పత్తి నుంచి నూలును పట్టు పురుగుల నుంచి పట్టుని తయారుచేయడం అందరికీ తెలిసిందే. ఈ మధ్యే అరటి లాంటి మొక్కల నుంచి కూడా నూలును తీసి వాడుతున్నారు. అయితే తరతరాలుగా వాడుకలో ఉన్నా ప్రచారం లేని లోటస్ సిల్క్ ఇప్పుడు తాజాగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. అవును… తామర తూళ్లనుంచీ తీసే దారం మన్నికలోనూ ధరలోనూ ప్రత్యేకతను చాటుతోంది.
పట్టు పురుగుల్ని చంపనక్కర లేకుండా పట్టు వస్త్రం తయారీకి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న నేటి తరానికి సంప్రదాయ లోటస్ సిల్క్ బాగా నచ్చేసింది. ‘వీగన్ సిల్క్’ అంటూ ముచ్చటపడిపోతూ స్కార్ఫ్లూ శాలువాల్లా వాడడమే కాదు, కోటూ, జాకెట్లానూ కుట్టించుకుంటున్నారు. తామర తూళ్లనుంచి దారం తీసి పట్టు వస్త్రాలను నేసే విధానం చాలా శ్రమతో కూడుకున్నది కావడంతో కొందరు మాత్రమే లోటస్ పట్టుని
తయారుచేసేవారు ఒకప్పుడు. మయన్మార్, కంబోడియా, వియత్నాం లాంటి కొన్ని ఆసియా దేశాల్లోని మారుమూల ప్రాంతాలకు పరిమితమైన లోటస్ సిల్క్ ఇప్పుడు మనదేశంలోనూ తయారవుతోంది.
***పట్టు పల్లె!
మయన్మార్‌లోని ఇన్పా ఖోన్ లోటస్ పట్టు తయారీకి పేరొందిన ఏకైక గ్రామం. ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే ఉండే తామర పంట నుంచి పట్టు తయారు చేయడానికి వీలుగా అక్కడి
సంప్రదాయ నేత పనివారు సరస్సులోనే ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. కంబోడియా, వియత్నాంలలోనూ పదుల సంఖ్యలో కుటుంబాలు ఈ పట్టుని నేస్తాయి. పర్యటకులు ఆ వస్త్రాలను కొంటున్నారు. శ్రమ తప్ప పెట్టుబడి అవసరం లేనీ, పర్యావరణానికి హాని చేయనీ లోటస్ పట్టుకి ఆదరణ పెంచితే యువతకి ఉపాధి కల్పించవచ్చని భావించిన వియత్నాంకి చెందిన ఫాన్ తి తువాన్ అనే మహిళ ఈ పట్టు తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలెట్టింది. పలు పెద్ద పెద్ద ఫ్యాషన్ బ్రాండ్లు ఆమె దగ్గర లోటస్ సిల్క్ కొని డిజైనర్ దుస్తులు తయారుచేస్తున్నాయి. ఆ వార్తలు చూసి స్ఫూర్తి పొందింది మనదేశంలో మణిపూర్‌కి చెందిన బిజయశాంతి తొంగ్బ్రాం. బోటనీ చదివిన బిజయశాంతి తమ రాష్ట్రంలోనూ గింజల కోసం తామర పండించడం ఎక్కువే కాబట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తామరతూళ్ల నుంచి పట్టు తయారుచేయడం నేర్చుకుంది. మూడేళ్ల క్రితమే లోటస్ సిల్క్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. వీళ్లు తయారు చేసిన వస్త్రాన్ని జర్మనీకి చెందిన ఓ ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్‌కి అమ్ముతున్నారు. లోటస్ సిల్క్‌తో తయారైన దుస్తులు ఆన్లైన్లో డిజైనర్ దుస్తులు అమ్మే వెబ్సైట్లలో అందు బాటులో ఉన్నాయి. మెడకు చుట్టుకునే మెత్తటి స్కార్ఫ్ రూ.15 వేల వరకు ఉంటే, షర్ట్ మీద వేసుకునే కోటు ధర దాదాపు రెండు లక్షలు పలుకుతోంది. అరుదైన ఈ వస్త్రానికి ఆ మాత్రం ధర ఉండటంలో తప్పులేదంటున్నారు అభిమానులు.
***ధర పదిరెట్లు
గింజలు సేకరించాక వృథాగా పడేసే తామర కాడల నుంచి ఈ పట్టుని తయారుచేయడానికి చాలా ఓపిక కావాలి. ఏ రోజు కోసిన కాడల నుంచి ఆరోజే దారాలు తీయాలి. అలా ఒక్కొక్కరూ రోజుకు 250 కాడలను మాత్రమే తీయగలుగుతారు. కాడని మధ్యకి విరిచి నెమ్మదిగా లాగితే దారాలు సాగుతూ వస్తాయి. వచ్చినంత పొడుగూ తీసి పలు పొరలుగా ఉన్న వాటిని ఒక దారంగా పేని ఆరబెడతారు. తర్వాత అవసరమైతే రంగులేసి మగ్గంపై వస్త్రంగా నేస్తారు. పావు మీటరు వెడల్పు, ఒకటిన్నర మీటరు పొడవు ఉండే స్కార్ఫ్‌ని నేయడానికి దాదాపు వెయ్యి తామరతూళ్ల దారం కావాలి. ఒక మనిషి రెండు నెలల పాటు శ్రమిస్తే ఒక స్కార్ఫ్ తయారవుతుంది. అందుకే దీని ధర మామూలు పట్టు స్కార్ఫ్ కన్నా పదిరెట్లు ఎక్కువ.
సంప్రదాయ పట్టులా మెరవదు కానీ మృదువుగా, హుందాగా, వెచ్చగా ఉంటుంది. నలిగిపోకుండానూ తేలిగ్గానూ ఉండి ఎలా కావాలంటే అలా ఒదిగిపోతుంది. అందుకే లోటస్ సిల్క్ ఈ తరానికి నచ్చేస్తోంది అంటున్నారు దీని తయారీదారులు!
లోటస్ సిల్క్ గురించి విన్నారా?
Related tags :