ధోనికి భాజాపా టికెట్!

మహేంద్ర సింగ్‌ ధోనీ, గౌతమ్‌ గంభీర్‌. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న క్రికెట్‌ హీరోలు. ఒకరు ప్రశాంతతకు, మరొకరు దూకుడుకు పెట్టింది పేరు. వీరిద్దరూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేయనున్నారని ఇంటర్నెట్లో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. గంభీర్‌ జన్మస్థలం దిల్లీ. ప్రస్తుతం ఆ రాష్ట్ర జట్టుకు అతడే సారథ్యం వహిస్తున్నాడు. ఈ మధ్యే జరిగిన విజయ్‌ హజారేలో దిల్లీని ఫైనల్‌కు చేర్చాడు. సామాజిక కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొంటున్నాడు. సైన్యం, కాల్పులు, దేశభక్తి అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తాడు. కొంతకాలం ముందు మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తున్నాడు. ప్రస్తుతం న్యూదిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి పనితీరుపై పార్టీ వర్గాలు, అనుచరులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో 2019లో గౌతీని ఆమె బదులు పోటీ చేయించాలని భాజపా కసరత్తు చేస్తోందని వార్తలు వ్యాపిస్తున్నాయి. మరో సంచలనం ఏమిటంటే ‘మిస్టర్‌ కూల్’ ధోనీని ఝార్ఖండ్‌ నుంచి పోటీ చేయించాలని భాజపా ప్రయత్నాలు మొదలు పెట్టిందట! అటు ఉత్తరాదిలో, ఇటు దక్షిణాదిలో ధోనీకి భారీ అభిమాన గణం ఉంది. అతడిని మైదానంలో వీక్షించేందుకు అభిమానులు ఎక్కడికైనా తండోపతండాలుగా వస్తారు. అతడి పేరు, ప్రతిష్ఠలను దృష్టిలో ఉంచుకున్న భాజపా ధోనీతో వరుస చర్చలు జరుపుతోందని వినికిడి. ఇంటర్నెట్లో వస్తున్న ఈ వార్తల్లో నిజానిజాలు పరిశీలిస్తే ధోనీ ఎన్నికల్లో పోటీ చేయడం అసంభవమే అనిపిస్తోంది. 2019 ఎన్నికల సందడి మేలో మొదలవుతుంది. అదే సమయంలో ధోనీ ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్‌ కోసం వెళ్లనున్నాడు. కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌గా భావిస్తున్న మహీ తన కలను వదిలేసి రాజకీయాల్లో చేరడం కష్టమే! అంతకు ముందు వీరేంద్ర సెహ్వాగ్ ‌పైనా ఇలాంటి కథనాలే వచ్చాయి. ఏ సందర్భంలోనూ తనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టు వీరూ చెప్పలేదు. ఇక గంభీర్‌ సైతం ప్రస్తుతం ఆటను ఆస్వాదిస్తున్నాడు. సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాడు. చాలా విషయాల్లో రాజకీయాల పార్టీలను తీవ్రంగా విమర్శిస్తాడు. అలాంటప్పుడు గౌతీ భాజపాలో చేరడం గురించి స్పష్టంగా చెప్పలేం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com