కోమాలో ఉన్నావా?

బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా నటి రాఖీ సావంత్‌పై పరువు నష్టం దావా వేశారు. నటుడు నానా పటేకర్‌పై‌ తనుశ్రీ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని రాఖీ సావంత్‌ తాజాగా అన్నారు. కేవలం పబ్లిసిటీ కోసం తనుశ్రీ ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక గీతంలో నటిస్తున్న సమయంలో ఆయన తన చేయి లాగారని ఆమె ఆరోపించారు. దీంతో పాట నుంచి తప్పుకున్నందుకు పటేకర్‌ అనుచరులు తన కారుపై దాడి చేశారని తెలిపారు. తర్వాత తనుశ్రీ నటించాల్సిన ప్రత్యేక గీతంలో రాఖీ సావంత్‌ను తీసుకున్నారు. తాజాగా తనుశ్రీను ఉద్దేశించి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ సావంత్‌ మాట్లాడారు. ‘నానా పటేకర్‌, గణేశ్‌ ఆచార్యపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. తనుశ్రీకి పిచ్చి పట్టింది. ఆమె గత పదేళ్లుగా కోమాలో ఉంది. ఈ మధ్యే కోమా నుంచి బయటికి వచ్చింది. నాకు మహిళలపై గౌరవం ఉంది, వారి గురించి తప్పుగా మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చిన తనుశ్రీ అవకాశాలు లేక.. డబ్బుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. అందుకే నానా పటేకర్‌ను తప్పుపడుతోంది. ఆమె గతం గురించి చెబుతోంది. అప్పుడు నిజంగా ఏం జరగలేదు. మీరు పాటలో గమనిస్తే పటేకర్‌ నన్ను ఒక్కసారి కూడా ముట్టుకోలేదు’ అని ఆమె అన్నారు. రాఖీ సావంత్‌ వ్యాఖ్యలపై తనుశ్రీ మండిపడ్డారు. ఆమెపై రూ.10 కోట్లు పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు ఆమె న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ‘తనుశ్రీ వ్యక్తిత్వం, పేరును దెబ్బతీసేలా మాట్లాడిన రాఖీ సావంత్‌పై క్రిమినల్‌, పౌర పరువునష్టం కేసు పెట్టాం’ అని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com