నన్ను కూడా వేధించారు

‘మీటూ’ ఉద్యమం ద్వారా చిత్ర పరిశ్రమలో తమకు ఎదురైన వేధింపులను బయటపెట్టడానికి ఆర్టిస్టులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. సినీ కెరీర్‌ ఆరంభంలో తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని నటి సంజన అన్నారు. ఆమె 12 ఏళ్ల క్రితం కన్నడ చిత్రం ‘గండ హెందథి’ సినిమాతో నటిగా పరిచయం అయ్యారు. హిందీ సినిమా ‘మర్డర్‌’కు రీమేక్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో దర్శకుడు తనతో అనవసరమైన సన్నివేశాల్లో నటించేలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ట్వీట్లు చేశారు. ‘‘ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమం నడుస్తోంది. ఓ సామాజిక కార్యకర్తగా నా తొలి సినిమా సమయంలో నేను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పాలని నిర్ణయించుకున్నా. సినిమాలో కేవలం ఒక్క ముద్దు సన్నివేశం ఉంటుందని దర్శకుడు ప్రామిస్‌ చేశారు. కానీ, మూడు రోజులు షూటింగ్‌ జరిగిన తర్వాత ఇంకొన్ని రోజులు ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించాల్సి ఉంది అన్నారు. ముద్దు సన్నివేశం అయిపోయింది కదా అని నేను దర్శకుడితో అన్నాను. ఆయన నాపై కోపం తెచ్చుకున్నారు. ‘ఏది అయిపోయిందో, ఏది అయిపోలేదో.. నువ్వు నాకు చెబుతున్నావా. నువ్వు కొత్త నటివి. నీకు దర్శకుడ్ని ఎలా గౌరవించాలో తెలియదు’ అని అరిచారు. ముద్దు సన్నివేశంలో నటించాల్సిందేనని బలవంతం చేశారు, అలానే షూట్‌ చేశారు. ఆ సన్నివేశంలో నటించాలని నన్ను బెదిరించారు, వేధించారు. సినిమా విడుదలైన తర్వాత నేనే కావాలని అలాంటి సన్నివేశాల్లో నటించానని ప్రజలు అనుకున్నారు. దాని వెనుక ఉన్న నిజం వారికి తెలియదు. నేను నటిగా కెరీర్‌ ప్రారంభించినప్పుడు వయసులో చిన్నదాన్ని. ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడితే అవకాశాలు రావని నాకు తెలుసు. ఇప్పుడు ప్రజలకు నేను బాగా తెలుసు. ఒకరు నన్ను నటిగా కాదన్నా.. పిలిచి అవకాశం ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. అవకాశాలు దక్కడం అనేది మన నైపుణ్యం మీదే ఆధారపడి ఉంటుంది. నటీమణులు ‘కోపరేట్‌’ చేశారని దర్శకులు వారికి అవకాశాలు ఇవ్వరు.. నైపుణ్యం, ప్రతిభ ఉంటేనే తీసుకుంటారు’’ అని ఆమె అన్నారు. అనంతరం సినీ పరిశ్రమను విమర్శిస్తున్న వారిపై సంజన మండిపడ్డారు. ‘దక్షిణ చిత్ర పరిశ్రమలో నేను మొత్తం 45 సినిమాల్లో నటించా. చిత్ర పరిశ్రమ నటీమణులకు చాలా సురక్షితమైన ప్రదేశం. ఇది స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేందుకు.. గుర్తింపు పొందేందుకు తోడ్పడుతుంది. నీకు నిజంగా నైపుణ్యం ఉంటే దాన్ని నిరూపించుకో. చెడ్డవారు కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే లేరు.. ప్రతి రంగంలోనూ ఉన్నారు. కొందరి వల్ల మొత్తం చిత్ర పరిశ్రమను నిందించడం సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com