DailyDose

తునిలో కంటైనర్ లారీ బీభత్సం-నేరవార్తలు

Container Truck In Tuni Kills Two Kids - Crime News

* ద్విచక్ర వాహనాన్ని కంటైనర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తునిలో ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారులను ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దుర్గ (10), తాతాజీ(15) అక్కడికక్కడే మృతిచెందారు. బాధితులు విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన వారిగా గుర్తించారు. కాగా, ప్రమాదం నుంచి చిన్నారుల తండ్రి బయటపడ్డాడు.

* హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధి వినాయకనగర్‌లో తెరాస మహిళా నాయకురాలు చైతన్య రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని ఫర్నీచర్‌ ధ్వంసం చేసి విచక్షణారహితంగా కొట్టారని చైతన్యరెడ్డి ఆరోపించారు. దుండగులు తన మీద డైనింగ్‌ టేబుల్‌ గ్లాసును ఎత్తేసేందుకు ప్రయత్నించగా పక్కకు తప్పుకొన్నానని, అనంతరం గొంతునులిమేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా నాయకులే దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో చైతన్యరెడ్డికి గాయాలు కాగా ఆమెను ఆసుపత్రికి తరలించారు.

* భర్త, అతని స్నేహితులతో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ ఓ గృహిణి గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏటీ అగ్రహారానికి చెందిన ఓ మహిళతో బెంగళూరుకు చెందిన వ్యక్తికి ఏడేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య స్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. కొద్దిరోజుల కిందట అతను గుంటూరు వచ్చినట్లు తెలుసుకున్న సదరు మహిళ బంధువులు వెళ్లి అతనితో మాట్లాడే క్రమంలో గొడవ జరిగింది. దీంతో తనపై దాడిచేశారంటూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ఈనెల 17న సదరు మహిళ కాపురానికి తీసుకు వెళ్లాలని అడగడానికి తన భర్త వద్దకు వెళ్లగా అక్కడ మద్యం తాగుతున్న భర్త, తన స్నేహితులతో కలిసి సామూహికంగా తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

* నగరంలోని నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ఓ హోటల్‌ ముందు నిలుచున్న సెక్యూరిటీ గార్డుని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా సమీపంలో పార్కింగ్‌ చేసిన కొన్ని ద్విచక్ర వాహనాలపైకీ దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన అశ్విన్‌ (22) అనే యువకుడు నాంపల్లి రెడ్‌హిల్స్‌ మీదుగా బేగంపేట వైపునకు వేగంగా వెళ్తున్నాడు. రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్‌ హోటల్‌ వద్దకు వచ్చే సరికి కారు అదుపుతప్పింది.

* ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల జలాశయంలో దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు అందులో దిగి మునిగిపోయారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 8 మంది స్నేహితుల బృందం పులిగుండాల ప్రాజెక్టు వద్దకు వెళ్లింది. వీరిలో ఐదుగురు ఈతకు దిగారు. నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దర్ని స్థానికులు రక్షించగా.. మిగతా ముగ్గురు జంగా గుణ (24), శీలం చలపతి (25), వేమిరెడ్డి సాయి (25) గల్లంతయ్యారు.