Business

47వేల మార్కును దాటిన సెన్సెక్స్-వాణిజ్యం

47వేల మార్కును దాటిన సెన్సెక్స్-వాణిజ్యం

* దేశీయ వాహన తయారీ కంపెనీలు కొత్త సంవత్సరం వేళ ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫోర్డ్‌ కంపెనీలు జనవరి 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో రెనో, ఎంజీ మోటార్స్‌ ఇండియా కూడా చేరాయి.

* దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఐటీ, ఫార్మా రంగ షేర్లు రాణించడంతో ఇంట్రాడే నష్టాలను అధిగమించాయి. దీంతో ఆరో రోజూ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 13,750 పైన ముగిసింది.

* రిటైల్‌ నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో (3, 4 త్రైమాసికాల్లో) అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి మళ్లీ కొవిడ్‌ పూర్వ స్థితికి చేరుకుంటాయని తెలిపింది. కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో వివిధ సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలకు దిగడంతో రిటైల్‌ రుణ చెల్లింపుల సామర్థ్యం తగ్గిందని యాక్సిస్‌ బ్యాంక్‌ రిటైల్‌ రుణాల విభాగాధిపతి సుమిత్‌ బాలి వెల్లడించారు. ‘నెలవారీగా రుణ చెల్లింపులు మెరుగవుతున్నాయి. అయినా ప్రస్తుత, మార్చి త్రైమాసికాల్లో రిటైల్‌ ఎన్‌పీఏలు అధికంగా నమోదు కావచ్చు. 2021 ఏప్రిల్‌ నుంచి ఇవి మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంద’ని ఆయన వివరించారు. ‘గత సెప్టెంబరు వరకు రుణ మారటోరియం సదుపాయం ఉండటంతో చాలా మంది రుణ గ్రహీతలు దాన్ని వినియోగించుకున్నారు. అక్టోబరు నుంచి రుణ చెల్లింపులు చేస్తున్నారు. అయితే అధిక శాతం మంది రుణ పునర్నిర్మాణానికి (లోన్‌ రీస్ట్రక్చరింగ్‌) దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ గవాక్షం (విండో) డిసెంబరు 31 వరకు తెరిచి ఉండటంతో ఈ నెలాఖరుకు సమగ్ర వివరాలు తెలుస్తాయి. కొత్త రుణాలకొస్తే కొవిడ్‌ పూర్వ స్థితికి చేరుకున్నాం. అయితే రిస్కు ఎక్కువగా ఉన్న క్రెడిట్‌ కార్డులపై జారీ చేసే రుణాల సామర్థ్యం 60-70 శాతంగానే ఉంద’ని సుమిత్‌ తెలిపారు.

* వచ్చే 5 ఏళ్లలో నైపుణ్యాభివృద్ధి (స్కిల్‌ డెవలప్‌మెంట్‌) కార్యక్రమంలో భాగంగా మరో 5 లక్షల మంది యువతకు శిక్షణ అందించబోతున్నామని మహీంద్రా గ్రూప్‌ వెల్లడించింది. గత 15 ఏళ్లుగా ఈ గ్రూప్‌ యువతకు శిక్షణ ఇస్తూ వస్తోంది. ఇప్పటికే మహీంద్రా ప్రైడ్‌ స్కూల్స్‌ అండ్‌ క్లాస్‌రూమ్‌ల ద్వారా 5 లక్షల మందికి శిక్షణ అందించింది. ఇందులో లక్ష మందికి ఉద్యోగాల్ని కూడా సృష్టించింది. సమాజంలోని బలహీన వర్గాల యువతలోని నైపుణ్యాలకు పదును పెట్టే ఉద్దేశంతోనే 2005లో మహీంద్రా ప్రైడ్‌ స్కూల్‌ను (ఎంపీఎస్‌) సంస్థ ప్రారంభించింది. మహీంద్రా గ్రూప్‌ తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో (సీఎస్‌ఆర్‌) భాగంగా ఎంపీఎస్‌ను మొదలుపెట్టి, దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది. కొన్నేళ్లుగా హైదరాబాద్‌, చెన్నై, పుణె, చండీగఢ్‌, శ్రీనగర్‌, పట్నా, వారణాసి తదితర ప్రాంతాలకు ఎంపీఎస్‌ విస్తరించింది. సామాజికంగా అనుకూల పరిస్థితులు లేని 18-25 ఏళ్ల యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి చూపిస్తోంది. ఇటీవల కరోనా మహమ్మారి సృష్టించిన ఆటంకాలతో నాంది ఫౌండేషన్‌తో కలిసి మహీంద్రా గ్రూప్‌ సాంకేతికతకు (టెక్నాలజీ) తోడుగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఇ-కామర్స్‌, సేవలు, ఎంటర్‌ప్రెన్యూర్‌ వంటి కొత్త రంగాల్లోనూ నైపుణ్య శిక్షణ ప్రారంభించింది. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా మరో లక్ష మందికి ఉద్యోగాల్ని సృష్టించే లక్ష్యంతో పని చేస్తున్నామని మహీంద్రా గ్రూప్‌ వెల్లడించింది. అలాగే ‘ది జాబ్‌ ఫ్యాక్టరీ’ పేరుతో ఈ స్కూల్‌లో శిక్షణ పొందిన 75 మంది విశేషాలతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఊగిసలాట ధోరణలో ఉన్నాయి. ఉదయం సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్‌ 47వేల మార్కును దాటింది. అయితే లాభాలతో ట్రేడింగ్‌ను మొదలు పెట్టిన సూచీలు ఆ తర్వాత స్వల్ప నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.31 సమయంలో సెన్సెక్స్‌ 16 పాయింట్ల నష్టంతో 46,874 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 13,733 వద్ద కొనసాగుతున్నాయి.