Food

ఫ్రీజర్‌లో చేయి పెడితే…చలి తగలాలి…తడి కాదు

How to properly store food in refrigerators

మనమందరం రకరకాల ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో దాచుకుంటాం. ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడ సూక్ష్మజీవులు పెరగడానికి అవకాశమే లేదని అనుకుంటాం. నిజానికి అక్కడ కూడా సాల్మొనెల్లా అనే ఓ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఎక్కువే. సాధారణంగా మాంసాహారం నిల్వ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్‌లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ఆహారపదార్థాలను బాగా వేడిచేయకుండా తిన్నప్పుడు కొందరిలో నీళ్ల విరేచనాలతో పాటు డీ–హైడ్రేషన్‌ ముప్పు తప్పదు. అందుకే ఫ్రిజ్‌ను సైతం ఆరోగ్యకరంగా ఉండేలా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రిజ్‌లో ఆహారపదార్థాలు దాచుకునే క్రమంలో ఫ్రిజ్‌ హైజీన్‌ కూడా అవసరమే ఇందుకోసం మనం అందులో మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నిలువ చేసుకునే సమయంలో అవన్నీ వేర్వేరుగానూ, హానికరం కాని ప్యాకింగ్‌ మెటీరియల్‌తో ప్యాక్‌ చేసి పెట్టుకోవాలి. మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్‌ లాంటి మాంసాన్ని (రా–మీట్‌ను) దేనికదే విడివిడిగా ప్యాక్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక మాంసాహారం మరో మాంసాహారంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవకూడదు. ఫ్రిజ్‌లోంచి తీసిన ఆహార పదార్థాలను పచ్చిపచ్చిగా ఉన్నవాటిని సాధ్యమైంతగా రా–ఫుడ్‌ రూపంలో తినకపోవడమే మేలు. ఇక ఆకుకూరలూ, కాయగూరలను తగిన ఉష్ణోగ్రత వద్ద సరిగ్గా ఉడికాకే తినాలి. ఫ్రిజ్‌ నుంచి తీసిన మాంసాహారాన్ని తప్పనిసరిగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించేలా తప్పక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా లేదా ఈ–కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి. మాంసాహారం తినేవారు దాన్ని సరిగ్గా ఉడికించాక (ప్రాపర్లీ కుక్‌డ్‌ ఫుడ్‌) మాత్రమే తినాలి. డీప్‌ ఫ్రీజర్‌ భాగంలో అర చేయి పెట్టి చూసినప్పుడు అది బాగా చల్లగా తగలాలే తప్ప… బాగా తడితడిగా చిత్తడిగా తగలకూడదు. అలా చిత్తడిగా ఉందంటే అక్కడ తగిన ఉష్ణోగ్రత నిర్వహితం (మెయింటెయిన్‌) కావడం లేదని అర్థం. ఫ్రిజ్‌లో తగిన చల్లదనం / ఉష్ణోగ్రత లేకపోతే దాని పనితీరు బాగాలేదని గ్రహించి, ఫ్రిజ్‌ రిపేర్‌ చేసేవారితో దాన్ని తప్పక బాగు (రిపేర్‌) చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఫ్రిజ్‌ను నెలకొకసారో లేదా రెణ్ణెల్లకొకసారో… ఇలా నిర్ణీత సమయంలో తప్పక శుభ్రం చేసుకుంటూ ఉండాలి.