ఆన్‌లైన్ కాల్‌మనీ వెనుక చైనా ముఠాలు ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. దిల్లీలో ఐదుగురు, హైదరాబాద్‌లో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని మంగళవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. హైదరాబాద్, దిల్లీ, గురుగ్రామ్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నాలుగైదు నెలల క్రితం పక్కా ప్రణాళికతో రుణాలిచ్చే యాప్‌ల సేవలు మొదలయ్యాయి. నగరంలో బేగంపేట, పంజాగుట్ట ప్రాంతాల్లో మూడు కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 600 మంది టెలీకాలర్స్ 30 రుణయాప్‌ల కోసం పని చేస్తున్నారు. గురుగ్రామ్‌లో 500 మంది ఉద్యోగులున్నారు. ఇండోనేషియా, చైనా, తదితర దేశాలకు చెందిన సంస్థల ద్వారా యాప్‌లను నిర్వహిస్తున్నారు. దిల్లీ కాల్‌సెంటర్‌లో తనిఖీల్లో చైనాకు చెందిన ఒక వ్యక్తి పాస్‌పోర్టు జిరాక్స్ లభించిందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. సీసీఎస్ పోలీసులు దిల్లీ, హైదరాబాద్‌లలో చేపట్టిన దాడుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ పోలీసులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా ఇద్దరు డైరెక్టర్లు, మరో ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేశారు. రెండు సంస్థలకు సంబంధించిన 18 ఖాతాలను (రూ.1.52 కోట్లు) స్తంభింపజేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం ‘క్యాష్ మామా’ అనే రుణ యాప్ నిర్వాహకులు డబ్బు తిరిగి చెల్లించినా.. ఇంకా కట్టాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ బాధితుడు ఈ నెల 8న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్స్ ఏసీపీ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. రాయదుర్గంలోని ఓ బహుళ అంతస్తుల అద్దె భవనంలో కొనసాగుతున్న ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. మూడు యాప్‌లు ‘క్యాష్ మామా’, ‘ధనాధన్ లోన్’, ‘లోన్ జోన్’ నుంచి ఇప్పటి వరకు 1.5 లక్షల మంది రుణాలు తీసుకున్నట్లు తేలింది. వీరిలో 70 వేల మంది తరచూ రుణాలు తీసుకుంటున్నారు. కోకాపేటకు చెందిన సీఈవో శరత్‌చంద్ర, డైరెక్టర్లు పుష్పలత, వాసవ చైతన్య, కలెక్షన్ ఏజెంట్లు బి.వెంకటేష్, సచిన్ దేశ్‌ముఖ్, టీం లీడర్ సయ్యద్ ఆశిక్‌ను అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడు శరత్‌చంద్ర(40) ‘క్యాష్‌మామా’, ‘లోన్‌జోన్’, ‘ధనాధన్ లోన్’, ‘క్యాష్ అప్’, ‘క్యాష్ బస్’, ‘మేరా లోన్’, ‘క్యాష్ జోన్’ పేరిట యాప్‌లను రూపొందించాడు. ‘క్యాష్ బస్’, ‘క్యాష్ అప్’ యాప్‌లను దిల్లీకి చెందిన ఏషియా ఇన్నో నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించాడు. మరో రెండు యాప్‌లు (మేరా లోన్, క్యాష్ జోన్)ను బెంగళూరుకు చెందిన బ్లూషీల్డ్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమ్మాడు. ‘క్యాష్ మామా’ను ఆనియన్ క్రెడిట్ కంపెనీకి, ‘ధనాధన్ లోన్’, ‘లోన్ జోన్’ యాప్‌లను క్రెడ్‌ఫాక్స్ టెక్నాలజీస్‌కు లింక్ చేశాడు.
ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ కంపెనీలకు లింక్ చేసిన మూడు యాప్‌ల ద్వారా రుణాలిచ్చేందుకు దిల్లీ, ముంబయి, నాగ్‌పూర్, బెంగళూరుకు చెందిన తొమ్మిది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ల(ఎన్‌బీఎఫ్‌సీ)తో ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ‘ధనాధన్’ యాప్‌కు ఎలాంటి అవగాహన ఒప్పందం లేకుండానే రుణాలిస్తున్నాడు. ఈ ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలిచ్చేందుకు అవసరమైన పెట్టుబడిని సమకూరుస్తాయి. రుణాలివ్వడం, తిరిగి వసూలు చేసే బాధ్యతను శరత్‌చంద్ర తీసుకున్నాడు. ఇందుకు ఎన్‌బీఎఫ్‌సీలు లాభాల్లో వాటానిస్తున్నాయి. జీఎస్టీ, ప్రాసెసింగ్, ఇతరత్రా ఛార్జీలను ముందే మినహాయించుకొని మొత్తం రుణంలో 75 శాతం నుంచి 80 శాతం రుణ గ్రహీతల ఖాతాలో జమ చేస్తున్నారు. ఏడాదికి 35 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.
నిర్వాహకులు రుణ గ్రహీతల గడువు ముగిసే రోజును 0డే-గా వ్యవహరిస్తున్నారు. ఈ కేటగిరీలోకొచ్చే వారితో చాలా మర్యాదగా మాట్లాడతారు. గడువు ముగిశాక మూడ్రోజుల వరకు వారికి ఫోన్లు చేసి రుణం తిరిగి చెల్లించకుంటే లీగల్ నోటీసులు పంపిస్తామని బెదిరిస్తారు. నాలుగోరోజు దాటిపోయాక పదో రోజు వరకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తారు. వాట్సాప్ గ్రూప్స్‌లో రుణం చెల్లించలేదంటూ ప్రచారం చేస్తారు. 11 నుంచి 30 రోజుల వరకు రుణ గ్రహీతల ఫోన్ల నుంచి స్నేహితులు, బంధువుల నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేస్తారు. ఇలా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ తొమ్మిది ఎన్‌బీఎఫ్‌సీలు, గూగుల్‌కు నోటీసులు జారీ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
సీసీఎస్ పోలీసులు దిల్లీ, హైదరాబాద్‌లలో చేపట్టిన దాడుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో బిందురాణి (హెచ్‌ఆర్ మేనేజర్), జ్యోతి మాలిక్(సీనియర్ మేనేజర్), అమిత్(మేనేజర్), రమణదీప్ సింగ్(మేనేజర్), ప్రభాకర్ ధన్‌గ్వాల్(డైరెక్టర్)లను దిల్లీలో, మధుబాబు సింగి(సెంటర్ హెడ్), మనోజ్‌కుమార్ సింగి(అసిస్టెంట్ మేనేజర్), మహేష్‌కుమార్‌సింగి(అడ్మిన్), తరుణ్(సెంటర్ హెడ్), పవన్‌కుమార్(టెక్నికల్ హెడ్), జీవన్‌జ్యోతి(హెచ్‌ఆర్ మేనేజర్)లను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. కాల్‌సెంటర్ల నుంచి 700 ల్యాప్‌ట్యాప్‌లు, సర్వర్లు, కంప్యూటర్లు, 10 బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయులను సంస్థల డైరెక్టర్లుగా నియమించి తెర వెనుక నుంచి చైనా దేశస్తులు కార్యకలాపాలు సాగిస్తుండవచ్చని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.