Devotional

మల్లన్నకు మూడు కోట్లకు పైగా కానుకలు

Srisaila Mallikharjuna Gets 3.14Crores In Hundi Revenue

భూ కైలాస క్షేత్రం శ్రీశైలంలో మళ్లీ పూర్వపు సందడి నెలకొంటోంది. భక్తుల రాక పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. కరోనా లక్డౌన్ వల్ల ఆలయ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితి నుండి క్రమంగా కోలుకుని పుంజుకుంటోంది. దీనికి నిదర్శనం కార్తీక మాస హుండీ ఆదాయంగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసంలో కేవలం 21 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా రికార్డు స్థాయిలో రూ.3.61 కోట్ల ఆదాయం వచ్చింది.దేవస్థానం ఈవో కె.ఎస్ రామారావు ఆధ్వర్యంలో.. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘా మధ్య నిన్న హుండీ ఆదాయం లెక్కింపు చేపట్టడం జరిగింది. అక్క మహాదేవి అలంకార మండపంలో దాదాపు 200 మంది సిబ్బందితో పాటు.. మహిళా వాలంటీర్లు, భక్తులు కలసి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏకబిగిన 12 గంటలపాటు శ్రమించి లెక్కించారు. ఆభరణాలు.. చీరె సారెల వంటి కానుకలతోపాటు.. నగదు ను వేర్వేరుగా చేసి లెక్కించారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ లెక్కింపు జరిపారు. ఉభయ దేవాలయాల హుండీల ద్వారా దేవస్థానానికి రూ.3 కోట్ల 61 లక్షల 34 వేల 86 రూపాయలు నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 21 రోజులలో సమర్పించినదే. అలాగే నగదుతో పాటు 262 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారు, 6 కేజీల 165 గ్రాముల వెండి ఆభరణాలు కూడా హుండీలలో లభించాయి. వీటితోపాటు 160 యు ఎస్ ఏ డాలర్లు, 141 సౌదీ రియాల్స్, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 2 కత్తార్ రియాల్స్, 10 సౌత్ ఆఫ్రికా రాండ్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి. గత ఏడాది కార్తీక మాసం కంటే ఈసారి ఎక్కువగానే హుండీ ఆదాయం లభించడంతో దేవాదాయ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.