్నే అర్జునుడు దర్శించాడు. అంతకుమించిన జ్ఞానమార్గంలో శోధిస్తేనే మనం భగవంతుని లేదా ఆత్మను లేదా అనంత శక్తిని సందర్శించగలము. ఈ సందర్శన ఇంద్రియాలైన కన్నుల ద్వారానో, చెవుల ద్వారానో, స్పర్శ ద్వారానో, వాసన ద్వారానో, రుచిద్వారానో కాదు. మనసు ద్వారా మాత్రమే సందర్శించడమౌతుంది. వేరే మార్గం లేదు. కేవలం మనసు మాత్రమే సరిపోతుందా అంటే అదీ సరిపోదు. ఆ మనసుకు జ్ఞానసహిత మేథస్సు పునాది అయి ఉండాలి. హేతువు ఆ మేథస్సుకు ఆలంబన కావాలి. బలమైన, స్థిరమైన, విస్తృతమైన మనసును సాధించిన సాధకుడు మాత్రమే ఆత్మ సందర్శనకు అర్హుడు ఔతాడు. ఆ ఆత్మ లేక అనంత శక్తిని దృఢమైన మనసు నిండా నింపుకోవాలి. అంతటి అనంతశక్తిని మనసులో ఎలా కుదించుకోగలమనేది ప్రశ్న.మనసుకు గొప్ప లక్షణాలు ఉన్నాయి. అది ఎక్కడికైనా పోగలదు, ఎంతైనా విస్తరించగలదు, దేన్నైనా సొంతం చేసుకోగలదు. ఈ గొప్ప లక్షణాలతోనే ఆ సర్వాంతర్యామిని సందర్శించాలి. మనసుతోనే తపించాలి. ఆ తపనయే నవవిధ భక్తులలో చివరిది, ఉతృష్టమైన ఆత్మనివేదనం. ఈ ఆత్మ నివేదనం బలమైన మనసులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ స్థితిలో సాధకునికి, అనంత శక్తి భేదం ఉండదు. అట్టి ఆత్మకు, సాధకుని రూపంలో ఉన్న చైతన్య పదార్థానికి అభేదం నెలకొల్పబడుతుంది. అప్పుడే సాధకుని లోపల భగవంతుడు పొసగగలుగుతాడు. ఇక సాధకునికి భగవంతుని వినా అన్యమైనది ఏదీ ఉండదు. ఈ విధంగా అంతటి ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుని, నిలుపుకోవడం ఎంతో కష్టం. సాధకుని మనస్సు ఎంతో దృఢమైనదై, నిశ్చలమైనదై ఉండాలి. ఎందుకంటే, మనసులో ఏకాగ్రత, బలీయమైన తపన లేనప్పుడు ఆ ఆత్మ మనసుకు చిక్కదు. అంతే కాకుండా ఆత్మ స్వరూపాన్ని హృదయాంతరాలలో నింపుకోవడం అత్యంత ఆనందదాయకం. ఆ ఆనందాన్ని భరించాలంటే సాధారణ మనసుకు సాధ్యం కాదు. ఆ ఆనందస్థితి చూసేవారికి విచిత్రం. అనుభవించే వారికి అనుపమాన అనుభూతి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com